Andhra News: భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైకాపా దాడి
అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న రోజున వైకాపా నాయకులు శుక్రవారం మందడం సమీపంలో బీభత్సం సృష్టించారు. రాజధాని రైతు ఉద్యమానికి సంఘీభావం తెలియజేసి తిరిగి వస్తున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనశ్రేణిపై వైకాపా కార్యకర్తలు, నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
రాళ్లు, కర్రలతో బీభత్సం
కొందరిని ఈడ్చుకుంటూ వెళ్లి మరీ దాడి
భాజపా కార్యకర్తలు అడ్డుకోవడంతో తప్పిన ప్రమాదం
సత్యకుమార్ పీఏ కశయ్య యాదవ్, దళిత నాయకుడు సురేష్‌కు గాయాలు
అధికారపక్ష నాయకులను నియంత్రించని పోలీసులు
వైకాపా ఎంపీ అనుచరులే దాడి చేశారు..
ముఖ్యమంత్రి జగన్‌దే పథక రచన.. భాజపా ఆరోపణ
ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- తుళ్లూరు గ్రామీణం: అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న రోజున వైకాపా నాయకులు శుక్రవారం మందడం సమీపంలో బీభత్సం సృష్టించారు. రాజధాని రైతు ఉద్యమానికి సంఘీభావం తెలియజేసి తిరిగి వస్తున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనశ్రేణిపై వైకాపా కార్యకర్తలు, నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పదుల సంఖ్యలో అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించగా.. వైకాపా కార్యకర్తలు విధ్వంసకాండ సృష్టించారు. సత్యకుమార్ వ్యక్తిగత సహాయకుడు, భాజపా కార్యకర్త కశయ్య యాదవ్‌ను తీవ్రంగా కొట్టారు. చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. భాజపా దళిత నాయకుడు పణతల సురేష్‌తో మరికొందరు కార్యకర్తలనూ కొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సత్యకుమార్ ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా శ్రేణులు రాళ్లు రువ్వి, కర్రలతో కొట్టారు. సత్యకుమార్ ఎక్కడ, ఆదినారాయణరెడ్డి ఎక్కడ అంటూ వెతికారు. భాజపా శ్రేణులు సత్యకుమార్ వాహనం చుట్టూ కవచంగా నిలబడటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. దీనికి కొన్ని గంటల ముందే ఆదినారాయణరెడ్డి విజయవాడ వెళ్లిపోవడంతో ఆయన దాడి నుంచి తప్పించుకోగలిగారు. వైకాపా శ్రేణుల దాడితో మధ్యాహ్నం 1.50 నుంచి 2.15 గంటల వరకూ దాదాపు 20 నిమిషాలకు పైగా బీభత్స వాతావరణం నెలకొంది. డీఎస్పీ సహా పదుల సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నా వైకాపా కార్యకర్తలను అడ్డుకోలేదు సరికదా.. భాజపా శ్రేణుల్నే నియంత్రించేందుకు యత్నించారు. పోలీసుల కనుసన్నల్లోనే వారి సహకారంతోనే దాడి జరిగిందని భాజపా నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో.. బాపట్ల వైకాపా ఎంపీ నందిగం సురేష్ పక్కా ప్రణాళిక ప్రకారం తన అనుచరులతో దాడి చేయించారని వారు చెబుతున్నారు. దాడి అనంతరం వైకాపా ఎంపీ నందిగం సురేష్.. ఘటనా స్థలమైన మూడు రాజధానుల శిబిరం వద్దకు వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, దాడికి గురైన బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
సంఘీభావం తెలిపి తిరిగి వస్తుండగా...
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ భూములిచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం నాటికి 1,200వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మందడంలోని దీక్షా శిబిరం వద్ద జరిగిన కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసిందంటూ మాట్లాడారు. ప్రసంగం ముగిసిన తర్వాత చేయి నొప్పిగా ఉందంటూ ఆదినారాయణరెడ్డి విజయవాడకు వెళ్లిపోయారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సత్యకుమార్, ఇతర భాజపా నాయకులు.. సీడ్‌యాక్సిస్ రోడ్డు మీదుగా విజయవాడకు పయనమయ్యారు. వారి వాహన శ్రేణి మందడం మలుపు వద్దనున్న.. మూడు రాజధానుల దీక్ష శిబిరం వద్దకు చేరుకునేసరికి అక్కడ పెద్ద సంఖ్యలో మాటువేసి ఉన్న వైకాపా నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. సత్యకుమార్ ఉన్న వాహనంపైకి రాళ్లు రువ్వారు. జెండా కర్రలతో కొట్టడంతో కారు అద్దం పగిలింది. ఆ సమయంలో సత్యకుమార్ కారు లోపలే ఉన్నారు. సత్యకుమార్, ఆదినారాయణరెడ్డిలను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారెక్కడ అంటూ అన్ని వాహనాల్లో వెతికారు. భాజపా శ్రేణులు సత్యకుమార్ వాహనానికి రక్షణగా నిలబడ్డారు. వైకాపా కార్యకర్తలు, నాయకులు వారిపై పిడిగుద్దులు కురిపించారు. సత్యకుమార్ వ్యక్తిగత సహాయకుడు కాశయ్య యాదవ్‌ను ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భాజపా దళిత నాయకుడు పణతల సురేష్, మరికొంతమందిపైనా దాడి చేసి, చొక్కాలు చించేశారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. సత్యకుమార్ వాహనానికి ముందున్న వాహనం అద్దాల్ని కర్రలు, బండరాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు. సత్యకుమార్ వాహనం నుంచి దిగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వాహన శ్రేణికి అడ్డంగా ఉన్న వైకాపా నాయకుల్ని తొలగించి సత్యకుమార్‌ను, ఆయన వాహన శ్రేణిని అక్కడి నుంచి పంపించారు.
వైకాపా నాయకులు భాజపా వారిపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. సత్యకుమార్ సహాయకుడు కశయ్య యాదవ్‌ను వైకాపా శ్రేణులు ఈడ్చుకెళ్లి దాడి చేస్తుంటే.. అడ్డుకోబోయిన భాజపా నాయకుల్ని, కార్యకర్తలను వారినే రోప్ పార్టీలతో నియంత్రించారు. భాజపా నేతల వాహనాలపై దాడినీ అడ్డుకోలేదు. ఆ సమయంలో అక్కడున్న 50 మందికి పైగా పోలీసులు తలచుకుంటే అసలు దాడే జరగకుండా ఆపే అవకాశమున్నా అలాంటి ప్రయత్నమే చేయలేదు. సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి శుక్రవారం ఉదయం రాజధాని ఉద్యమ శిబిరం వద్దకు వెళ్లినప్పుడు మూడు రాజధానుల శిబిరం వద్ద పోలీసులు, వైకాపా కార్యకర్తలు ఎవరూ లేరు. కానీ భాజపా నాయకులు తిరిగి వచ్చేసరికి పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకుని దాడికి పాల్పడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని భాజపా నాయకులు ఆరోపిస్తున్నారు.
కశయ్య యాదవ్‌ను చంపాలని చూశారు..
- పి.సురేష్, దాడికి గురైన భాజపా దళిత నాయకుడు
వైకాపా నాయకులు, కార్యకర్తలు మాపై దాడి చేస్తుంటే పోలీసులు అడ్డుకోలేదు. మమ్మల్నే రోప్ పార్టీతో నియంత్రించారు. ఈ దాడికి పోలీసులే ప్రణాళిక రచించినట్లు ఉంది. వైకాపా ఎంపీ నందిగం సురేష్ అనుచరులే పక్కా ప్రణాళిక ఈ దాడికి పాల్పడ్డారు. వైకాపా గూండాలు పెద్ద రాళ్లతో మా కార్లు ధ్వంసం చేశారు. కశయ్య యాదవ్‌ను 20-30 మంది కంపచెట్లలోకి తీసుకెళ్లి చంపాలని చూశారు. అడ్డుకోబోయిన నన్ను డీఎస్పీ, కానిస్టేబుళ్లు పట్టుకుంటే.. వైకాపా కార్యకర్తలు కొట్టారు. సభకు వెళ్లేటప్పుడు ఎవరెవరు ఏ కార్లలో వెళ్లారో వారికి పక్కా సమాచారం ఉంది. ఆ ప్రకారమే దాడి చేశారు. దీనికి సూత్రధారి అయిన వైకాపా ఎంపీపై క్రిమినల్ కేసు నమోదు చేసేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
భాజపా నాయకులే దాడి చేశారు: నందిగం సురేష్
భాజపా నాయకులపై దాడి ఘటన అనంతరం.. వైకాపా ఎంపీ నందిగం సురేష్ మూడు రాజధానుల శిబిరం వద్దకు వెళ్లారు. మూడు రాజధానుల శిబిరంపై, ఎస్సీ, ఎస్టీ మహిళలపైన భాజపా నాయకులే దాడి చేశారని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి, చంద్రబాబునాయుడుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు.
* వాహనంపై తాళ్లాయిపాలేనికి చెందిన దున్న నితిన్ అలియాస్ జార్జి రాయి విసిరినట్లు తుళ్లూరు పోలీసులు గుర్తించి, అరెస్టు చేసినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు.
పక్కా ప్రణాళికతోనే దాడి: చంద్రబాబు
పక్కా ప్రణాళికతోనే భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై దాడి జరిగిందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ‘అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న సత్యకుమార్ వాహన శ్రేణిపై వైకాపా గూండాల దాడిని ఖండిస్తున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైకాపా మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు?’ అని ఆయన ట్విటర్‌లో ప్రశ్నించారు.
వైకాపా దాదాగిరికి పరాకాష్ఠ: పవన్
సత్యకుమార్ వాహన శ్రేణిపై వైకాపా దాడిని భాజపా అధినాయకత్వం తీవ్రంగా పరిగణించి సమగ్రంగా విచారించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. ‘రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని రాష్ట్ర పాలకులు సందేశమిస్తున్నారా?’ అని ప్రశ్నించారు.
నేడు నిరసనలు: సోము వీర్రాజు
దాడికి నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపిచ్చారు.
పెద్ద ప్రమాదాన్ని నిలువరించాం: అదనపు ఎస్పీ పులిపాటి అనిల్
శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ పులిపాటి అనిల్ విలేకరులతో మాట్లాడారు. ‘అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. రాజధాని రైతుల సభలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాళ్లాయపాలెం కూడలి వద్ద సీడ్ యాక్సిస్ రహదారిపై వైకాపా నాయకులు, మూడు రాజధానుల శిబిరం నాయకులు బైఠాయించి భాజపా నాయకులకు అడ్డుతగిలారు. అక్కడ భాజపా నాయకులు కారు దిగి జై అమరావతి అనడంతో ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగింది. ఇరుపక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో డీఎస్పీ వి.పోతురాజు సిబ్బందితో వెళ్లి వారిని విడదీశారు. కారులో సత్యకుమార్ ఉన్నారన్న సంగతి మాకు తెలియదు. భాజపా నాయకుల కారును పోలీసు రక్షణతో అక్కడి నుంచి పంపించి వేశాం. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో భాజపా నాయకుల కారు అద్దం పగిలింది. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నాం. పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదాన్ని నిలువరించాం. ఘటనపైనా, ముఖ్యమంత్రిపై ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించి కేసులు నమోదు చేస్తాం. మూడు రాజధానుల శిబిరంలో దాడి జరగలేదు. ఘటనా స్థలంలో స్పెషల్, రోప్ పార్టీలు ఏర్పాటు చేసి గొడవ జరగకుండా అడ్డుకున్నాం’ అని చెప్పారు. సమావేశంలో తుళ్లూరు డీఎస్పీ వి.పోతురాజు, సీఐ ఆనందరావు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్.. ఆ జట్టులో రిషభ్ పంత్‌కు స్థానం!
-
Politics News
Devineni uma: జగన్ కనుసన్నల్లో.. సజ్జల డైరెక్షన్లోనే దాడులు: దేవినేని ఉమ
-
Crime News
Guntur: ట్రాక్టర్ బోల్తా: ఆరుగురి మృతి.. 20 మందికి గాయాలు
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ‘నిర్లక్ష్యం’ అభియోగాలతో కేసు నమోదు..!
-
Movies News
Sumalatha: సీనియర్ నటి సుమలత కుమారుడి పెళ్లి.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
-
General News
CM KCR: భారాస మానవ వనరుల కేంద్రానికి సీఎం కేసీఆర్ భూమిపూజ