Janasena: పథకాలకు ఇవ్వాల్సిన సొమ్ములు లేవని తెలిసీ బటన్లు నొక్కడం మభ్యపెట్టడమే: నాదెండ్ల మనోహర్‌

‘‘వైకాపా రాజకీయాల కోసం పోలీసుల బదిలీలను చిన్న పిల్లల ఆటలా మార్చేస్తారా? అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేయని అధికారులైతే ఛార్జి తీసుకున్న అరగంటలోనే బయటకు పంపిస్తారా?’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం ట్విటర్‌లో ప్రశ్నించారు.

Updated : 06 May 2023 09:12 IST

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

ఈనాడు,అమరావతి: ‘‘వైకాపా రాజకీయాల కోసం పోలీసుల బదిలీలను చిన్న పిల్లల ఆటలా మార్చేస్తారా? అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేయని అధికారులైతే ఛార్జి తీసుకున్న అరగంటలోనే బయటకు పంపిస్తారా?’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం ట్విటర్‌లో ప్రశ్నించారు. పోలీసు అధికారులు వచ్చిన వెంటనే వారిని మళ్లీ బదిలీ చేసిన వైనంపై ‘ఈనాడు’లో ప్రచురించిన కథనాలను ఆయన ట్వీట్‌కు జత చేశారు. ఈ తరహా బదిలీలు అధికారుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మనోహర్‌ పేర్కొన్నారు.

పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం?

‘‘రాష్ట్ర ఖజానాను దివాలా తీయించే ఘనులు జగన్‌రెడ్డి. పథకాలకు ఇవ్వాల్సిన సొమ్ములు లేవని తెలిసీ బటన్లు నొక్కడం జనాన్ని మభ్యపెట్టడమే. పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం ముఖ్యమంత్రి గారూ. విద్య, వసతి దీవెనల సొమ్ములు వచ్చేశాయని అనుకున్న విద్యార్థులు.. పాలకుల దివాలాకోరుతనం వల్ల  ఇప్పుడు అగచాట్లు పడుతున్నారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే క్రమంలో అసలు విషయం బోధపడింది. ట్రిపుల్‌ ఐటీలో చదువుకున్న నాలుగువేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయాయి. బకాయిలు చెల్లిస్తేనే ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు’’ అని నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రిపుల్‌ ఐటీలతో పాటు ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులూ ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారని, ఉద్యోగాల్లో చేరాల్సిన వాళ్లు సర్టిఫికెట్లు సమర్పించలేక ఇబ్బందుల్లో పడ్డారని పేర్కొన్నారు. జగన్‌రెడ్డి తక్షణమే పని చేసే బటన్లు నొక్కి బకాయిలు చెల్లించి విద్యార్థులు రోడ్డున పడకుండా చూడాలని కోరారు. విద్యార్థుల పక్షాన జనసేన పోరాడుతుందని మనోహర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని