Telangana - Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం.. తెలంగాణపై ప్రభావం ఎంత?

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉండబోతుందన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated : 14 May 2023 08:28 IST

రాజకీయవర్గాల్లో చర్చ
హ్యాట్రిక్‌పై ధీమాతో భారాస
చేరికలపై కాంగ్రెస్‌లో ఆశలు
ఆ ప్రభావం ఉండదంటున్న భాజపా
పొంగులేటి, జూపల్లిల అడుగులెటో?

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉండబోతుందన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి అధికార భారాస నుంచి బయటకు వచ్చిన నాయకులపైౖ ఈ ఫలితాల ప్రభావం కొంత ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఫలితాలు తమ పార్టీలో ఉత్తేజం నింపాయంటున్న కాంగ్రెస్‌.. తమ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని, పైగా ఇతరులు తమ వైపు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది. భాజపా మాత్రం కర్ణాటక ఫలితాలతో తెలంగాణకు సంబంధం లేదని, ఇక్కడ అధికార పార్టీని తామే గట్టిగా ఎదుర్కోగలమని చెబుతోంది. ఇప్పటికే భారాస నుంచి బయటకు వచ్చి.. ఎటువైపు వెళ్లాలా అనే ఆలోచనలో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఎటువైపు మొగ్గు చూపుతారన్న చర్చ మొదలైంది. వీరిని చేర్చుకునేందుకు గత కొంత కాలంగా అటు భాజపా, ఇటు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తుండగా, వీరిద్దరూ వాయిదా వేస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని వారి సన్నిహిత వర్గాల సమాచారం.

కర్ణాటక ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో వారి అడుగులు ఎటు పడతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకొనేందుకు ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో భాజపా చేరికల కమిటీ ఏర్పాటు చేసింది. ఈటలతోపాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు ఖమ్మం వెళ్లి పొంగులేటి, జూపల్లిలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించినా నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం కావాలని వారు పేర్కొన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులు కూడా వీరిద్దరితో చర్చించారు. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం ప్రతినిధులు కూడా చర్చించినట్లు తెలిసింది. వనపర్తి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ లోకనాథరెడ్డి, మరికొందరు నాయకులు ఇటీవల అధికార పార్టీ నుంచి బయటకు వచ్చారు. వీరితో ఆదివారం వనపర్తిలో జూపల్లి, పొంగులేటిలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారాస నాయకులకు ఎప్పటికప్పుడు కేసీఆర్‌ దిశానిర్దేశం

రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరో నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు పార్టీలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి తక్కువ సమయమే ఉంది. అధికార భారాస ఎన్నికలకు పూర్తిస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకులందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుండగా, కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల ఫలానా ఎమ్మెల్యేను మళ్లీ గెలిపించండని కూడా కోరుతున్నారు. మరో మంత్రి హరీశ్‌రావు కూడా పలు జిల్లాల్లో పర్యటిస్తూ.. కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ.. తిరిగి గెలుపొంది హ్యాట్రిక్‌ సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. భాజపాపై, కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా.. అధికారిక కార్యక్రమాల్లో సైతం ప్రధానితో కలిసి పాల్గొనడం లేదు.

తెరాసను భారాసగా మార్చాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నప్పుడు మొదట కేసీఆర్‌ వెంట నడిచింది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామే. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌ తరఫున కేసీఆర్‌ ప్రచారానికి వెళ్తారని భావించినా చివరకు అలా జరగలేదు. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచి.. భాజపా ఓడిపోవడంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. భాజపాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు, భాజపా, కాంగ్రెస్‌లు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో యుద్ధం ప్రకటించాయి. ప్రధాని మోదీ, అమిత్‌షా తదితరులు పలు కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై, భారాస నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ కూడా తమ పార్టీ ముఖ్య నాయకులతో బహిరంగ సభలు నిర్వహించింది. ఆ పార్టీలో కొంత ఉత్సాహం, చేరికలపై కొంత ప్రభావం తప్ప.. రాష్ట్ర రాజకీయాలపై కర్ణాటక ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని