గిరిజన వర్సిటీకి అనుమతి ఇవ్వకుండా కేంద్రం వివక్ష: సత్యవతి రాథోడ్‌

గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వకుండా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు.

Published : 02 Apr 2023 04:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వకుండా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన 300 ఎకరాల భూమి, భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పగించినా.. కేంద్ర మంత్రిమండలి అనుమతి ఇవ్వడం లేదన్నారు. పదో తరగతి పరీక్షలపై గిరిజనశాఖ కార్యదర్శి క్రిస్టీనా, ఎస్టీ గురుకులాల కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌, అదనపు కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డితో కలిసి ఐటీడీఏ పీవోలతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. గిరిజన గురుకులాల నుంచి 6,573 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, వీరికి ప్రభుత్వం తరఫున రూ.8,21,625 ఫీజు చెల్లించామని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో రూ.2 వేల కోట్ల ఖర్చుతో ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్లు వేయనున్నాం.ఆశ్రమ పాఠశాలలకు కొత్తగా 298 సీఆర్‌టీ పోస్టులు మంజూరు చేయడంతోపాటు వారికి ఏడాదిలో 12 నెలలూ వేతనాలు అందించాలని నిర్ణయించాం. పోడు చట్టానికి లోబడి గిరిజనులకు త్వరలో పట్టాలు పంపిణీ చేస్తాం. పోడు వ్యవసాయం చేసే రైతులకు గిరివికాసం కింద నిధులతో పాటు రైతుబంధు అందిస్తాం. జీసీసీ వరుసగా మూడేళ్లు లాభాలు ఆర్జించడంతో.. 30 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతి మంజూరు చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో 623 మంది ఏఎన్‌ఎంలను పొరుగుసేవల పద్ధతిలో నియామకానికి అనుమతించాం’’ అని మంత్రి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు