రాజధాని తరలింపు అసాధ్యం

అధికార పార్టీ దాష్టీకాలు, పోలీసు దౌర్జన్యాలు, అక్రమ కేసులకు వెరవకుండా పోరాడుతున్న అమరావతి రైతులకు చివరి వరకు వెన్నుదన్నుగా ఉంటామని పలు రాజకీయ పార్టీల నేతలు హామీ ఇచ్చారు.

Updated : 01 Apr 2023 06:13 IST

అది ఎవరి తరమూ కాదు
అమరావతి అజరామరం
ముందస్తుకు పోతే జగన్‌ ముందే ఇంటికెళ్తారు
1,200వ రోజు సభలో వివిధ పార్టీల నేతలురైతులకు సంఘీభావం

ఈనాడు, అమరావతి: అధికార పార్టీ దాష్టీకాలు, పోలీసు దౌర్జన్యాలు, అక్రమ కేసులకు వెరవకుండా పోరాడుతున్న అమరావతి రైతులకు చివరి వరకు వెన్నుదన్నుగా ఉంటామని పలు రాజకీయ పార్టీల నేతలు హామీ ఇచ్చారు. అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదని, ప్రపంచంలోని తెలుగు వారందరి ఆకాంక్ష అని నేతలు ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం ఎవరి తరమూ కాదన్నారు. మందడంలో శుక్రవారం జరిగిన 1200వ రోజు సభలో నేతలు మాట్లాడుతూ రైతుల పోరాటంలో తాము ముందుంటామని వక్తలు హామీ ఇచ్చారు.


రాజకీయ సునామీలో కొట్టుకుపోతారు

ఎంతో దూరదృష్టితో చంద్రబాబు రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. దాన్ని శాసనసభలో సమ్మతించిన జగన్‌ నేడు మాట తప్పారు. అమరావతి నుంచి రాజధానిని కాదు కదా.. మట్టి పెళ్లను కూడా ఎవరూ తరలించలేరు. వచ్చే ఎన్నికల్లో తడ నుంచి ఇచ్ఛాపురం వరకు రానున్న రాజకీయ సునామీలో అమరావతి వ్యతిరేకశక్తులు కొట్టుకుపోతాయి. వచ్చేది అమరావతి అనుకూల ప్రభుత్వమే. ఉద్యమంలో అసువులు బాసిన వారి కోసం ప్రపంచంలోనే పెద్దదైన స్మారక చిహ్నానికి శంకుస్థాపన చేయాలని కొత్త ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా. మీరు గట్టిగా చెబితే, రాజధాని ఇక్కడి నుంచి కదలదని.. ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ప్రజల తరఫున అభ్యర్థిస్తున్నా. రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతున్నప్పుడు వారు వరదల్లో చిక్కుకుంటే చేతనైనంత సాయం చేశా. అప్పటి నుంచి నాకు వైకాపాలో కష్టాలు ప్రారంభమయ్యాయి.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే


తెదేపా గెలుపు, అమరావతి అభివృద్ధి ఖాయం

రాజధాని భూములిచ్చిన రైతులు చాలా బాధలో ఉన్నారు. దీంతో నేను ఎమ్మెల్సీగా గెలిచినా సంతోషంగా లేను. ఇప్పటికే ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చారు. జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా తెదేపా అభ్యర్థి విజయం సాధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా గెలవడం, అమరావతి అభివృద్ధి రెండూ ఖాయమే.

పంచుమర్తి అనురాధ, తెదేపా ఎమ్మెల్సీ


అమరావతికే కాంగ్రెస్‌ మద్దతు

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నది కాంగ్రెస్‌ విధానం. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. భారత్‌ జోడో యాత్రలో అమరావతికి మద్దతు తెలిపారు.  

గిడుగు రుద్రరాజు, పీసీసీ అధ్యక్షుడు


అమిత్‌షా చెబితే జగన్‌ ఆగిపోతారు

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌కు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా అంటే భయం. అమరావతిని కదల్చొద్దని అమిత్‌షా ఒక్క మాట చెబితే జగన్‌ ఆగిపోతారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ ఉబలాటపడుతున్నారు. అదే జరిగితే ఆయన్ను ముందుగానే ఇంటికి పంపేయొచ్చు.

రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


జగన్‌పై హత్యానేరం మోపాలి

జగన్‌ విశాఖలో ముందుగానే 15 వేల ఎకరాలు సిద్ధం చేసుకుని,  రాజధానిని అక్కడికి మార్చాలని చూస్తున్నారు. రాజధాని ఉద్యమంలో అమరులైన 200 మంది రైతుల్లో బడుగు, బలహీనవర్గాలవారే ఎక్కువ. వారి మరణానికి కారకుడైన జగన్‌పై న్యాయవ్యవస్థ సుమోటోగా హత్యానేరం మోపాలి. అమరావతికి ప్రధాని మోదీ సుముఖంగా ఉన్నందునే వివిధ ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్‌లోనూ ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని పేర్కొంది. అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మితమవుతున్నట్లే...అమరావతిలోనూ దివ్యమైన రాజధాని నిర్మాణం జరిగి తీరుతుంది.

సత్యకుమార్‌, భాజపా జాతీయ కార్యదర్శి


రాబోయే రోజుల్లో రాజకీయ కలయిక

అమరావతి రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో మా రాజకీయ కలయిక కూడా జరుగుతుంది. రాజధాని ఇక్కడే ఉంటుంది.

ఆదినారాయణరెడ్డి, భాజపా నేత


విశాఖ అయితే దోచుకుతినొచ్చని ఆలోచన

అమరావతిని అభివృద్ధి చేయడానికి చాలా సమయం పడుతుందని, విశాఖ అయితే వెంటనే దోచుకుతినొచ్చని జగన్‌ భావించారు. రాజధాని మాకొద్దని ఉత్తరాంధ్ర వాసులు కోరుకుంటున్నారు. మా ఆస్తులు రక్షించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జగన్‌, ఆయన బంధువులు పలువురిని బెదిరించి ఆస్తులను రాయించుకున్నారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే అమరావతి అభివృద్ధి చెందుతుంది.

కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి, తెదేపా నేత


అమరావతితోనే జగన్‌ పతనం ప్రారంభం

అమరావతి ఉద్యమం కారణంగానే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన పదవి కోల్పోబోతున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా వచ్చే ఎన్నికల వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. న్యాయవ్యవస్థ వల్ల అమరావతి.. 2029 వరకు ఎవరూ కదల్చలేని సేఫ్‌ జోన్‌లోకి వెళ్లింది.

జడ శ్రావణ్‌కుమార్‌, జైభీం పార్టీ అధ్యక్షుడు


రాజధాని ఉద్యమానికి అన్ని వర్గాల అండదండలు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- తుళ్లూరు, అమరావతి: రాష్ట్ర ప్రజలందరి హితం కోసం తమ భూముల్ని త్యాగం చేసిన అమరావతి రైతులకు అన్ని వర్గాలు అండగా నిలిచాయి. అమరావతి ఉద్యమం ప్రారంభమై 1,200 రోజులవుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం శిబిరంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెదేపా, భాజపా, జనసేన,  సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై.. ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు.

హుషారెత్తించిన ఉద్యమ గీతాలు

అమరావతి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో గాయకుడు రమణ బృందం ‘రాజధాని మార్పు పేర.. మా బతుకులు బుగ్గి చేస్తే ఊరుకోము మేమంతా పాలకులారా’, ‘యుద్ధం యుద్ధం.. యుద్ధం చేద్దాం రా.. రాజధాని మన అమరావతికై యుద్ధం చేద్దాం రా’, ‘పోవాలి జగన్‌.. దిగిపోవాలి జగన్‌..’ అంటూ ఆలపించిన గీతాలు అలరించాయి. వేదిక అధ్యక్షుడు, విశ్రాంత డీఎస్పీ బొప్పన విజయకుమార్‌ రచించిన ‘తూర్పు దిక్కున సూర్యుడు.. పడమర దిక్కున పొడిచినా.. సీఎం జగన్‌ తలకిందులుగా తపస్సు చేసినా ఆగదు ఈ పోరాటం’ పాటను ఆవిష్కరించారు. న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు రచించిన ‘రోజులు మారినా.. రాష్ట్రం రగిలినా.. 1200 రోజుల పోరాటం సాగినా..  రైతులు పోరాట దీక్ష వీడలేదు.. ఈ సీఎం మూర్ఖత్వం విడవలేదు’ అని సాగే పాటనూ ఆవిష్కరించారు.

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంఘీభావం

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. రైతులకు ఫోన్‌ చేసి సంఘీభావం తెలిపారు. జగన్‌ మూడు రాజధానుల నిర్ణయంతో తాను చాలా కలత చెందానని, సీఎంకు భయపడి బయటపడలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు రైతులు తెలిపారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని