వైకాపా కార్యకర్తలు నన్ను తీవ్రంగా కొట్టారు

‘‘నేడు దగాపడ్డ రైతులు-దోపిడీకి గురవుతున్న ఆంధ్ర పౌరులు అనే పేరుతో మందడంలో నిర్వహించిన కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మరో నాయకుడు వల్లూరి జయప్రకాష్‌ నారాయణను ఆహ్వానించారు.

Updated : 01 Apr 2023 06:35 IST

గుంటూరు డీఐజీకి బీజేవైఎం నేత సురేష్‌ ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ‘‘నేడు దగాపడ్డ రైతులు-దోపిడీకి గురవుతున్న ఆంధ్ర పౌరులు అనే పేరుతో మందడంలో నిర్వహించిన కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మరో నాయకుడు వల్లూరి జయప్రకాష్‌ నారాయణను ఆహ్వానించారు. వారు ఆ సభకు హాజరై తిరిగి వెళుతుండగా మందడం గ్రామం బయట మూడు రోడ్ల కూడలిలో  పోలీసు రోప్‌ పార్టీ, వైకాపా కార్యకర్తలు మా నేతల వాహనాలను ఆపారు. మా(భాజపా) కార్యకర్తలు దిగి ఇది అన్యాయం అని మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి పెద్ద సంఖ్యలో అమరావతికి మద్దతు తెలిపేవారిని ఊరుకునే పనిలేదు.. మీ అంతు చూస్తాం అని అంటూ వైకాపా కార్యకర్తలు నన్ను తీవ్రంగా కొట్టి, చంపే ప్రయత్నం చేశారు’’ అని బీజేవైఎం మాజీ జాతీయ కార్యదర్శి, ఎస్సీ నాయకుడు పనతల సురేష్‌ గుంటూరు రేంజ్‌ డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రతిని ఆయన తరఫున భాజపా నాయకుడు వల్లూరి జయప్రకాష్‌నారాయణ శుక్రవారం రాత్రి గుంటూరులో డీఐజీ త్రివిక్రమ వర్మకు అందజేశారు.

ఆ ఫిర్యాదులో సురేష్‌ ఏమన్నారంటే...

‘వైకాపా కార్యకర్తలు నన్ను తీవ్రంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. నేను కారులో ఎక్కి దాక్కుంటే కర్రలతో చితకబాదారు. కర్రలు, మారణాయుధాలతో మాపై మూకుమ్మడి దాడి చేశారు. మా కారును ధ్వంసం చేశారు. అమరావతి అంటే నరికేస్తాం అంటూ నన్ను, మిగిలిన వారి ప్రాణాలకు ముప్పు కలిగించేలా వైకాపా కార్యకర్తలు వ్యవహరించారు. సత్యకుమార్‌, ఆదినారాయణరెడ్డిలు ఎక్కడని ప్రశ్నిస్తూ దుర్భాషలాడారు. భాజపా ఓబీసీ నేత కాశయ్య యాదవ్‌నూ కొట్టారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకొని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.


వైకాపా నాయకులను అడ్డుకుంటాం
- వల్లూరి జయప్రకాష్‌ నారాయణ, భాజపా నాయకుడు

మూడు రాజధానుల పేరుతో వైకాపా దాడికి పాల్పడింది. ఇది భాజపాపై జరిగిన దాడి. దీన్ని మా పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దాడిని నిరసిస్తూ శనివారం అన్ని కలెక్టరేట్ల ముందు నిరసనలకు పిలుపునిచ్చాం. ఎంపీ సురేష్‌ ఆధ్వర్యంలోనే మాపై దాడి జరిగింది. దీనికి వైకాపా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.


నిందితులపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: సత్యకుమార్‌ వాహనంపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు డిమాండు చేశారు. ‘మూడు రాజధానులన్న ముఖ్యమంత్రి జగన్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత చెంప పగలగొట్టింది. అయినా ఆయన తీరు మారలేదు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ రెండు చెంపలు వాయించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

* వైకాపా కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెదేపా మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ పేర్కొన్నారు. ‘జాతీయ పార్టీ నేతలకూ రాష్ట్రంలో రక్షణ కరవైంది. ఇక సామాన్యుల పరిస్థితేమిటి?’ అని ప్రశ్నించారు.

* ‘సత్యకుమార్‌ వాహనశ్రేణిపై అధికార పార్టీ దన్నుతో కొందరు గూండాలు దాడి చేయడం హేయం. హింసను ప్రోత్సహించే వారు ఎప్పటికైనా పతనమవుతారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుంది’ అని కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి పేర్కొన్నారు.  

* వైకాపా గూండాలు సత్యకుమార్‌పై దాడి చేయడం నీచమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు తావు లేదని, గుండాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

* సత్యకుమార్‌ వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడడం దుర్మార్గమని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. దాడికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.  

* దాడి సంఘటనఫై సమగ్రంగా విచారించాలని ప్రధాని నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మార్గదర్శకత్వంలోనే వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలిపారు.

* పోలీసులు, వైకాపా నేతలు పక్కా ప్రణాళికతో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు