Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు: గంటా

‘రాజధానిపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర యువత తీర్పు ఇచ్చారు. అక్కడి ప్రజలు రాజధాని కావాలని కోరుకోవడం లేదు’.. అని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Updated : 02 Apr 2023 07:28 IST

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ‘రాజధానిపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర యువత తీర్పు ఇచ్చారు. అక్కడి ప్రజలు రాజధాని కావాలని కోరుకోవడం లేదు’.. అని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి శనివారం వచ్చిన గంటా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితర తెదేపా నాయకులతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘గుంటూరు ఎప్పుడు వచ్చినా మిత్రుడు కన్నా లక్ష్మీనారాయణను మర్యాద పూర్వకంగా కలుస్తుంటా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమరావతికి, తెదేపాకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. ఎలాగైనా గెలవాలని వైకాపా వెండి నాణాలు, నగదు పంపిణీ చేసినా ప్రజలు ఓట్లు వేయలేదు. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న అభిప్రాయంతో ఓటర్లు ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. తెదేపా, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమరావతిలో మూడు రాజధానుల నిరసనకారులు ఎవరూ లేరని, ప్రభుత్వమే ఈ శిబిరాన్ని నిర్వహిస్తోందన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ‘తెనాలి, పుట్టపర్తిలో తెదేపా నేతలపై దాడులకు పాల్పడ్డారు. వైకాపా వారికి ఓటమి కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే దాడులకు తెగబడుతున్నారు’ అని మండిపడ్డారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు చిట్టాబత్తిన చిట్టిబాబు, దాసరి రాజామాస్టారు, తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని