అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ తెలంగాణ నేతలు ఆరోపించారు.

Updated : 01 Apr 2023 05:25 IST

రాహుల్‌పై కేంద్రం కక్ష సాధింపు..
మీడియా సమావేశాల్లో కాంగ్రెస్‌ నేతలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ తెలంగాణ నేతలు ఆరోపించారు. రాహుల్‌పై అనర్హత వేటుకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం అన్ని జిల్లాకేంద్రాల్లో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒక్కోనేతకు ఒక్కో జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఖైరతాబాద్‌ డీసీసీ పరిధిలో మాజీ మంత్రి జానారెడ్డి, సికింద్రాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, రంగారెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, కరీంనగర్‌లో ఏఐసీసీ కార్యదర్శి కార్యదర్శి సంపత్‌కుమార్‌, సిద్దిపేటలో అంజన్‌కుమార్‌ యాదవ్‌, నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే సీతక్క, మంచిర్యాలలో బలరాంనాయక్‌, వరంగల్‌లో పొన్నం ప్రభాకర్‌, సంగారెడ్డిలో పొన్నాల లక్ష్మయ్యలు ఆయా డీసీసీ అధ్యక్షులతో కలిసి మాట్లాడారు. ‘‘మోదీ, అదానీల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలను బయటపెట్టి, నిలదీసినందుకే రాహుల్‌గాంధీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆరోపించారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసేవరకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

టీఎస్‌పీఎస్సీ పాలకవర్గాన్ని రద్దు చేయాలి: మల్లు రవి

టీఎస్‌పీఎస్సీ పాలకవర్గాన్ని రద్దుచేసి కొత్త కమిటీ ఆధ్వర్యంలో తిరిగి పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్‌ ఉద్యమ కార్యాచరణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు ఈ విషయంలో జోక్యం చేసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఉద్యమ కార్యాచరణ కమిటీ శుక్రవారం ఛైర్మన్‌ మల్లు రవి ఆధ్వర్యంలో సమావేశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని