Nara Lokesh: జగన్‌ పాలనలో రైతులకు అన్నీ హాలిడేలే

‘రైతుల బలవన్మరణాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానం.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండటం విచారకరం.

Updated : 18 Apr 2023 07:47 IST

ఆత్మహత్యలు పెరగడం విచారకరం
రైతులతో ముఖాముఖిలో నారా లోకేశ్‌

ఈనాడు, కర్నూలు: ‘రైతుల బలవన్మరణాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానం.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండటం విచారకరం. జగన్‌ పాలనలో రైతులకు అన్నీ హాలిడేలే. పవర్‌ హాలిడే, క్రాప్‌ హాలిడే.. ఇలా ఎన్నో హాలిడేలు ఇస్తున్నారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వెంకటాపురంలో రైతులతో సోమవారం ముఖాముఖి నిర్వహించారు.  గతేడాది పంట నష్టపోయిన వారికి ప్రస్తుత సంవత్సరమూ పరిహారం అందలేదన్నారు. ఆలూరు ప్రాంతంలో 6 మండలాల్లో 15వేల ఎకరాల్లో పత్తి పంట వేయగా.. అందులో సగం నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారని చెప్పారు.

గోదావరి మిగులు జలాలు సీమకు తీసుకొస్తాం

‘తెదేపా అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి చేస్తాం. గోదావరి మిగులు జలాలు సీమకు తీసుకొస్తాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. వేదవతి ప్రాజెక్టును తెదేపా మంజూరుచేసి పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టు సామర్థ్యాన్ని    8 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు తగ్గించారని.. నాలుగేళ్లయినా పూర్తి చేయలేకపోయారని అన్నారు. హంద్రీనీవా పనులు నాలుగేళ్లలో పది శాతమైనా చేపట్టలేకపోయారని ఆరోపించారు. నగరడోన జలాశయం నిర్మాణంలో జాప్యం వల్ల వేలాది ఎకరాలకు నీరందని దుస్థితి తలెత్తిందన్నారు. ఎల్లెల్సీ ఆధునికీకరణ పనులు ఆగాయని, వాటినీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని హామీనిచ్చారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తయ్యేలోపు రైతులకిచ్చే హామీలపై మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు.

బెంజి మంత్రికి.. రైతుల కష్టాలు తెలియవు

కర్నూలు జిల్లాలో రైతుల కష్టాలు బెంజి మంత్రికి ఏ మాత్రం తెలియవని, ఆయన బెంజి కారులోంచి బయటకు రావడం లేదని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘టమాట రైతులకు తగిన ధర లభించక రహదారులపై దిగుబడులు పారబోస్తుంటే వాటిపైనుంచే ఆయన కారులో వెళ్తున్నారు. అలాంటి మంత్రి ఉండడం దౌర్భాగ్యం’ అని సభలో ఓ రైతు గోడు వినిపించారు.తాము అధికారంలోకి రాగానే వలసల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ హామీనిచ్చారు.

కోర్టులో ఆధారాల చోరీపై ఆరోపణలు

కోర్టులో ఆధారాల చోరీ కేసులో ఏకంగా వ్యవసాయ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని లోకేశ్‌ వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌, ఆయన బాబాయ్‌ భాస్కరరెడ్డి, తాజాగా అవినాష్‌రెడ్డిపైనా సీబీఐ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. సీఎం జగన్‌ కొబ్బరికాయ కొట్టడానికీ వంగలేరని, ఆయన యువకుడి రూపంలో ఉన్న వృద్ధుడని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు బిగిస్తే ప్రభుత్వానికి అప్పులు సమకూరుతాయన్న ఉద్దేశంతో రైతులతో ఒప్పందాలు చేయించుకుంటున్నారని, వాటిపై సంతకాలు చేయొద్దని సూచించారు.


లోకేశ్‌ వ్యాఖ్యలు వక్రీకరించిందని ‘సాక్షి’పై ఫిర్యాదు

పలమనేరు: లోకేశ్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కథనం ప్రచురించిన సాక్షి పత్రికపై చిత్తూరు జిల్లా పలమనేరు తెదేపా ఎస్సీ సెల్‌ నాయకులు నాగరాజు, గిరిబాబు, ఖాజా తదితరులు ఇక్కడి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో దళితులకు వైకాపా చేసిందేమీ లేదని లోకేశ్‌ అంటే, దాన్ని వక్రీకరించి దళితులు చేసిందేమీ లేదంటూ తప్పుడు కథనం ప్రచురించారని పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు