Nara Lokesh: స్టిక్కర్ సీఎం.. జగన్
సీఎం జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని.. ప్రచారం తప్ప ప్రభుత్వం పనిచేయడం లేదని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు.
ప్రచారం తప్ప అభివృద్ధి శూన్యం
యువగళం పాదయాత్రలో లోకేశ్ ధ్వజం
ఈనాడు డిజిటల్, అనంతపురం: సీఎం జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని.. ప్రచారం తప్ప ప్రభుత్వం పనిచేయడం లేదని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రూ.వెయ్యి దాటిన ఏ చికిత్సకైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని ప్రచారం చేశారు.. అది ఎక్కడైనా అమలవుతోందా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో దూది, మందులకు కూడా నిధులు లేవన్నారు.. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అని కొత్తగా డ్రామా మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర 68వ రోజు బుధవారం తాడిపత్రి నియోజకవర్గం పసలూరు నుంచి కొనసాగింది. రాయలచెరువులో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. ఎవరో చేసిన పనిని తానే చేశానని చెప్పుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. తెదేపా హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు వైకాపా రంగులేసి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగనన్న నువ్వే మా నమ్మకం అనే స్టిక్కర్ అతికించడానికి వెళితే... సొంత తల్లి, చెల్లి నమ్మలేదు, మేమేలా నమ్ముతామని జనం ప్రశ్నిస్తున్నారన్నారు. జగన్ స్టిక్కర్ సీఎంలా మారారని ఎద్దేవా చేశారు. ఆనాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి.. ఇప్పుడు మద్యం ఆదాయం పైనే అప్పులు చేసిన వ్యక్తిని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్న జగన్‌ను ఎందుకు నమ్మాలన్నారు. తాను జగన్‌లా మాట తప్పే వ్యక్తిని కాదని.. తెదేపా అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పన్నుల భారాన్ని తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామన్నారు.
నాలుగేళ్లలో రెడ్లకు దక్కింది అవమానాలే..
జగన్ పాలనలో ప్రభుత్వ కాంట్రాక్టులు చేసిన రెడ్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గం తూట్రాలపల్లి గ్రామంలో రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. రాజకీయాల్లో రాజనీతి ఉండాలని.. లక్ష్మణరేఖ దాటకూడదని అన్నారు. తెదేపా హయాంలో రెడ్లపై అక్రమ కేసులు పెట్టి ఏనాడు వేధించలేదని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు మొత్తం బాధితులేనన్నారు. కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని, మిగిలిన వారికి కనీసం సీఎం అపాయింట్మెంట్ దక్కడంలేదని పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఏనాడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదన్నారు. అప్పట్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఎన్టీఆర్‌పై పోటీ చేసినా ఆయనను రాజకీయ ప్రత్యర్థిగానే చూశామని తెలిపారు. కానీ నేడు మాత్రం ప్రత్యర్థి ఇంటికెళ్లి రెచ్చగొట్టే ఫ్యాక్షన్ తాడిపత్రిలో జరుగుతోందన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలు.. అవమానాలు, దాడులు, హత్యలు, అక్రమ కేసులకు గురవుతున్నాయన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దామాషా ప్రకారం రెడ్డి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి ఆదుకుంటామన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రులు అమర్నాథ్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్, జేసీ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, మాజీ జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు, తాడిపత్రి, కల్యాణదుర్గం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు జేసీ అస్మిత్‌రెడ్డి, ఉమామహేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్
-
‘మార్కెట్లో సంపద సృష్టికి ఆయనే నిదర్శనం’.. వృద్ధుడి వీడియో వైరల్
-
Guntur: సోషల్ మీడియా పోస్టింగ్ కేసు.. వరప్రసాద్‌కు బెయిల్