జాక్సన్‌విల్లే నగరంలో ఘనంగా మహానాడు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లే నగరంలో తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మహానాడు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.

Updated : 02 May 2023 05:59 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లే నగరంలో తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మహానాడు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలు ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. ‘స్థాపించిన తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. పేదల సంక్షేమం కోసం ఆయన అనేక పథకాలు రూపకల్పన చేశారు. నేడు దేశంలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ ఆధ్యుడు’ అని అయ్యన్నపాత్రుడు కొనియాడారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న మహానాడుకు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రవాసాంధ్రులకు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాక్సన్‌విల్లే తెదేపా అధ్యక్షుడు ఆనంద్‌ తోటకూర, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, స్థానిక నేతలు అనీల్‌ యార్లగడ్డ, సుమంత్‌ ఈదర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని