Deve Gowda - Kumaraswamy: ‘కింగ్‌’ మేకరూ కాలేదాయె..

కర్ణాటకలో ఏకైక ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్‌(ఎస్‌)కు 2023 ఎన్నికలు పీడకలనే మిగిల్చాయి.

Updated : 14 May 2023 09:35 IST

జేడీఎస్‌కు నిరాశాజనక ఫలితం
కుమారుడినీ గెలిపించుకోలేకపోయిన కుమార స్వామి

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో ఏకైక ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్‌(ఎస్‌)కు 2023 ఎన్నికలు పీడకలనే మిగిల్చాయి. 1999 ఎన్నికల్లో జేడీయూ నుంచి విడిపోయి జేడీఎస్‌గా అవతరించిన ఆ పార్టీ అతి తక్కువ స్థానాలను గెలుచుకుంది ఈ ఎన్నికల్లోనే. 1999లో జేడీయూతోపాటు పోటీ చేసిన జేడీఎస్‌ 10 స్థానాలే గెలుచుకోగా ఆపై ఏ ఎన్నికల్లోనూ ఇంత పేలవమైన ఫలితాలను మూటగట్టుకోలేదు. 2004లో 58 స్థానాలు గెలిచి భాజపాతో కలిసి అధికారంలోకి వచ్చిన జేడీఎస్‌ 2008లో 28 స్థానాలు, 2013లో 40, 2018లో 38 స్థానాలను గెలుచుకుంది. గత ఐదు ఎన్నికల్లో రెండుసార్లు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌గా చక్రం తిప్పిన జేడీఎస్‌ ఈ ఎన్నికల్లోనూ అదే పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరింది. ఇతర పార్టీల్లో చీలే ఓట్లతోనే పబ్బం గడుపుకునే దళపతుల రాజకీయ వ్యూహాలేవీ ఈసారి పని చేయలేదు. ఏదేని జాతీయ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్న జేడీఎస్‌ ఆశలకు కాంగ్రెస్‌ గండికొట్టింది. దీంతో చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో జేడీఎస్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది.

* ఈసారి ఎన్నికల్లో జాతీయ పార్టీల నుంచి టికెట్‌ దక్కని వారిని ఆహ్వానించి మరీ టికెట్లు ఇచ్చింది. ఇలా 224 స్థానాల్లో 217 చోట్ల అభ్యర్థులను నిలిపింది. తనకు ఏమాత్రం పట్టులేని కరావళి, కిత్తూరు కర్ణాటకలోనూ 50 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. తీరా ఫలితాలు వెల్లడయ్యాక 19 స్థానాలకే పరిమితమైంది. 2004 నుంచి కనీసం 20 శాతానికి అటు ఇటుగా ఓట్లను సాధించే జేడీఎస్‌కు ఈసారి దక్కిన ఓట్లు 14 శాతమే. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి జేడీఎస్‌కు 4శాతం తక్కువ ఓట్లు పోలయ్యాయి.

ప్రచారంలోనే జోరు

దేశానికి ప్రధాని, రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇచ్చిన జేడీఎస్‌ క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. మాజీ ప్రధాని దేవేగౌడ ఆరోగ్యం క్షీణించడం, కుటుంబ రాజకీయాలకే పరిమితం కావడంతో ద్వితీయ శ్రేణి నేతల రాజకీయ భవిష్యత్తుకు ఇక్కడ భరోసా లేకుండా పోయింది. గౌడ కుటుంబ సభ్యుల తర్వాత గట్టి నేతలుగా గుర్తింపు పొందిన ఎ.టి.రామస్వామి, శివలింగే గౌడ, శ్రీనివాస గౌడ వంటి నేతలు ఇటీవల భాజపా, కాంగ్రెస్‌లకు వెళ్లి అక్కడి నుంచే గెలుపొందారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ రామనగర నుంచి పోటీ చేసి ఓడిపోవటం ఆ పార్టీ కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. జాతీయ పార్టీల కంటే ఆరు నెలల ముందుగా పంచరత్న రథయాత్రను ప్రారంభించిన కుమారస్వామి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జిల్లాల్లో పర్యటించారు. పండ్లు, కూరగాయలతో తయారు చేసిన భారీ మాలలను ధరించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇవేమీ జేడీఎస్‌ గెలుపు శాతాన్ని పెంచలేకపోయాయి.


గెలుపోటములను సమానంగా చూస్తాం: కుమార స్వామి

ఓటమిని అంగీకరిస్తున్నానని, గెలుపోటములను సమానంగా చూస్తానని జేడీఎస్‌ నేత కుమార స్వామి తెలిపారు. ఇవే తనకు, తన కుటుంబానికి చివరి ఎన్నికలు కావని స్పష్టం చేశారు. ఫలితాల అనంతరం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల తీర్పును స్వాగతిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే ఫైనల్‌. గెలుపోటములను సమానంగా చూస్తా. నా పోరాటం ఆగదు. ప్రజలతోనే ఉంటా. 19 చోట్ల మా పార్టీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు’ అని కుమార స్వామి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని