ఎన్నిక ఏదైనా ‘శాసించేది వారే!’

కర్ణాటక చరిత్రలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన సామాజిక వర్గమది. 9 శతాబ్దాల క్రితమే సమాజంలో నెలకొన్న వివక్షకు, కరడుగట్టిన సంప్రదాయాలకు వ్యతిరేకంగా గళమెత్తి బడుగు వర్గాలకు అండగా నిలిచింది.

Updated : 02 Apr 2023 09:16 IST

విజేతల రాతలు లిఖించే లింగాయత్‌లు
100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాబల్యం
అన్ని పార్టీల గురి ఆ సామాజిక వర్గం ఓట్లపైనే
కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర
ఈనాడు ప్రత్యేక విభాగం

కర్ణాటక చరిత్రలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన సామాజిక వర్గమది. 9 శతాబ్దాల క్రితమే సమాజంలో నెలకొన్న వివక్షకు, కరడుగట్టిన సంప్రదాయాలకు వ్యతిరేకంగా గళమెత్తి బడుగు వర్గాలకు అండగా నిలిచింది. బసవన్న  ఆదర్శాలతో సకల వర్గాల ఆదరణను చూరగొంది. లింగాయత్‌ లేదా వీరశైవ లింగాయత్‌లుగా పేరొందిన ఈ సామాజిక వర్గం ఆధునిక రాజకీయాల్లోనూ తనదైన విశిష్టతను నిలుపుకుంటోంది.

రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గంగా ఉన్న లింగాయత్‌లు.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను శాసిస్తారు. మొత్తం 224 శాసనసభ నియోజక వర్గాలకు గాను వంద స్థానాల్లో వీరి ప్రభావం అధికం.

రాష్ట్ర జనాభాలో 17 శాతం మంది లింగాయత్‌లు కాగా వక్కళిగలు 15 శాతం, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 18 శాతం, ముస్లింలు 12.92 శాతం, బ్రాహ్మణులు 3 శాతంగా ఉన్నారు. అయితే, 2013 నుంచి 2018 వరకు రాష్ట్రంలో నిర్వహించిన కులాల వారీ జనాభా లెక్కల ప్రకారం లింగాయత్‌లు 9 శాతం, వక్కళిగలు 8 శాతానికి పరిమితమైనట్లు సమాచారం. ఈ నివేదిక ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుత అసెంబ్లీలో 54 మంది లింగాయత్‌ ఎమ్మెల్యేలుంటే వీరిలో 37 మంది భాజపాకు చెందినవారే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు లింగాయత్‌ మఠాలు కూడా రాజకీయంగా ప్రభావితం చేస్తాయి. లింగాయత్‌లలో ఉండే ఉప కులాలదీ ముఖ్య భూమికే. విద్య, ఉద్యోగాల్లో అధిక వాటా కోరుతూ ఆందోళనకు దిగడంతో భాజపా సర్కారు రాష్ట్ర ఓబీసీ జాబితాలో లింగాయత్‌లకు ఉన్న రిజర్వేషన్‌ను మరో 2 శాతం పెంచాలని నిర్ణయించింది.


ఆ తప్పిదం.. హస్తం పాలిట శాపం

వాస్తవానికి 1989 వరకు లింగాయత్‌లు కాంగ్రెస్‌కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉండేవారు. లింగాయత్‌ వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్‌ నాయకత్వంలో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 224 స్థానాలకు గాను 178 చోట్ల విజయఢంకా మోగించింది. అయితే, 1990లో పాటిల్‌ అనారోగ్యానికి గురై కోలుకుంటున్న సమయంలో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీవ్‌ గాంధీ వెనుకబడిన తరగతులకు చెందిన ప్రముఖ నేత బంగారప్పను సీఎంగా నియమించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో దీన్ని కీలక మలుపుగా చెప్పుకుంటారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు లింగాయత్‌లను దూరం చేసింది. ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 34 స్థానాలకు పరిమితమైంది. ఈ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్ప భాజపా అగ్రనేతగా ఎదిగారు.


సొంత పార్టీతో యడియూరప్ప తడాఖా

భాజపా, జేడీఎస్‌ మధ్య కుదిరిన అధికార పంపిణీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కుమార స్వామి.. 2007లో సీఎం పదవిని యడియూరప్పకు అప్పగించేందుకు నిరాకరించడంతో అప్పటి ప్రభుత్వం కుప్పకూలింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప నేతృత్వంలో 110 స్థానాల్లో గెలుపొందిన భాజపా.. కర్ణాటకలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం 40 స్థానాలకే పరిమితమైంది. అందుకు కారణం.. భాజపా నుంచి యడియూరప్ప దూరం కావడం. ఆయన కర్ణాటక జనతా పక్ష పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించి ఆ ఎన్నికల్లో 6 స్థానాల్లో మాత్రమే గెలిచారు. అయినప్పటికీ 10 శాతం ఓట్లు సాధించి భాజపా ఓటమికి కారణమయ్యారు.


సారథిని మార్చినా సామాజిక వర్గం అదే

2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు యడియూరప్ప తిరిగి భాజపా గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 104 స్థానాల్లో నెగ్గింది. మరోసారి యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 75 ఏళ్లు దాటిన వారు కీలక పదవుల్లో ఉండరాదనే పార్టీ విధానం కారణంగా 2021లో సీఎం పదవి నుంచి ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ లింగాయత్‌ వర్గానికే చెందిన బసవరాజ్‌ బొమ్మైని భాజపా సీఎంను చేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని యడియూరప్ప ప్రకటించినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆయన్నే ప్రధాన సారథిగా భాజపా ముందుంచింది.


కాంగ్రెస్‌ ఆకర్షణ యత్నాలు

గతంలో తమ ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను తిరిగి ఆకట్టుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. లింగాయత్‌ ఎమ్మెల్యే ఎం.బి.పాటిల్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ నియమించింది. మరో లింగాయత్‌ ఎమ్మెల్యే ఈశ్వర్‌ ఖండ్రేను కర్ణాటక కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. మేలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో లింగాయత్‌లను ప్రసన్నం చేసుకునేందుకు అటు భాజపా, ఇటు కాంగ్రెస్‌ పోటీపడుతున్నాయి.


లింగాయత్‌ల చారిత్రక నేపథ్యమిదీ...

* లింగాయత్‌ మత ఆవిర్భావం 12వ శతాబ్దంలో జరిగింది. వ్యవస్థాపకుడు బసవ. ఆయన వేదాలను, వాటికి సంబంధించిన విశ్వాసాలను తిరస్కరించారు.

* లింగాయత్‌లు ఆలయాలను సందర్శించరు. బహుదేవతారాధనకు వ్యతిరేకులు. కుల వ్యవస్థను నిరసిస్తారు.

* వీరి దృష్టిలో స్త్రీ, పురుషులు సమానులే. భర్త చనిపోయిన మహిళ పిల్లలను దత్తత తీసుకోవచ్చు. మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. బాల్య వివాహాలు నిషేధం.

* లింగాయత్‌లు భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.

* 1956 నుంచి 1969 వరకు కర్ణాటకలో ముఖ్యమంత్రులైన వారిలో నలుగురు..ఎస్‌.నిజలింగప్ప, బి.డి.జట్టి, ఎస్‌.ఆర్‌.కాంతి, వీరేంద్ర పాటిల్‌.. లింగాయత్‌లే.

* 1969 తర్వాత కాంగ్రెస్‌ చీలికల ప్రభావం లింగాయత్‌లపైనా పడింది.

* 1983-89 మధ్యకాలంలో లింగాయత్‌లు జనతా పార్టీలో ప్రాబల్యం వహించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రులైన ఎస్‌.ఆర్‌.బొమ్మై, జె.హెచ్‌.పటేల్‌ ఈ సామాజిక వర్గం వారే.

* కాల క్రమంలో లింగాయత్‌లు భాజపా వైపు మళ్లారు. 2006-07లో బి.ఎస్‌.యడియూరప్ప నేతృత్వంలో భాజపా కర్ణాటకలో జేడీ(ఎస్‌)తో కలిసి అధికారాన్ని పంచుకునే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత క్రమంలో ఈ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్ప, జగదీశ్‌ శెట్టర్‌, బి.ఎస్‌.బొమ్మై ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు.

* ప్రస్తుతం భారత దేశంలో లింగాయత్‌లు 3 కోట్ల మందికి పైగా ఉంటారని అంచనా. వీరిలో కర్ణాటకలో 1.5 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.09 కోట్లు, తెలంగాణలో సుమారు 50 లక్షల మంది నివసిస్తున్నారు. తమిళనాడు, కేరళ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ వీరు గణనీయంగా ఉన్నారు.


1956 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో..

లింగాయత్‌లు 9 మంది

వొక్కళిగలు ఆరుగురు

ఓబీసీలు అయిదుగురు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు