BSP- RS Praveen Kumar: మా పథకాలను భారాస కాపీ కొట్టింది

ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధికారంలో ఉండగా అమలు చేసిన పథకాలను తెలంగాణలో భారాస కాపీ కొట్టిందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు.

Updated : 08 May 2023 08:07 IST

బహుజనులకు రాజ్యాంగ హక్కులు దక్కాలి
పార్టీ సీఎం అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
‘తెలంగాణ భరోసా సభ’లో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధికారంలో ఉండగా అమలు చేసిన పథకాలను తెలంగాణలో భారాస కాపీ కొట్టిందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి.. కాగితాలకే పరిమితం చేసిందని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మెరుగైన పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. యువతకు నిరుద్యోగ భృతి కాదని.. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలిపిందని ఆమె గుర్తుచేశారు. అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, ఆశయ సాధనకు బీఎస్పీ పాటుపడుతోందని చెప్పారు. ప్రజల కోసం ఉద్యోగాన్ని వదులుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భరోసా సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలకు నేటికీ న్యాయం దక్కలేదన్నారు. యూపీలో తమ ప్రభుత్వం పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన బ్యాంకు రుణాలనూ చెల్లించిందన్నారు. గ్రామవికాస్‌, పట్టణ వికాస్‌ యోజనలతో పేదలకు న్యాయం చేశామన్నారు.

కేంద్రంలో నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లతో పాటు వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉపాధి అవకాశాలు దక్కేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్‌ కోరారని.. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారని మాయావతి అన్నారు. అంబేడ్కర్‌   ఆశయాల సాధనకు కాన్షీరాం బీఎస్పీని స్థాపించారన్నారు.

తెలంగాణలో బీఎస్పీ పటిష్ఠమవుతోందని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు అంబేడ్కర్‌పై ప్రేమ కురిపిస్తున్నారన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలతో యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. బిహార్‌లో ఐఏఎస్‌ అధికారిని చంపిన వ్యక్తిని వదిలేస్తే తెలంగాణ ప్రభుత్వం ఖండించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలను కాంగ్రెస్‌, భాజపాలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్‌ అగౌరవపరిచిందన్నారు. ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీని అధికారంలోకి తేవాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాలెట్‌ పేపర్లు ఉన్నప్పుడు గెలిచామని, ఈవీఎంలు మాయ చేస్తున్నాయని చెప్పారు.

ప్రగతిభవన్‌పై నీలిరంగు జెండా ఖాయం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ప్రగతిభవన్‌పై నీలిరంగు జెండా ఎగురవేయడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణను దోపిడీ గడీల నుంచి విముక్తి చేస్తామన్నారు. 213 రోజులపాటు రాష్ట్రంలో గ్రామగ్రామాన తిరిగినట్లు చెప్పారు. ప్రతి ఇంట కష్టాలే కనిపించాయన్నారు. 1300 మంది అమరులైతే పాలన మాత్రం ఓ కుటుంబపరమైందని విమర్శించారు. బీఎస్పీకి భయపడి అంబేడ్కర్‌ విగ్రహం పెట్టారన్నారు. దళిత మహిళను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకుండా అడ్డుకున్నారన్నారు. దళితబంధులో ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారని సీఎం కేసీఆర్‌ అంగీకరించారని.. వారి వివరాలను అనిశా(ఏసీబీ)కి అందించాలని డిమాండ్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌ను కారుచౌకగా రూ.7,380 కోట్లకు లీజుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. నియామక ప్రక్రియలోనూ అవినీతి జరిగిందన్నారు. నెలకు రూ.4లక్షలు వేతనం తీసుకునే ముఖ్యమంత్రి చిన్న ఉద్యోగులపై ప్రతాపం చూపుతున్నారని తప్పుపట్టారు.

అమిత్‌ షా రెచ్చగొడుతున్నారు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని రెచ్చగొడుతున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో అడుగుపెట్టనీయని చెప్పారు. భాజపా, భారాసలు కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు. బీసీ ప్రధాని అని చెప్పుకొంటున్న మోదీ బీసీ జనగణనను చేపట్టడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ తరఫున 60 నుంచి 70 శాతం సీట్లు బీసీలకే కేటాయిస్తామని చెప్పారు. భూమి లేని ప్రతి ఒక్కరికి ఎకరం భూమి ఇవ్వాలన్నారు. 10 లక్షల ఉద్యోగాలు, వృద్ధాప్య పింఛన్లు బీఎస్పీతోనే సాధ్యమన్నారు. గల్ఫ్‌ కార్మికులకు రూ.5 వేల కోట్లు, కౌలు రైతులకు సంక్షేమనిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రామ్‌ జీ గౌతమ్‌, రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త మంద ప్రభాకర్‌, సమన్వయకర్తలు చంద్రశేఖర్‌, సతీశ్‌, బాలయ్య, బీఎస్పీ ఏపీ అధ్యక్షుడు పరంజ్యోతి, ఉపాధ్యక్షుడు గౌతమ్‌, ప్రధానకార్యదర్శి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని