Nara Lokesh: సంక్షేమానికి పుట్టినిల్లు తెదేపా

‘తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారని వాలంటీర్లతో సీఎం జగన్‌ ప్రచారం చేయిస్తున్నారు.

Updated : 03 Apr 2023 06:23 IST

మా పార్టీ పథకాలు కొనసాగించాలంటే జగన్‌ తరం కాదు
యువగళం పాదయాత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారని వాలంటీర్లతో సీఎం జగన్‌ ప్రచారం చేయిస్తున్నారు. అసలు సంక్షేమం అనే పదం పుట్టిందే తెదేపా నుంచి’ అని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. తెదేపా హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించాలంటే సీఎం జగన్‌ తరం కాదన్నారు. యువగళం పాదయాత్ర 58వ రోజు ఆదివారం ధర్మవరం నుంచి బత్తలపల్లి మండలం ఈదులముష్టూరు వరకు కొనసాగింది. బత్తలపల్లిలో ఏర్పాటుచేసిన సభలో లోకేశ్‌ మాట్లాడారు. అన్న క్యాంటీన్‌, పండగ కానుక, పెళ్లికానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్, చంద్రన్న బీమా, విదేశీ విద్య, రూ.60 లక్షల పింఛన్లు.. ఇలా అనేక కార్యక్రమాలను గతంలో తెదేపా అమలు చేసిందని గుర్తుచేశారు.

జగన్‌ చేసేవన్నీ దొంగ పనులే..

సీఎం జగన్‌ చేసేవన్నీ దొంగ పనులేనని, అందుకే ఆయనకు చోర్‌మోహన్‌ అని పేరు పెట్టారని, కోడి కత్తి, బాబాయ్‌ గుండెపోటు అని ఎన్నికల ముందు నాటకాలు ఆడారని విమర్శించారు. జగన్‌ సీఎం కాకుండా ఉండేందుకు చంద్రబాబు నరబలి ఇచ్చారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, సీఎం పదవి కోసం సొంత బాబాయిని నరబలి ఇచ్చిన చరిత్ర జగన్‌దేనని ఆరోపించారు. రిలయన్స్‌, అమర్‌రాజా, జాకీ లాంటి పరిశ్రమలు వెళ్లిపోవడం వల్ల రాయలసీమ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు.

యువకుడిని దీవించండి

‘యువకుడు, ఉత్సాహవంతుడు.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంది. నా పాదయాత్ర ధర్మవరంలో ముగిసిన తర్వాత మీ వద్దకు వస్తాడు. నిండు మనస్సుతో దీవించండి’ అంటూ లోకేశ్‌ పేర్కొన్నారు. అనంతరం పరిటాల శ్రీరామ్‌ చేతిని పైకెత్తారు.


పాదయాత్రపై పోలీసు డ్రోన్‌ కెమెరా

బత్తలపల్లిలో సభ అనంతరం లోకేశ్‌ పాదయాత్ర కొనసాగింది. ఈ క్రమంలో పాదయాత్రను పోలీసులు డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారు. దీన్ని గమనించిన లోకేశ్‌ డ్రోన్‌ చూపిస్తూ సెల్ఫీ దిగారు. ‘అయ్యా జగన్‌ గారూ.. నన్ను చూడాలనుకుంటే యూట్యూబ్‌ ప్రత్యక్షప్రసారం లింకు పంపిస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని