Vijayasai Reddy: విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరుల సస్పెన్షన్‌

విశాఖలో అధికార వైకాపా ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు రగులుతోంది. పార్టీ అనుబంధ విభాగాల జోనల్‌ ఇన్‌ఛార్జుల వ్యవహారంతో రాజుకున్న వేడి పెరుగుతోంది.

Updated : 14 May 2023 08:50 IST

చక్రం తిప్పిన వైవీ సుబ్బారెడ్డి
విశాఖ వైకాపాలో ఆధిపత్యపోరు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో అధికార వైకాపా ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు రగులుతోంది. పార్టీ అనుబంధ విభాగాల జోనల్‌ ఇన్‌ఛార్జుల వ్యవహారంతో రాజుకున్న వేడి పెరుగుతోంది. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి నిర్ణయించిన వారితో నియామక ప్రకటన విడుదలైన ఒక్క రోజులోనే పేర్లు మార్చేలా మాజీ ఇన్‌ఛార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం జరిగిన గంటల వ్యవధిలోనే విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరులైన వైకాపా నగర 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేష్‌, 89వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆడారి ఆనంద్‌కుమార్‌కు సహకరించకపోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీనికి వెనుక వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. కనీసం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మేయర్‌, ఫ్లోర్‌లీడర్‌ ఎవరికీ తెలియకుండానే వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారనే అంశం పార్టీలో చర్చకు దారి తీసింది. పీవీ సురేష్‌, దొడ్డి కిరణ్‌లు విజయసాయిరెడ్డికి కొన్నేళ్లుగా ప్రధాన అనుచరులుగా ఉన్నారు. విజయసాయిరెడ్డి ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు పీవీ సురేష్‌కు ట్రేడ్‌ యూనియన్‌లో ఓ డైరెక్టరు పోస్టు ఇచ్చారు. భూకబ్జాల వివాదాల్లో ఉన్న దొడ్డి కిరణ్‌ ఏకంగా విజయసాయిరెడ్డికి శిలా విగ్రహం నిర్మించి అప్పట్లో స్వామిభక్తి ప్రదర్శించారు. వీరిద్దరిపై ఆది నుంచి ఆరోపణలున్నాయి. విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరులు కావడంతో వీరి హవా సాగినట్లు పలువురు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని