వైకాపా అరాచక పాలన నశించాలి

సత్యకుమార్‌ వాహనశ్రేణిపై వైకాపా దాడిని నిరసిస్తూ భాజపా కార్యకర్తలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లాకేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు.

Published : 02 Apr 2023 04:09 IST

భాజపా నిరసన ప్రదర్శనలు
సత్యకుమార్‌ వాహనంపై దాడికి ఖండన

ఈనాడు, అమరావతి: సత్యకుమార్‌ వాహనశ్రేణిపై వైకాపా దాడిని నిరసిస్తూ భాజపా కార్యకర్తలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లాకేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు వినతిపత్రాలిచ్చారు. విజయవాడలోని భాజపా ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ప్రదర్శన కొనసాగింది. ‘భాజపా నేతలు, కార్యకర్తలపై వైకాపా గూండాల దాడిని ఖండిద్దాం. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడుదాం’ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సోమువీర్రాజు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘సత్యకుమార్‌, ఇతరులపై దాడి పోలీసుల సమక్షంలో ప్లాన్‌ ప్రకారం జరిగిందని భావిస్తున్నాం. ఇది ప్రభుత్వ పిరికిపంద చర్య. నిందితులపై హత్యాయత్నం, దాడి, కుట్ర కేసులకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేయాలి. ఈ సంఘటనపై పార్టీ అధిష్ఠానానికి నివేదిక పంపించాం’ అని తెలిపారు. విశాఖలోని ఎల్‌ఐసీ భవనం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సీనియర్‌ నేతలు విష్ణుకుమార్‌రాజు, మాధవ్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ తదితరులు మాట్లాడారు. తిరుపతి జిల్లా నేతల ఆధ్వర్యంలో నాయుడుపేటలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. భాజపా నాయకుడు వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో పోలీసుల అడ్డు

గుంటూరు లాడ్జిసెంటర్‌లో ధర్నా సందర్భంగా భాజపా కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో దిష్టిబొమ్మ దహనానికి తెచ్చిన పెట్రోలు పొరపాటున కార్యకర్తలపై పడింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. భాజపా రాష్ట్ర లీగల్‌సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల కన్వీనర్లు తోట రామకృష్ణ, డాక్టర్‌ ఉమాశంకర్‌ పాల్గొన్నారు. నరసరావుపేటలో నిరసన ప్రదర్శన తర్వాత కలెక్టరేట్‌లో ఏవోకు విన్నపమిచ్చారు. వినుకొండలోని స్తూపంసెంటరులో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజబాబు ఆధ్వర్యంలో శ్రేణులు నిరసన చేపట్టాయి.


సత్యకుమార్‌కు ఎంపీ నాని పరామర్శ

విజయవాడ, న్యూస్‌టుడే: భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఉన్న సత్యకుమార్‌ను నాని తెదేపా కార్యకర్తలతో పాటు శనివారం కలిశారు. ఘటన తాలూకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని