ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధం
రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో వైకాపాను ఓడించడమే తమ ధ్యేయమని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. వైకాపాకు చెందిన చాలామంది ఎమ్మెల్యేలు తమ నేతలను సంప్రదిస్తున్నారని వివరించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ట్రైలర్ మాత్రమే
అసలు సినిమా ముందుంది
దేశంలోనే సంచలనాత్మకం.. వివేకా హత్యకేసు
ఈ కేసు వీగిపోతే వ్యవస్థలపై నమ్మకం పోతుంది
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో వైకాపాను ఓడించడమే తమ ధ్యేయమని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. వైకాపాకు చెందిన చాలామంది ఎమ్మెల్యేలు తమ నేతలను సంప్రదిస్తున్నారని వివరించారు. ‘రాష్ట్రంలో రేపే ఎన్నికలు పెట్టినా మేం సిద్ధం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమేంటో చూపించాం. ఇది షాక్ ట్రీట్‌మెంటే. రాబోయే ఎన్నికల్లో పర్మినెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తాం. జగన్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌రెడ్డి పుట్టిందే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి.. విధ్వంసమే ఆయన ఎజెండా. అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి పని చేశామని ఆయన చెప్పగలరా? దేశంలో నంబరు 1 దోపిడీదారుడు ఆయనే.. 2004కు ముందు ఆయన కుటుంబ ఆదాయం ఎంత? ఈ రోజు ఎంత? దేశంలోని అందరు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల్ని కలిపినా ఆయనకు సమానంగా ఉండరు. రాష్ట్ర సంపదను లూటీ చేసిన జగన్‌రెడ్డే.. తాను పేదల ప్రతినిధి అనడం అబద్ధం కాదా?’ అని నిలదీశారు. జగన్ రాజకీయాలకు, ప్రజా జీవితానికే అర్హులు కారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఒకటో తేదీన ఎవరికైనా జీతాలు, పింఛన్లు వచ్చాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘రూ.3,62,373 కోట్ల అప్పు ఉందని 2019లో శ్వేతపత్రం ఇచ్చారు. ఈ రోజుకు అది రూ.10,31,846 కోట్లు అయింది. ఒక్క ఏడాదిలోనే రూ.96,273 కోట్ల అప్పు చేశారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీల పెంపుదల, విద్యుత్తు ఛార్జీలు, ఆస్తిపన్ను.. ఇలా ఏడాదికి 15% చొప్పున పెంచేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
జగన్ విధ్వంసానికి పరాకాష్ఠ ఇది
విధ్వంసం పరాకాష్ఠకు చేరితే రాష్ట్రం ఎలా తయారవుతుందో చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. ‘తెలంగాణకు హైదరాబాద్ వరం. ఆంధ్రప్రదేశ్‌కు సముద్రతీరం, సారవంతమైన భూములు, పనిచేసే మనుషులు, కృష్ణా, గోదావరి, పోలవరం అన్నీ వరాలే. అలాంటి సందర్భంలో ప్రణాళికాయుతంగా ముందుకెళ్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే మొదటి, రెండోస్థానాల్లో ఉండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలోకి చేరింది. దీనికి నాయకత్వమే కారణం. హైదరాబాద్ వల్ల తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,08,772 ఉంది. విధ్వంసం చేయలేదు కాబట్టే.. దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అందుకే అక్కడి ముఖ్యమంత్రుల్ని నేను అభినందించాను. ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.2,19,518. ఆస్తులు అవే.. చెరిసగం పంచుకున్నాం.. నాయకత్వలోపమే దీనికి కారణం.. ఇంకొన్నాళ్లు జగన్ లాంటివారే ఉంటే.. దేశంలో మనరాష్ట్రం అట్టడుగు స్థానానికి చేరుతుంది. ప్రజలకు బాధ అనిపించదా? ఒక మనిషి ఎంత వేగంగా విధ్వంసం చేయగలుగుతారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ.. జగన్‌కు తాను సంతోషంగా ఉంటే చాలు, డబ్బంతా తన దగ్గరుంటే చాలు’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇసుక దోపిడీయే నెలకు రూ.250 కోట్లు
‘నెలకు రూ.250 కోట్లు ఇసుకలో దోచేసి భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేశారు. వాళ్లది గన్ కల్చర్, గొడ్డలి, గంజాయి కల్చర్. రాజకీయానికి అర్హులు కారు. సమాజానికి చాలా ప్రమాదకరం. రాష్ట్రాన్ని నాశనం చేసి పేద అరుపులు అరుస్తున్నారు. దోచిన డబ్బులు ఎక్కడకు పోతున్నాయి? ఇసుకకు రూ.25 కోట్లు ఇవ్వలేదని కొవ్వూరులో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ఎంతమంది చావాలి?’ అని నిలదీశారు.
ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా రేపు ఉంది
‘ఉత్తరాంధ్రలో తెలుగుదేశానికి ఓటేస్తే ఉత్తరాంధ్ర ద్రోహులన్నారు. ఇది రెఫరెండెం అన్నారు. ఇప్పుడేమో అసలు వారు తమ ఓటర్లే కాదంటున్నారు. బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం వైకాపా నేతల నైజం. సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది తెదేపాయే. 2014లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తెలంగాణలోనూ 20 సీట్లలో గెలిపించారు. ఇప్పుడు అంతకంటే సంక్షోభంలో ఉన్నాం. ప్రజల్లో నిస్పృహ నెలకొంది. తెలుగుదేశంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. దాని ఫలితమే మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటకు వచ్చింది. అది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా రేపు ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తీసుకున్న మంత్రి బొత్స తన పదవికి రాజీనామా చేయాలి కదా? అలా చేస్తే విలువలతో కూడిన రాజకీయానికి నిలబడినట్లు అవుతుంది’ అని పేర్కొన్నారు.
అందరినీ కోటీశ్వరులుగా చేస్తాం.. ఇంటికో విజన్
ప్రతి పేదవాడు ధనికుడు కావాలనేదే తెదేపా విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘విజన్ 2020 అంటే నన్ను ఎగతాళి చేస్తూ 420 అని, సెల్‌ఫోన్ భోజనం పెడుతుందా అన్నారు. నేను చేసిందే సరైందని రుజువైంది. ఎన్టీఆర్ శతజయంతి, తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఆర్థిక అసమానతల్ని తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. సంక్షేమం కొనసాగిస్తాం. అభివృద్ధి చేస్తాం. ఇంటికో విజన్ తయారుచేస్తాం. వీలైనంత తొందరగా.. అందరినీ కోటీశ్వరులుగా చేయడానికి ప్రణాళికలు తయారుచేసి అమలుచేస్తాం’ అని చెప్పారు.
అభ్యర్థిని నిలిపాం కాబట్టే.. వైకాపా ఎమ్మెల్యేలకు గౌరవం
‘తెదేపా ఎమ్మెల్యేలను వైకాపాలోకి తీసుకుంటే అది సరైన నిర్ణయమా? మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే అభ్యర్థిని నిలబెట్టాం. ఆత్మప్రబోధానుసారం ఓటేయమన్నాం. ఆ రోజు దేవుడి స్క్రిప్ట్ అని జగన్ అన్నారు. ఇప్పుడు ఆ దేవుడే తిరగరాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాను కాబట్టే.. వైకాపా ఎమ్మెల్యేలకు 2 రోజులపాటు గౌరవం ఇచ్చారు. అడిగిన పనులు చేశారు. లేదంటే ఆ ఎమ్మెల్యేలకూ అవీ లేవు. ఇంగితజ్ఞానం ఉన్నవారు వైకాపాలో ఉండకూడదు. అక్కడ బానిస జీవితం.. పదవి ఇస్తే బానిసల్లా ఎందుకు బతకాలి?’ అని ప్రశ్నించారు.
దేశంలోనే సంచలన హత్య కేసు
వివేకా హత్య కేసు.. దేశ చరిత్రలోనే సంచలనమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఇన్ని మలుపులు తిరిగిన కేసు ఎక్కడైనా చూశారా? నిందితుడైన శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ కేసులో నియమించిన న్యాయవాదులు వాయిదా వాయిదాకు మారుతున్నారని న్యాయమూర్తి అన్నారు. సుప్రీంకోర్టులో ముగ్గురు సీనియర్ న్యాయవాదుల్ని మార్చారంటే.. వారికి డబ్బులు ఎవరిస్తున్నారు.. తులశమ్మకు ఆ స్థాయి ఉందా? దేశంలో ఇలాంటి కేసు పోతే.. సీబీఐ, కోర్టు మీద నమ్మకం ఉండదు. గూగుల్ టేక్ ఔట్‌లో వివరాలు తీసుకున్నామన్నారు. ఇంకేం సాక్ష్యాలు కావాలి? ఎవరితో మాట్లాడారో కూడా స్పష్టత ఉంది’ అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే శ్రీదేవికి అండగా నిలుస్తాం
భాజపా నేత సత్యకుమార్‌పై దాడి దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎంపీని పోలీసు కస్టడీలో కొట్టాం.. ఏమైంది? శ్రీదేవిని చంపేస్తాం ఏమవుతుంది? అనే తీరున వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వారికి నచ్చకపోతే రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదా? కచ్చితంగా వారిని కాపాడతాం.. ఆ రోజు రఘురామకృష్ణరాజుకు చేయూత అందించా. ఇప్పుడు శ్రీదేవికీ అండగా నిలుస్తాం’ అని హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు