KTR - Harish Rao: కేసీఆర్‌ దెబ్బతోనే దిగొచ్చిన కేంద్రం

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్థే చేసిన ప్రకటనపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు స్పందించారు.

Updated : 14 Apr 2023 08:08 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర మంత్రి ప్రకటనపై మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు
ఈనాడు - హైదరాబాద్‌

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్థే చేసిన ప్రకటనపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు స్పందించారు. కేంద్రమంత్రి గురువారం చేసిన నామమాత్రపు ప్రకటన కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకేనని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘మా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ జారీ చేసిన ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ ప్రక్రియలో పాల్గొంటామని చేసిన ఒక్క ప్రకటనతో కేంద్రం ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గింది. కేసీఆర్‌ ఒక్క మాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది’ అని మంత్రి పేర్కొన్నారు. భారాస చేసిన పోరాటం, కేసీఆర్‌ ప్రకటనతోనే కేంద్రం దిగొచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకునేంతవరకు, బయ్యారంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేదాకా కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అదానీకి బైలదిల్లా ఇనుప ఖనిజం గనుల కేటాయింపు విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు గొడ్డలి పెట్టుగా మారింది. ఈ వ్యవహారంలో కేంద్రం వ్యవహరిస్తున్న కుట్రపూరిత వైఖరిని మేం బయట పెట్టిన నేపథ్యంలోనే కేంద్రం కొత్త డ్రామాకు తెరతీసింది. వైజాగ్‌, బయ్యారం ప్లాంట్లపై కేంద్రం కుట్రలను భారాస లేవనెత్తుతూనే ఉంటుంది. అంతకుముందు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లోనూ మంత్రి ఈ అంశంపై మాట్లాడారు. ఇదే తెగింపు, సాహసం, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు.


భారాస పోరాటంతోనే వెనక్కి తగ్గిన కేంద్రం: మంత్రి హరీశ్‌రావు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా భారాస గట్టిగా నిలబడుతుందని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు విషయంలో అక్కడి రెండు పార్టీలు నోరెత్తక పోయినా, ప్రజలు, కార్మికుల తరఫున భారాస పోరాటం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. ఇది భారాస, ఏపీ ప్రజలు, నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల విజయమన్నారు. బయ్యారం ఉక్కు, వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం అన్యాయం చేసిందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీతో జాగ్రత్తగా ఉండాలని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే అర్ధరాత్రి కరెంట్‌ కష్టాలు, ఎరువుల బస్తాలకు తిప్పలు తలెత్తుతాయని, రాష్ట్రం అధోగతి పాలవుతుందని హరీశ్‌రావు తెలిపారు.   


ఏపీలో ఇది భారాస తొలి విజయం

-భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌

ఈనాడు, హైదరాబాద్‌: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం దిగి రావడం ఏపీలో భారాసకు తొలి విజయమని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉక్కు సహాయ మంత్రితో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించగలిగామనీ, ఆ ఘనత భారాస అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడంలో ఏపీలో టీడీపీ, వైసీపీలు చేతులెత్తేశాయి. ఏపీ విషయంలో మంత్రి హరీశ్‌రావు అన్నీ నిజాలే మాట్లాడారు. ఏపీ మంత్రుల దగ్గర విషయం లేకే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లను ఆంధ్రాకు తీసుకురావాలని అక్కడి ప్రజలు నన్ను కోరుతున్నారు. విశాఖపట్నంలో త్వరలోనే భారాస భారీ బహిరంగ సభ ఉంటుంది’’ అని తోట చంద్రశేఖర్‌ తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని