మేం ఒంటరిగానే పోటీ చేస్తాం
వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, భారాసలు ఇప్పుడు కొట్టుకుని ఎన్నికల్లో కలిసి పోతాయ్
కాంగ్రెస్‌తో కలిసి పని చేయబోమని వై.ఎస్.షర్మిలకు చెప్పా
భాజపా అధ్యక్షుడు బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు భారాస, కాంగ్రెస్‌లు కొట్టుకుని తర్వాత కలిసిపోతాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయనే విషయాన్ని గతంలో కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తాజాగా జానారెడ్డి చెప్పారన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం గురించి షర్మిల తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని సంజయ్ తెలిపారు. తాము కాంగ్రెస్‌తో కలిసి పనిచేయబోమని ఆమెకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. శనివారం సంగారెడ్డిజిల్లాకు చెందిన భారాస, ఇతర పార్టీల నాయకులు పలువురు భాజపాలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో సంజయ్ మాట్లాడుతూ... ‘దేశంలో తెలంగాణ దేనికి మోడల్? రైతుల ఆత్మహత్యల్లోనా, ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంలోనా, మొదటి తేదీన జీతాలు ఇవ్వకపోవడంలోనా, ఉచిత యూరియా, రుణమాఫీ హామీలిచ్చి మోసం చేయడంలోనా..? సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మహారాష్ట్ర రైతుల చేరికల డ్రామా నడుస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో కొడుకును, మద్యం దందాలో బిడ్డను కాపాడుకునేందుకే బెంగాల్ తరహా పాలన చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు.
టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలి
30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు అంధకారం అవుతుంటే సీఎం స్పందించడం లేదు. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా రద్దు చేయాలి. ఇద్దరి తప్పిదంతోనే లీకేజీ అని మంత్రి అన్నారు. మరి 15 మందిని ఎందుకు అరెస్టు చేశారు? 104 మందిని ఎందుకు విచారించారు? ఈ విషయంలో కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదు? లీకేజీ వ్యవహారంలో భారాసకు చెందిన పెద్ద మనుషులను కాపాడేందుకు చిన్నవాళ్లను అరెస్టు చేసి కేసును మూసివేయాలన్న కుట్ర చేస్తున్నారు’ అని ఆరోపించారు.
త్వరలో విజయ్ సంకల్ప యాత్రలు: తరుణ్ఛుగ్
సంస్థాగత ఎన్నికల అనంతరమే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో పార్టీ నాయకుల సమావేశంలో, మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘కేసీఆర్ కుటుంబ దోపిడీ రాష్ట్రం దాటి దేశానికి విస్తరించింది. రాష్ట్రంలో త్వరలోనే విజయ్ సంకల్ప యాత్రలు ప్రారంభిస్తాం. ఈ నెల 6న పార్టీ వ్యవస్థాపక దినం, 11న ఫులే జయంతి, 14న అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం’ అని తెలిపారు.
7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్ల నియామకం
వివిధ జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ నియమించారు. మహబూబ్‌నగర్‌కు అచ్చుగట్ల అంజయ్యను, దేవరకద్రకు కుర్రా రమేశ్‌ను, జడ్చర్లకు పూలమోని నర్సింహులును, షాద్‌నగర్‌కు విజయ్ కుమార్‌ను, పెద్దపల్లికి దాడి సంతోష్‌యాదవ్‌ను, రామగుండానికి పిడుగు కృష్ణను, జయశంకర్-భూపాలపల్లి జిల్లా పరిధిలో మంథని నియోజకవర్గంలోని మండలాలకు మల్కా మోహన్‌రావును, పెద్దపల్లి జిల్లా పరిధిలోని మండలాలకు సంయుక్త కన్వీనర్‌గా నారపల్లి రమేశ్‌ను నియమించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
-
India News
Odisha Train Accident: టీవీ దృశ్యాలతో కుమారుడిని గుర్తించిన నేపాల్ జంట
-
Ap-top-news News
Amaravati: మంత్రి నాగార్జున కసురుకొని.. బయటకు నెట్టేయించారు: కుటుంబం ఆవేదన
-
India News
రూ.2వేల నోట్ల మార్పిడికి అనుమతిపై రిజిస్ట్రీ నివేదిక తర్వాతే విచారణ: సుప్రీం