భారాసతో పొత్తుపై అధిష్ఠానం నిర్ణయిస్తుంది: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి

భారాసతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకునే విషయం పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయమే తమకు శిరోధార్యమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారాసతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకునే విషయం పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయమే తమకు శిరోధార్యమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పేర్కొన్నారు. తొలుత తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. భారాసతో కాంగ్రెస్‌ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందా అని విలేకరులు అడగ్గా.. ‘ఎన్నికలొచ్చినప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు’ అని చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో.. పొత్తు విషయం అధిష్ఠానం నిర్ణయిస్తుందంటూ సాయంత్రం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో ఉదయం మాట్లాడిన సందర్భంగా.. తన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్‌ శక్తులకు మోదీ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నందునే భారాస సహా విపక్ష పార్టీలు కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాయన్నారు. రాహుల్‌గాంధీకి మద్దతిచ్చినంత మాత్రాన తెలంగాణలో భారాసతో పొత్తు ఉంటుందని అనుకోవడం అమాయకత్వమే అవుతుందన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా 17 విపక్ష పార్టీలు ఉమ్మడిగా ఉద్యమిస్తాయని తెలిపారు. దారుణమైన నేరాలకు పాల్పడిన భాజపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో లేని అత్యుత్సాహం రాహుల్‌ విషయంలో ప్రదర్శించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పాలనలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించే ఉంటే దేశంలో ఇన్ని పార్టీలు ఉండేవా?’ అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు