వైకాపా మూకల దాడులతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం

అమరావతిలో భాజపా నేతలపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

Published : 02 Apr 2023 04:54 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమరావతిలో భాజపా నేతలపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. వైకాపా మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని.. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడే వారందర్నీ చంపేయమని ఆదేశాలిచ్చారా? అని ప్రశ్నించారు. గన్నవరంలో ఎన్నారై అంజన్‌ అరెస్టు, తెనాలిలో తెదేపా కౌన్సిలర్‌పై, అమరావతిలో భాజపా నేతలపై, పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలపై వైకాపా మూకల దాడి జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి నిదర్శనాలని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ చెప్పగలరా? పుట్టపర్తిలో వైకాపా గూండాలు తెదేపా వారిపై దాడి చేస్తూ.. వాహనాలను ధ్వంసం చేస్తుంటే స్థానిక పోలీసులు చోద్యం చూశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవిని వైకాపా మూకలు వేధిస్తున్నాయి. ఆమెను మానసికంగా హింసిస్తారా?...’ అని పేర్కొన్నారు. తన విద్యార్హతల విషయంలో ప్రజలను మోసం చేసిన స్పీకర్‌ చట్టసభల ఔన్నత్యాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు.  వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయలేనప్పుడు సీబీఐ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని వర్ల రామయ్య పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు