అభివృద్ధిపైనే ఓట్లడుగుతాం.. మీకా దమ్ముందా?

‘నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మీదనే మేం ఓట్లడుగుతాం.. మీ సర్కార్‌ చేసిన పనులు చెప్పి ఓట్లడిగే దమ్ము మీకు ఉందా?’ అని భాజపా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు.

Published : 02 Apr 2023 04:09 IST

మోదీ, కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణకు సిద్ధమా?
మంత్రి కేటీఆర్‌కు భాజపా ఎంపీ లక్ష్మణ్‌ సవాల్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ‘నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మీదనే మేం ఓట్లడుగుతాం.. మీ సర్కార్‌ చేసిన పనులు చెప్పి ఓట్లడిగే దమ్ము మీకు ఉందా?’ అని భాజపా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. మోదీ, కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ప్రధాని ఈ నెల 8న రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని లక్ష్మణ్‌ వెల్లడించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం పదవి ఊడిపోతుందన్న మూఢనమ్మకంతో కేసీఆర్‌ శ్రీరామనవమి రోజు భద్రాచలం వెళ్లలేదని ఆరోపించారు. ‘‘పేదల కోసం యూపీలో 1.75 కోట్ల ఇళ్లు కడితే.. తెలంగాణలో కట్టినవి 26 వేలు. అవి కూడా గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లలోనే. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేని రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ మాత్రమే. పెట్రోల్‌, డీజిల్‌ మీద కేంద్రం పన్ను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఎందుకు తగ్గించలేదు? వాటిని జీఎస్టీ పరిధిలోకి రాకుండా అడ్డుకున్నదే మంత్రి హరీశ్‌రావు’ అని లక్ష్మణ్‌ మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ తన స్థాయి మరిచి ప్రధానిపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో కుటుంబ పార్టీలైన కాంగ్రెస్‌, జేడీఎస్‌, భారాస కలుస్తాయని లక్ష్మణ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు