Pawan Kalyan: తెదేపా, జనసేన, భాజపా పొత్తు ఖాయం

జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌ కీలక రాజకీయ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, భాజపా కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు.

Updated : 13 May 2023 07:29 IST

జగన్‌ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం కోలుకోదు
ఆయన్ను దింపడం.. కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడమే తక్షణ లక్ష్యం
ముఖ్యమంత్రి ఎవరనేది తర్వాత సంగతి
డిసెంబరులోనే ఎన్నికలు వస్తున్నాయి
పొత్తుల విధివిధానాలు ఇంకా ఖరారు కావాలి
మా ప్రత్యర్థి వైకాపాయే.. తెదేపా కాదు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రకటన

ఈనాడు, అమరావతి: జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌ కీలక రాజకీయ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, భాజపా కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించి, జనసేన - తెదేపా - భాజపా కూటమిని పీఠమెక్కించడమే లక్ష్యమని తేల్చి చెప్పారు. ‘జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్‌ ఇక కోలుకోదు. మామూలు వ్యక్తి కాదు ఆయన. అడ్డగోలుగా సంపాదించి గూండాలను, అధికారులను కొనేసి అందరినీ బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ను ప్రత్యర్థిగానే ప్రకటించాలి. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాల్సిందే.

ప్రజాస్వామ్యంలో ఈ బాధ్యత అందరిపై ఉంది. ఈ పని ఒక్క జనసేనతోనే సాధ్యం కాదు. ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం మనకు లేదు. అన్నీ గౌరవంగా, పద్ధతిగా ఉంటే జనసేన, తెదేపా, భాజపా కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి. ముఖ్యమంత్రి ఎవరనేది కాదు.. ప్రస్తుత ముఖ్యమంత్రిని గద్దె దించడం.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తక్షణ కర్తవ్యం. ఎన్నికల తర్వాత ఆ రోజు బలాబలాలు, పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి ఎవరనేది ఆలోచించవచ్చు’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులతో శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. చివర్లో పవన్‌ ప్రసంగిస్తూ కీలక అంశాలు ప్రకటించారు. త్రిముఖ పోటీలో మరోసారి జనసేనను బలి చేసేందుకు సిద్ధంగా లేనని తేల్చిచెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

విధివిధానాలు ఖరారు చేసుకుంటాం

నేను పొత్తుకు సిద్ధమనే ప్రకటించాను తప్ప విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఇంకా ఆ స్థాయికి చేరలేదు. సంపూర్ణంగా ఆ పరిస్థితి వచ్చిన రోజున రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఎలా జరుగుతాయో అలా మాట్లాడుకుంటాం. పొత్తులో ముందుకు వచ్చిన పార్టీలతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. నాలుగు గోడల మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉండవు. ప్రజల మధ్య ఒప్పందాలు చేసుకుంటాం. మీడియా ఎదురుగా కూర్చుని,. ఆంధ్రప్రదేశ్‌ను మేం ఇలా గట్టెక్కిస్తాం. ఇలా ఉద్యోగాలు ఇస్తాం. ఇలా అప్పులు తీరుస్తాం. ప్రజల మనసులు గెలుస్తాం. విశ్వాసం చూరగొంటాం. పెట్టుబడులు తిరిగి వచ్చేలా చేస్తాం అని స్పష్టంగా తేల్చి చెబుతాం.

రాష్ట్రాన్ని నాశనం చేసిన జగనే మన ప్రత్యర్థి

ఈ ఎన్నికల్లో మన ప్రత్యర్థి ఎవరో ముందు తేల్చుకోవాలి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగనే మన ప్రత్యర్థి. తెదేపా మన ప్రత్యర్థి కాదు. వైకాపా ప్రభుత్వం సరిగా పని చేయడం లేదు. ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఫ్యూడల్‌ విధానాలతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. రాయలసీమలో చెట్లు కొట్టే సంస్కృతిని గోదావరి జిల్లాలకు తీసుకువచ్చారు. ఎవరు మన ప్రత్యర్థి? ఎవరు ప్రజలకు ప్రత్యర్థి? రోడ్లు వేయని వ్యక్తి, మహిళలకు రక్షణ కల్పించని వ్యక్తి, పోలవరం పూర్తి చేయని వ్యక్తి, సకాలంలో జీతాలు ఇవ్వని వ్యక్తి.. ఇలా చెబుతూ పోతే ఎల్లుండి వరకు ఈ జాబితా చదువుతూనే ఉండాలి. జగన్‌ రాష్ట్రానికి చేస్తున్న నష్టం ఎవరు తీరుస్తారు? కేసులు పెట్టిన, రైతులకు ద్రోహం చేసిన, ఉద్యోగాలు ఇవ్వని, దేవాలయాలు కూల్చేసినా ఒక్కరినీ ఈ రోజుకీ పట్టుకోలేకపోయిన జగన్‌ను ప్రత్యర్థిగా ప్రకటిద్దామా? మైనారిటీలు, ఎస్సీలకు అన్యాయం చేసిన వ్యక్తిని ప్రత్యర్థిగా ప్రకటిద్దామా? తెదేపాను ప్రత్యర్థిగా ప్రకటిద్దామా? జగన్‌ను ప్రత్యర్థిగా ప్రకటించాలి. అధికారంలో నుంచి దింపెయ్యాలి. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వ్యూహం సిద్ధం చేసుకోవాలి. ముందు మన పార్టీకి ఎంత బలం ఉందో బేరీజు వేసుకోవాలి.

కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు సగటున 25 శాతం ఓట్ల బలం జనసేనకు ఉంది. రాష్ట్రం మొత్తం మీద 14 నుంచి 18 శాతం వరకు ఓటింగ్‌ ఉంది. ఈ బలంతో జనసేన ప్రభుత్వం స్థాపించగలదా? ఇదే బలంతో ఒంటరిగా పోటీ చేస్తే రేపు ఫలితాల తర్వాత అందరూ వచ్చి మంచి ఓట్లు వచ్చాయండి.. రెండు వేలు, నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయామని అంటారు.. ఇలాంటి పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఉండకూడదు. అందుకే పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంత అభిమాన బలం ఉండి నన్ను ఒక కులానికే పరిమితం చేస్తాననడం సరికాదు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒక వ్యక్తికి పాపులారిటీ ఉన్నంత మాత్రాన రాత్రికి రాత్రి అధికారం వస్తుందనుకోవడం కల.. ఎన్టీఆర్‌కు జరిగిందేమో కానీ నాకు జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇటుక ఇటుక పేర్చుకుంటూ పార్టీ నిర్మిస్తా. ఏపీ బాగుండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తా తప్ప, నేను బాగుండాలని ఆలోచించను. ఏపీ బాగుంటే పవన్‌ కల్యాణ్‌ బాగుంటాడు. ఏపీ బాగుంటే పవన్‌ సీఎం అవుతాడు. సీఎం సీఎం అని అరిస్తేనో, హారతులు ఇస్తేనో, క్రేన్లు పెట్టి గజమాలలు వేస్తేనో ముఖ్యమంత్రి కాలేం. అభిమానం ఓట్లుగా మారితేనే ముఖ్యమంత్రి కాగలం. ఆరాధన, అభిమానం, ప్రేమ ఓట్లుగా మారనప్పుడు అధికారం దిశగా వెళ్లలేం.

నేను అజాతశత్రువుగా ఉండటానికి రాజకీయాల్లోకి రాలేదు. మెజారిటీ ప్రజలను రక్షించడానికి, ఏపీని అభివృద్ధి దిశగా నడిపించడానికి కొందరికి శత్రువునవుతా. నేను మీకు (వైకాపాకు) శత్రువునే. మిమ్మల్ని చూసి భయపడను. జీరో బడ్జెట్‌ రాజకీయాలు అని నేనెప్పుడూ అనలేదు. ఓట్లు కొనని రాజకీయాల గురించే ప్రస్తావించా. రాజకీయాలకు కొంత డబ్బు అవసరమే. నేను పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా’ అని పవన్‌ పేర్కొన్నారు.

ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిని సీఎంని చేస్తారా?

ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే తప్ప పొత్తు ఉండకూడదని మన నాయకులు కొందరు చెబుతుంటారని, అందుకు ఎవరు అంగీకరిస్తారని పవన్‌ ప్రశ్నించారు. మండల, డివిజన్‌ స్థాయి నాయకులు మీరు ఆ స్థానాల్లో ఉండాలని కోరుకుంటారా, పక్కవారు ఉండాలని ఎవరైనా కోరుకుంటారా అని పార్టీ నేతలను అడిగారు. మండల స్థాయిలోనే తానే నాయకుడిగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నప్పుడు.. ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి చేద్దామని ఎందుకు అనుకుంటారనే దిశగా ఆలోచించాలని పవన్‌ జనసేన శ్రేణులకు స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు తగ్గాలి, మరోసారి బెబ్బులిలా తిరగబడాలి.. రాజకీయాల్లో రెండూ ముఖ్యమే అన్నారు. ఎంఐఎం పార్టీలా ఏడు స్థానాల్లో కూడా గెలిపించలేదు కదా.. విజయకాంత్‌లా కూడా గెలిపించలేదు కదా అని ప్రశ్నించారు. ఎంఐఎం ఆ కొద్ది స్థానాలతోనే ఎలా ప్రాధాన్యంతో ఉందో గమనించాలన్నారు. తెరాస కూడా పొత్తులతోనే ఈ స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు.

మోసపోవడానికి మేం చిన్న పిల్లలమా?

‘మిమ్మల్ని చంద్రబాబు మోసం చేస్తున్నారు అంటారు కొందరు. మేం ఇంకా పిల్లలమా? మీసాలు, గెడ్డాలు రాలేదా? తెల్లబడలేదా? ఆ మాత్రం తెలియదా? మోసపోతామా? మనం ఎదగడానికి ఎవరూ మద్దతివ్వరు. అది ప్రకృతి సహజం. ఒక విత్తు భూమిలో ఎన్నో పొరలను ఛేదించుకుంటూ రావాలి. ఒక మొక్కకే అంత కష్టం. అలాంటిది మనల్ని సీఎంని చేసేస్తారా?’ అని ప్రశ్నించారు.


మనోహర్‌ను ఏమైనా అంటే ఊరుకోం

‘జనసేన పార్టీలో పని చేసే వారికే బాధ్యత ఉంటుంది. ఈ రోజు వచ్చి రేపు వెళ్లిపోయే వారికి బాధ్యత ఇవ్వను. నాదెండ్ల మనోహర్‌ పార్టీకి వెన్నెముకలా నిలబడ్డారు. నాకు చెప్పకుండా ఒక మాట కూడా మాట్లాడరు. ఏం మన కులాలే నాయకులుగా ఉండాలా? వేరే కులాలు వద్దా? ఎస్సీలు, బీసీలు, ఓసీలు వద్దా? దయచేసి ఇలాంటివి ఆపండి. పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా ఆయనను విమర్శించినా.. టార్గెట్‌ చేసినా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. మనోహర్‌కు ఏమైనా మణులు, మాణిక్యాలు ఇచ్చామా? మన పార్టీలోకి వచ్చి ఓడిపోయారు. మహిళలను కించపరిచినా, సామాజిక మాధ్యమాల్లో మహిళలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది’ అని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని