Nara Lokesh: అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం

తెదేపా అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేసి సత్ఫలితాలు సాధించామని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

Updated : 31 Mar 2023 22:14 IST

3 ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేశాం
అనంతపురానికి ‘కియా’ తెచ్చి ఉద్యోగాలు కల్పించాం
యువగళం పాదయాత్రలో లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: తెదేపా అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేసి సత్ఫలితాలు సాధించామని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో చేసి చూపించామన్నారు. యువగళం పాదయాత్ర గురువారం పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా హయాంలో అనంతపురం జిల్లాను మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేశాం. కడపకు ఉక్కు పరిశ్రమ, కర్నూలుకు సిమెంటు పరిశ్రమ, సోలార్‌ పార్కులు, చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్‌, ప్రకాశం జిల్లాకు పేపర్‌మిల్లు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు రాజధాని, ఉభయగోదావరి జిల్లాలకు ఫిషరీస్‌, ఫార్మా, డిఫెన్స్‌, ఉత్తరాంధ్రకు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. అన్ని జిల్లాలకు ప్రాధాన్యమిచ్చాం. రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనేదే తెదేపా నినాదం’ అని పేర్కొన్నారు. చంద్రబాబు మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. కియా పరిశ్రమ వల్ల అనంతపురం జిల్లాలో తలసరి ఆదాయం రూ.30 వేలు పెరిగిందని వివరించారు. మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతోందని, ఇటుక అయినా పేర్చారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో భాగంగా అనంతపురం వచ్చిన జగన్‌.. కియాను నకిలీ కంపెనీ అన్నారు. అధికారంలోకి వచ్చాక వైఎస్‌ రాజశేఖరరెడ్డి కారణంగానే కియా వచ్చిందంటూ అసెంబ్లీ వేదికగా ప్రచారం చేశారు. కియా నకిలీదో.. నిజమైనదో జగన్‌ చెప్పాలి’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ పెనుకొండ నియోజకవర్గంలో చేసిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు. కియా కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుందంటూ అప్పట్లో ఆరోపించారని.. కానీ ఇప్పుడు అవే భూముల్లో కియా పరిశ్రమ వచ్చి వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయి కదా అంటూ జగన్‌ను ప్రశ్నించారు లోకేష్‌. తాము అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాలనిస్తామని, స్వయం ఉపాధిలో భాగంగా యువతను ప్రోత్సహించి ఉపాధి కల్పిస్తామని.. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని’ వెల్లడించారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నాయకులు శ్రీరామ్‌, పార్థసారథి, గుండుమల తిప్పేస్వామి, సవిత, వెంకటశివుడు యాదవ్‌ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.


ఎన్టీఆర్‌ ట్రస్టు సహకారంతోనే ప్రయోజకులమయ్యాం..

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: తమ తండ్రిని నాడు ప్రత్యర్థులు కడతేర్చగా.. తమ కుటుంబాన్ని తెదేపా, ఎన్టీఆర్‌ ట్రస్టు అక్కున చేర్చుకుని ప్రయోజకులను చేసిందని నారా లోకేశ్‌కు యువకుడు సాయిచరణ్‌ వివరించారు. లోకేశ్‌ విడిది ప్రాంతానికి ఆయన కుటుంబీకులతో వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సాయిచరణ్‌ కుటుంబీకుల కథనం ప్రకారం.. 2004లో నాటి వైఎస్‌ఆర్‌ మనుషులు కురుబవాండ్లపల్లికి చెందిన తెదేపా కార్యకర్త మదన్‌మోహన్‌ను హతమార్చారు. ఆయన భార్యతోపాటు కుమారులు సాయిచరణ్‌, మోహన్‌ భవిష్యత్తు అగమ్యమైంది. పిల్లల బాధ్యతలను తెదేపా స్వీకరించి ఎన్టీఆర్‌ ట్రస్టు విద్యాలయాల్లో చేర్చింది. సాయిచరణ్‌కు ఇంటర్‌ వరకు ఉచిత విద్య, వసతి కల్పించింది. బీటెక్‌ చదవడానికి సహకరించింది. ప్రస్తుతం సాయిచరణ్‌ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు విద్యాలయాల్లోనే ఇంటర్‌ చదివిన మోహన్‌ ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు