కొందరు నా సమాధి కడతామంటున్నారు
తన ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం వారు సుపారీ కూడా ఇచ్చారని పేర్కొంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అందుకు సుపారీ కూడా ఇచ్చారు
విదేశీ శక్తులూ దీనికి సహకరిస్తున్నాయి
కాంగ్రెస్‌పై ప్రధాని ధ్వజం
భోపాల్: తన ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం వారు సుపారీ కూడా ఇచ్చారని పేర్కొంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఇక్కడ రాణి కమలాపతి స్టేషన్‌లో భోపాల్-దిల్లీ మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ‘‘2014 నుంచి నా ప్రతిష్ఠను నాశనం చేయడానికి కొందరు కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం వీరు సుపారీ కూడా ఇచ్చారు. వీరికి మద్దతుగా ఉన్న కొందరు దేశం లోపల, మరికొందరు దేశం బయట ఉండి పనిచేస్తున్నారు. కానీ భారత్‌లో పేద, మధ్య తరగతి, దళిత, వెనకబడిన వర్గాలు నాకు కవచంగా ఉన్నాయని తెలిసేసరికి వీరికేం చేయాలో తోచడంలేదు. రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నా సమాధి కడతామంటున్నారు’’ అని పేర్కొన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ఇటీవల లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలు చేయడం, తదనంతరం ఆయన లోక్‌సభ సభ్యత్వ అనర్హత అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని బ్రిటన్, జర్మనీ ప్రకటించడం.. తదితర అంశాల నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏప్రిల్ ఫూలంటారేమో..!
ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ‘‘ఏప్రిల్ ఒకటిన వందే భారత్ రైలు ప్రారంభించాలని చెప్పారు. ఆ రోజు ఎందుకు పెట్టారు... పత్రికల్లో ఆ రోజు నేను ప్రారంభించనున్నానని వస్తే... మోదీ ఏప్రిల్ ఫూల్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇచ్చినా ఇస్తుందని చెప్పా. కానీ మీరు చూస్తున్నారుగా.. ఏప్రిల్ ఒకటినే ఈ రైలు ప్రారంభమైంది. ఇది మా సామర్థ్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక’’ అని ప్రధాని తెలిపారు.
సైన్యం సన్నద్ధతను సమీక్షించిన ప్రధాని
అంతకుముందు భోపాల్‌లో అత్యున్నత సైనికాధికారులు నిర్వహిస్తున్న కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధదళాల సన్నద్ధతను ప్రధాని సమీక్షించారు. కొత్తగా, ఎప్పటికప్పుడు ఉద్భవిస్తున్న సమస్యలను ఎదుర్కొవడానికి సైన్యం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సాయుధ బలగాలకు అవసరమైన ఆయుధాలు, సాంకేతికతలను సమకూర్చేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఈ మూడు రోజుల సదస్సులో చైనాతో సరిహద్దులో ఎదురవుతున్న భద్రతా సవాళ్లను, పాక్ సరిహద్దు నుంచి వస్తున్న ఉగ్రవాదం, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ రూపొందించే ప్రణాళిక, అగ్నిపథ్ పథకం అమలు తదితర అంశాలపై కమాండర్లు చర్చించారు. కొవిడ్-19 సోకడంతో భారత నౌకాదళ అధిపతి ఆర్.హరికుమార్ ఈ ముగింపు సమావేశంలో పాల్గొనలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: జమ్మూకశ్మీర్‌లో జూన్ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ: తితిదే
-
Sports News
ICC: లాహోర్‌లో ఐసీసీ ఛైర్మన్.. ప్రపంచకప్‌లో పాక్ ఆడే అంశం ఓ కొలిక్కి వచ్చేనా..?
-
General News
Weather Update: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
World News
China: భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా..!
-
India News
Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్..!
-
Crime News
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు