దాడి ప్లాన్‌ జగన్‌దే

‘రాజధాని అమరావతి ప్రాంతంలో భాజపా శ్రేణులపై వైకాపా నేతల దాడికి ముఖ్యమంత్రి జగన్‌ పథక రచన చేశారు. జగన్నాటకంలో భాగమైన ఈ దాడి వెనుక వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ ఉన్నారు.

Updated : 01 Apr 2023 07:26 IST

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు
ఘటన వెనుక వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌
భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘రాజధాని అమరావతి ప్రాంతంలో భాజపా శ్రేణులపై వైకాపా నేతల దాడికి ముఖ్యమంత్రి జగన్‌ పథక రచన చేశారు. జగన్నాటకంలో భాగమైన ఈ దాడి వెనుక వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ ఉన్నారు. ఆయనకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే ఆదేశాలు వెళ్లాయి. లేకపోతే దాడి జరిగిన ప్రదేశానికి ముందుగానే పోలీసులు అంత పెద్ద సంఖ్యలో ఎందుకు వచ్చి ఉన్నారు? భాజపా కార్యకర్తలపై దాడి చేస్తుంటే వారు ఎందుకు చోద్యం చూశారు? భౌతిక దాడులు చేస్తున్న వారిని అడ్డుకోకుండా భాజపా కార్యకర్తలనే ఎందుకు నెట్టేసేందుకు ప్రయత్నించారు?’ అని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ప్రశ్నించారు. అమరావతిలో శుక్రవారం ఆయన వాహన శ్రేణిపై, కార్యకర్తలపై దాడి అనంతరం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనను భాజపా జాతీయ నాయకత్వం చూస్తూ ఊరుకోబోదని, కార్యాచరణను రూపొందించుకుని వైకాపా ప్రభుత్వంపై పోరాడతామని ప్రకటించారు. ‘డీజీపీకి ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఎంపీ నందిగం సురేశ్‌కు, ఎస్పీ, డీఐజీ, డీజీపీకి ఎక్కడినుంచి ఆదేశాలు వెళ్లాయనేది తేలాలి. గూగుల్‌ టేకౌట్‌ తీస్తే ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయనేది బయటపడుతుంది’ అని అన్నారు.

భాజపాతో బాగున్నట్లు వైకాపా మైండ్‌గేమ్‌

‘గడప గడపకు వెళుతుంటే ప్రతి చోట వైకాపాకు నిరసనలు, ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. దాన్ని భరించలేక ఒత్తిడికి లోనవుతున్నారు. అందుకే భాజపాతో బాగున్నట్లు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. కానీ వాస్తవం వేరు. వైకాపాకు భాజపా నుంచి వారు ఆశించిన సహకారం లేదు. రాజధాని అమరావతి సభ వద్ద పది మంది పోలీసులు లేరు. 3 రాజధానుల శిబిరంలో 10మంది జనాలుంటే వంద మంది పోలీసులు ఉండటమేంటి? మాపై దాడి చేయించడమేంటి? మా కార్యకర్తలను కొడుతుంటే డీఎస్పీ అడ్డుకోకుండా నన్ను అక్కడినుంచి వెళ్లమన్నారు. అదేంటో అర్థం కావట్లేదు. దాడి వెనక పెద్దకుట్ర ఉంది’ అని సత్యకుమార్‌ పేర్కొన్నారు.  ‘భాజపా నేత ఆదినారాయణరెడ్డి తప్పించుకున్నారని ఎంపీ నందిగం సురేశ్‌ మాట్లాడుతున్నారంటే ఏంటి అర్థం? వాహనశ్రేణిలో ఆదినారాయణరెడ్డి ఉంటే ఆయన్నూ బాబాయిపై గొడ్డలి పోటు వేసిన మాదిరి చంపేసేవాళ్లా?’ అని ప్రశ్నించారు. ‘దాడి చేసేటప్పుడు నా పేరునే అడిగారట. నాపై కక్ష కట్టారు’ అని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని