Nara Lokesh: భూహక్కు కాదు.. భూభక్ష పథకమది

‘జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత భూసర్వేతో ప్రతి రైతు భూమి తగ్గుతోంది. అది భూహక్కు పథకం కాదు.. భూభక్ష పథకం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Updated : 29 Apr 2023 06:34 IST

ప్రతి రైతు భూవిస్తీర్ణం తగ్గుతోంది
తగాదాలు పెట్టి బాగుపడదామనుకుంటున్నారు
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు, కర్నూలు: ‘జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత భూసర్వేతో ప్రతి రైతు భూమి తగ్గుతోంది. అది భూహక్కు పథకం కాదు.. భూభక్ష పథకం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ముగిసి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. నియోజకవర్గ పార్టీ బాధ్యుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం వర్షంలోనూ పాదయాత్ర కొనసాగింది. మాచాపురంలో నిర్వహించిన ‘రైతులతో ముఖాముఖి’లో లోకేశ్‌ మాట్లాడారు. రైతుల మధ్య తగాదాలు పెడితేనే తాము బాగుపడతామన్న ఆలోచనలో వైకాపా నేతలున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా రైతుల ఆధ్వర్యంలో ఉన్న భూములను భూసర్వే పేరుతో లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. భూవిస్తీర్ణం తగ్గించి పాసు పుస్తకం ఇస్తున్నారని మంత్రులే చెబుతున్నారని గుర్తు చేశారు. పాసు పుస్తకాలు, హద్దురాళ్లపైనా జగన్‌ తన బొమ్మలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గురురాఘవేంద్ర పథకానికి సంబంధించిన మోటారు మరమ్మతు చేయించడం లేదని, ఫలితంగా ఒక్క టీఎంసీ నీరూ ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో తనను కలిసిన మహిళలు తమకు ఒక్క బొట్టు తాగునీరందించాలని కోరుతున్నారంటే గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని, ఇలా ఒక్కో రైతు నుంచి వేలు కొట్టేశారని ఆరోపించారు. రూ.3,500 కోట్లతో ఏర్పాటుచేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ మంత్రికి సీబీఐ చుట్టూ తిరగడమే సరిపోతోందని, రైతు సమస్యల పరిష్కారానికి సమయం చాలడం లేదని ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే రాయలసీమలో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, పంట ఉత్పత్తుల నిల్వకు గోదాములు నిర్మిస్తామని, రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు.

దళిత రైతు రంగమ్మకు రూ.లక్ష సాయం

అప్పుల బాధ భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని గోనెగండ్ల మండలం నెరుడుప్పలకు చెందిన దళిత రైతు రంగమ్మ లోకేశ్‌ వద్ద కన్నీరుమున్నీరయ్యారు. 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తే నష్టపోయామని, తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. లోకేశ్‌ అప్పటికప్పుడు ఆమెకు రూ.లక్ష సాయాన్ని ప్రకటించారు. తెదేపా అధికారంలోకి రాగానే మరో రూ.10 లక్షలు ఇస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్న జగన్‌ ఒక్కరికైనా పరిహారమిచ్చారా? అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని