నవరత్నాల పేరుతో నాలుగేళ్లుగా జగన్‌ దోచుకుంటున్నారు

నవరత్నాల పేరుతో నాలుగేళ్లుగా సీఎం జగన్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Published : 02 Apr 2023 04:54 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నవరత్నాల పేరుతో నాలుగేళ్లుగా సీఎం జగన్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. బహిరంగ సభల్లో 98 శాతం హామీలను అమలు చేసినట్టు చెబుతున్న జగన్‌, మంత్రులు..2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ నిర్వహణ, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, డ్వాక్రా మహిళల రుణమాఫీ, రూ.12,500 రైతు భరోసా, 25 లక్షల ఇళ్లు, అమరావతి, పోలవరం నిర్మాణ హామీలు ఏమయ్యాయో చెప్పాలని సవాలు విసిరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నిషేధించకపోగా జే బ్రాండ్‌ పేరుతో కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. రైతు భరోసా సాయం కింద ప్రతి రైతుకూ రూ.12,500 ఇస్తానని నేడు రూ.7,500లతో సరిపెడుతున్నారు. మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పింఛన్‌ అని.. 15 లక్షల పింఛన్‌లకు కోత పెట్టారు. నాలుగేళ్లలో రూ.57 వేల కోట్ల విద్యుత్తు ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు...’’ అని బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ‘‘25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌...31 మంది ఎంపీలున్నా కేంద్రం ముందు సాగిలపడ్డారు. వివేకా హత్య కేసు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా దిల్లీ పరిగెడుతున్నారు.  అమరావతిలో భాజపా నేతలపై దాడి ముమ్మాటికీ సీఎంకు తెలిసే జరిగింది...’’ అని ఉమామహేశ్వరరావు విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని