రాహుల్‌లా 14 మంది అనర్హులయ్యారు: అనురాగ్‌

క్రిమినల్‌ కేసులలో శిక్షలు పడినవారిలో రాహుల్‌గాంధీ ఒక్కరే కాకుండా ఇంతవరకు 14 మంది శాసనకర్తలు అనర్హత వేటును ఎదుర్కొన్నారని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు.

Published : 31 Mar 2023 05:18 IST

దిల్లీ: క్రిమినల్‌ కేసులలో శిక్షలు పడినవారిలో రాహుల్‌గాంధీ ఒక్కరే కాకుండా ఇంతవరకు 14 మంది శాసనకర్తలు అనర్హత వేటును ఎదుర్కొన్నారని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు. చట్టానికి అతీతులమని భావించి గాంధీ కుటుంబం ఇప్పుడు రాహుల్‌ విషయంలో కన్నీరు పెడుతోందని విమర్శించారు. ‘ఎదుగుతున్న భారత్‌’ పేరుతో నెట్‌వర్క్‌18 ఆధ్వర్యంలో గురువారం దిల్లీలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాహుల్‌ను సమర్థించేలా ఆయన సోదరి ప్రియాంక ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు. ‘‘దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వేలమంది కనీసం పార్లమెంటు వరకు చేరుకోలేకపోయారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన మూడు తరాలు మాత్రం దేశాన్ని 60 ఏళ్లు పాలించాయి. చట్టం, పార్లమెంటు, దేశం.. ఈ మూడింటికంటే తామే ఉన్నతులమని గాంధీ కుటుంబం భావిస్తుంటుంది. జర్మనీ, అమెరికా, యూకే ముందు మాత్రం మోకరిల్లుతుంది. రాహుల్‌ను రాజకీయంగా తప్పించేందుకు కాంగ్రెస్‌లోనే పకడ్బందీగా కుట్ర జరుగుతోంది. దానిపై ప్రియాంక గానీ, ఇతర కాంగ్రెస్‌ నేతలు గానీ స్పందించడం లేదు. రాహుల్‌కు మద్దతుగా వీధుల్లోకి వచ్చి పోరాడినవారు చాలా కొద్దిమందే’’ అని ఠాకుర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని