Karnataka CM: కర్ణాటక రాజకీయం దిల్లీకి

కర్ణాటకలో విజయం సాధించినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తేల్చుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందిగా మారింది.

Updated : 15 May 2023 08:24 IST

పరిశీలకుల సమక్షంలో బెంగళూరులో సీఎల్పీ భేటీ
సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి వదిలేస్తూ తీర్మానం
సిద్ధరామయ్యతో ఖర్గే సమావేశం

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో విజయం సాధించినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తేల్చుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందిగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉండడం దీనికి కారణం. కీలకమైన ఈ అంశం ఇప్పుడు అధిష్ఠానం కోర్టులోకి చేరింది. ఆదివారం  బెంగళూరులోని ఓ హోటల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. పార్టీ సంప్రదాయం ప్రకారం సీఎంను ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సీఎల్‌పీ ఏకవాక్యంతో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్యే ప్రతిపాదించారు. పార్టీని విజయతీరానికి చేర్చిన కాంగ్రెస్‌ అగ్రనేతలకు, ప్రజలకు మరో తీర్మానంలో ధన్యవాదాలు తెలిపారు. దానిని శివకుమార్‌ ప్రతిపాదించారు. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో, పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6.5 కోట్ల కన్నడిగులకు సేవలందిస్తామని తీర్మానం పేర్కొంది.

సీఎల్‌పీ సమావేశానికి ఏఐసీసీ నుంచి పరిశీలకులుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ శిందే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్‌, మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్‌ బాబ్‌రియాలతో పాటు దిల్లీ నుంచి వచ్చారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యునిగా ఉన్న రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా కూడా దీనికి హాజరయ్యారు. మొత్తం 135 మంది ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాన్ని సేకరించి అధిష్ఠానానికి పంపాలని ముందుగా నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ఎవరూ ఈ సమావేశంలో నిర్ణయాన్ని వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. ఈ అంశం అధిష్ఠానం ముందే తేలాల్సి ఉండటంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు సోమవారం దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలిసేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఉదయం సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా సమావేశమైన మల్లికార్జున ఖర్గే అనంతరం దిల్లీకి వెళ్లారు. ఇద్దరు నేతలతో పరిశీలకులు తొలుత విడిగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ఆదివారం రాత్రికే పూర్తవుతుందని వేణుగోపాల్‌ స్పష్టంచేశారు.

నువ్వా? నేనా?

ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోటీ తీవ్రరూపం దాల్చింది. ఎమ్మెల్యేల తీర్మానం ద్వారా ముఖ్యమంత్రిని తేల్చాలని సిద్ధరామయ్య పట్టుబట్టినా అందుకు డీకే నిరాకరించారు. సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేల బలం ఉందన్న కారణంతో ఆయన ఈ నిర్ణయాన్ని అధిష్ఠానానికి వదిలేయాలని పట్టుబట్టారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేయటంతో డీకే అప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో అందరినీ కలుపుకొని వెళ్లేందుకు పాటుపడ్డాననీ, తనకోసం ఏమీ కోరుకోలేదని శివకుమార్‌ విలేకరులకు చెప్పారు. తనకు, సిద్ధూకు మధ్య ఏమాత్రం విభేదాల్లేవన్నారు. ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారనేదాని కంటే ఎవరు కష్టపడ్డారనేదానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పార్టీ కోసమే తాను శ్రమించాననీ, పలు కష్టాలూ ఎదుర్కొన్నానని వివరించారు. సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్‌ బయట ఇరువురు నేతల మద్దతుదారులు నినాదాలతో హడావుడి చేశారు. కాబోయే ముఖ్యమంత్రులుగా పేర్కొంటూ వారి నివాసాల వెలుపల బ్యానర్లు కట్టారు. ఏడుసార్లు ఎంపీగా చేసిన కె.హెచ్‌.మునియప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, లింగాయత నేత ఎం.బి.పాటిల్‌ కూడా సీఎం పదవికి పోటీపడుతున్నారు.

అధిష్ఠానం నిర్ణయిస్తుంది: ఖర్గే

ముఖ్యమంత్రి విషయంలో నూతన ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు అధిష్ఠానానికి నివేదిస్తారని, దానిపై అది తుది నిర్ణయం తీసుకుంటుందని మల్లికార్జున ఖర్గే దిల్లీలో తన నివాసం వద్ద విలేకరులకు తెలిపారు. ‘ప్రభుత్వం సజావుగా నడిచేలా చూడాలి. ఏకాభిప్రాయ సాధనతోనే అది వీలవుతుంది. మాది ప్రజాస్వామ్యయుత పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అంతా సజావుగా జరిగింది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటవుతుంది.  పార్టీ ప్రకటించిన అయిదు హామీలకు ప్రజలు ఆమోదం తెలిపారు. వారి అంచనాలకు తగ్గట్టుగా వీటిని అమలుచేస్తాం. కేబినెట్‌ ఏర్పడిన  మొదటిరోజే హామీలకు జీవం పోస్తాం. కర్ణాటక, మహారాష్ట్రల్లో పాలన బాగుంటుందని ఒకప్పుడు చెప్పుకొనేవారు. దానిని మళ్లీ తీసుకువస్తాం’ అని ఖర్గే చెప్పారు. 2018లో ఏర్పాటైన శాసనసభ గడువు ఈ నెల 24 నాటితో ముగుస్తుంది. ఆలోగానే నూతన ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు