Nara Lokesh: చేనేతల సమస్యలపై చిన్నచూపు

చేనేత రంగంపై జీఎస్టీ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఎందుకు ప్రయత్నించడం లేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

Updated : 03 May 2023 00:46 IST

ఈ రంగంపై జీఎస్టీ రద్దుకు ప్రయత్నాలేవి?
కార్మికులతో ముఖాముఖిలో లోకేశ్‌

ఈనాడు, కర్నూలు: చేనేత రంగంపై జీఎస్టీ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఎందుకు ప్రయత్నించడం లేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ‘వైకాపాకు 22 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ సభ్యులున్నారు. చేనేత కార్మికుల సమస్యలపై పార్లమెంటులో వారు ఎందుకు ప్రస్తావించడం లేదు’ అని నిలదీశారు. యువగళం పాదయాత్ర 86వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల్లో సాగింది. సోమవారం రాళ్లదొడ్డిలో ‘చేనేతల ముఖాముఖి’లో లోకేశ్‌ మాట్లాడారు. కార్మికులు ప్రస్తావించిన పలు అంశాలకు సమాధానమిచ్చారు. ‘మాస్టర్‌వీవర్లకు ఆప్కో రూ.40 కోట్ల వరకు బకాయిపడింది. ఫలితంగా వారి వద్ద పనిచేసేకార్మికులు ఇబ్బందిపడుతున్నారు. చేనేతలకు ఇస్తున్న బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, అన్ని రకాల రాయితీలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది’ అని లోకేశ్‌ వివరించారు.

మగ్గాలు పంపిణీ చేస్తాం

‘తెదేపా అధికారంలోకి రాగానే రాయితీలు ఇవ్వడంతోపాటు ఆదరణ కింద మగ్గాలు పంపిణీ చేస్తాం. చేనేత రంగానికి ఉపాధి హామీని అనుసంధానించేలా కేంద్రంతో మాట్లాడుతాం’ అని లోకేశ్‌ హామీనిచ్చారు. ‘కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయానికి కృషి చేస్తాం. మగ్గం గోతుల్లోకి నీరు చేరినప్పుడు పనులు చేసుకోలేని చేనేతలకు పింఛన్లు ఇస్తాం. నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. సొంత మగ్గాలున్న కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిస్తాం. అర్హులైన అందరికీ మగ్గం కార్డులిస్తాం. సొంత మగ్గాలు లేకుండా కూలీకి వెళ్లి మగ్గం పనిచేసేవారికీ కార్డులిచ్చి సంక్షేమ పథకాలను అందిస్తాం. పట్టు రైతులకు ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తాం. మంగళగిరిలో నేను ఓడిపోయినప్పటికీ అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నా’ అని వివరించారు.

* యువగళం పాదయాత్ర 1,100 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో గోనెగండ్ల మండలంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు శిలాఫలకాన్ని లోకేశ్‌ ఆవిష్కరించారు. ఈ పార్కు ద్వారా పదివేల మందికి ఉపాధి లభించే అవకాశముందని లోకేశ్‌ తెలిపారు.

ప్రభుత్వ పెద్దలు పత్తాలేరు

‘రాష్ట్రవ్యాప్తంగా 3రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతింటే పట్టించుకునే నాథుడు లేరు. ప్రభుత్వ పెద్దలు పత్తాలేకుండా పోయారు’ అని లోకేశ్‌ ఆరోపించారు. పాదయాత్రలో కడిమెట్ల శివారులో దెబ్బతిన్న మొక్కజొన్నను పరిశీలించారు. అకాలవర్షానికి సర్వం కొట్టుకుపోయిందని లోకేశ్‌ ఎదుట బాధిత రైతు వాపోయారు. ‘స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి డబ్బుపై ఆశ బాగా పెరిగింది.. అందుకే ఆయన్ను చెన్నకేశవరెడ్డి కాదు క్యాష్‌ కేశవగా పిలుస్తున్నా. కడిమెట్లలో వంద ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారు. భూఆక్రమణలపై సమాధానం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు’ అని లోకేశ్‌ ప్రకటనలో ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని