ఆ నాలుగు రాష్ట్రాలపై ప్రభావమెంత?

కర్ణాటక ఫలితాల వెల్లడితో అందరి దృష్టీ రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలవైపు మళ్లుతోంది. ఈ ఏడాది చివరిలోగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.  

Updated : 14 May 2023 06:33 IST

రాజస్థాన్‌, ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలపై దృష్టి

ఈనాడు, దిల్లీ: కర్ణాటక ఫలితాల వెల్లడితో అందరి దృష్టీ రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలవైపు మళ్లుతోంది. ఈ ఏడాది చివరిలోగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.  వీటిలో మూడు ఉత్తరాది రాష్ట్రాలు కాగా, ఒకటి దక్షిణాది రాష్ట్రం. మొదటి మూడు రాష్ట్రాల్లో భాజపా సుదీర్ఘ పాలన సాగించగా, తెలంగాణలో తొలిసారి జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. వీటిపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఎలా ఉండొచ్చనేది ఆసక్తికరాంశం!

రాజస్థాన్‌: వసుంధరకు ఊతం?

కర్ణాటక ఫలితాలు భాజపా అగ్రనాయకత్వానికి నిరుత్సాహం కల్గించినా రాజస్థాన్‌ స్థానిక నేత వసుంధర రాజెకు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటాయి. అంతా ఒకే పార్టీ నాయకులే అయినప్పటికీ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలన్న వైఖరి ఇక్కడ నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూ వస్తోంది. వసుంధర ఆధిపత్యాన్ని తగ్గించడానికి భాజపా నాయకత్వం నిరంతరం ఇతర నేతలను రాష్ట్రంలో ప్రోత్సహిస్తోంది. ఆమెను బలంగా వ్యతిరేకించే గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యామ్నాయ నేతగా తయారుచేసే పనిలో భాజపా అధిష్ఠానం ఉంది. అయితే కర్ణాటకలో బలమైన నాయకుడు యడియూరప్పను తప్పించి ఇతర నేతలకు పగ్గాలు అప్పగించడంవల్ల పార్టీ దెబ్బతిందన్న భావనను ప్రస్తుత ఫలితాలు కల్పించాయి. ఈ అనుభవం నేపథ్యంలో రాజస్థాన్‌లో ఇకమీదట వసుంధర రాజెను, ఆమె మాటను పెడచెవిన పెట్టడానికి భాజపా అధిష్ఠానం సాహసిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తున్న రాజస్థాన్‌లో వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారం చేజిక్కించుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ల మధ్య ఉన్న అంతర్గత పోరు అందుకు ఊతమిస్తోంది.

మధ్యప్రదేశ్‌: కమల్‌తో కమలం ఢీ?

ఇక్కడ భాజపా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాయకత్వపరంగా బలంగా ఉన్నప్పటికీ 2005 నుంచి వరుసగా నాలుగోసారి (2018 డిసెంబర్‌ 17 నుంచి 2020 డిసెంబర్‌ 23 వరకు మినహా) ఆ పదవిలో కొనసాగుతుండటంతో సహజంగా ఎదురయ్యే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఉమ్మడి నాయకత్వంలో వెళ్లడానికి ప్రయత్నించ వచ్చనే భావన భాజపా వర్గాల్లో వ్యక్తమవుతూ వస్తోంది. అయితే కర్ణాటక ఫలితం నేపథ్యంలో చౌహాన్‌లాంటి బలమైన నాయకుడిని పక్కనపెట్టే సాహసం భాజపా నాయకత్వం చేయకపోవచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. అలాచేస్తే బలమైన ఓబీసీ నేతను పక్కన పెట్టారన్న అపవాదునూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది భాజపాకు నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. అందువల్ల భాజపా అధిష్ఠానం దూకుడుగా కాకుండా కొంత ఆచితూచి అడుగులువేసే అవకాశాలు ఎక్కుగా కనిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక ఫలితం మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌కు ఉత్సాహాన్నిస్తుందనటంలో సందేహం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 స్థానాలు గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఇతరుల సహాయంతో కమల్‌నాథ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ 15 ఏళ్ల తర్వాత దక్కిన ఆ అధికారం జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో 15 నెలల్లోనే చేజారిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని భాజపా నాయకత్వం అప్రజ్వామికంగా కూల్చేసిందన్న సానుభూతితో కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాహుల్‌ నిర్వహించిన జోడో యాత్ర ఇక్కడ బాగానే సాగింది. దాన్ని చూసి రాహుల్‌గాంధీ కూడా రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్‌ స్వీప్‌ చేస్తుందని ప్రకటించారు. కర్ణాటక తరహాలో స్థానిక అంశాలను ఎత్తిచూపే వ్యూహాన్ని ఇక్కడా అమలుచేసి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించొచ్చు. హిమాచల్‌, కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ శ్రేణుల్లో స్థైర్యం నింపే అవకాశం ఉన్నందున రాబోయే ఎన్నికలను బలంగా ఎదుర్కొనేందుకు వీలుంటుంది.

ఛత్తీస్‌గఢ్‌: బఘేల్‌ మళ్లీ జిగేల్‌ అనేనా?

ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ స్థిరంగా ఉన్నారు. ఒకవైపు అధిష్ఠానానికి విశ్వాసంగా ఉంటూనే మరోవైపు స్థానికంగా పార్టీని బలంగా నిలబెట్టుకొని, ప్రాంతీయ పార్టీ నేత తరహాలో పని చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, రైతులపై దృష్టిపెట్టి పనిచేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఫలితాలు ఇక్కడ పార్టీ నాయకత్వానికి మంచి ఊపునిచ్చాయనడంలో సందేహం లేదు. ఇటీవల ఛత్తీస్‌గడ్‌ భాజపా ముఖ్యనేత, ఎస్టీల్లో పేరెన్నికగన్న మాజీ ఎంపీ నందకుమార్‌సాయిని కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. తద్వారా ఎస్టీ సామాజికవర్గంలో పార్టీని బలంగా తీసుకొళ్లే వ్యూహం అమలు చేశారు. మరోవైపు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్‌సింగ్‌ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అనే సంశయంలో భాజపా ఉంది. ఎన్నికల ముందు భూపేష్‌ బఘేల్‌ను ఢీకొనే కొత్త నాయకత్వం తయారు చేసుకోవడం భాజపా నాయకత్వానికి పెద్ద సవాల్‌.

తెలంగాణ: దూకుడు పెరిగేనా?

కర్ణాటక ఫలితాలు తెలంగాణ భాజపాకు మింగుడుపడకున్నా భారాస, కాంగ్రెస్‌కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చేవే! తెలంగాణ ప్రాంత ప్రజలూ భాజపాను నమ్మరన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ రెండు పార్టీలకు అవకాశం దొరికింది. తెలంగాణ భాజపా నేతలపై మానసికంగా పైచేయి సాధించి... దూకుడు పెంచడానికి భారాస, కాంగ్రెస్‌లకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ప్రశాంత్‌ కిశోర్‌ తరహాలో కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు పనిచేసి ఆ పార్టీకి మంచి విజయం దక్కేలా చూశారు. తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్తగానూ ఆయనే వ్యవహరిస్తున్నందున ఆ అనుభవం ఇక్కడ ఎలా పనిచేస్తుందన్నది చూడాలి. అలాగే ఎన్నికల సందర్భంలో ప్రచారానికి అవసరమైన అన్ని రకాల వనరులూ సమకూర్చుకునే వెసులుబాటు కర్ణాటకలో విజయం ద్వారా కాంగ్రెస్‌కు లభిస్తుంది. మరోవైపు భారాస రాబోయే ఎన్నికల్లో భాజపాను ప్రధాన శత్రువుగా చూపుతూ దూకుడు ప్రదర్శిస్తోంది. కర్ణాటకలో భాజపా దారుణంగా దెబ్బతినడంవల్ల తెలంగాణలో భారాస మరింతగా దాడి చేసేందుకు ఆయుధం చిక్కినట్లయింది. తాము మద్దతు ఇచ్చిన జేడీ (ఎస్‌) కర్ణాటకలో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ భాజపా ఓడిపోవడం తెలంగాణలో భారాసకు ఊరటనిచ్చే అంశమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని