Yuvagalam: జన బలంతో యువగళం

యువగళం పేరుతో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన మహా పాదయాత్ర సోమవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంటోంది.

Updated : 15 May 2023 06:05 IST

లోకేశ్‌ పాదయాత్రకు నేటితో 100 రోజులు

ఈనాడు, అమరావతి: యువగళం పేరుతో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన మహా పాదయాత్ర సోమవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. 34 శాసనసభ నియోజకవర్గాల మీదుగా సాగిన పాదయాత్ర ఈ నెల 15కు 1,268 కి.మీ.లు పూర్తి చేసుకుంటోంది. లోకేశ్‌కు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, తెదేపా శ్రేణులనుంచి ఘన స్వాగతం లభిస్తోంది. ఆయా జిల్లాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు, తెదేపా నాయకులు తరలివచ్చి సంఘీభావం చెబుతున్నారు. ‘యువగళం’ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం తొలి రోజునుంచీ ప్రయత్నించింది. జీవో1ని చూపించి అవరోధాలు సృష్టించింది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం చేరేంత వరకు మొత్తం 25 పోలీసు కేసులు నమోదు చేసింది. లోకేశ్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ప్రచార రథం, సౌండ్‌సిస్టమ్‌, మైక్‌ సహా అన్నింటినీ సీజ్‌ చేశారు. చివరకు పీలేరులో బాణాసంచా కాల్చారని అక్కడి పార్టీ ఇన్‌ఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సహా పలువురిపై మూడు కేసులు నమోదయ్యాయి.

1.40 లక్షల మందితో ఫొటోలు

మండే ఎండలను, భారీ వర్షాలను లెక్క చేయకుండా లోకేశ్‌ పాదయాత్ర సాగుతోంది. వంద రోజుల్లో 32 సభలు, వివిధ వర్గాలతో 87 ముఖాముఖిలను నిర్వహించారు. ప్రజలనుంచి 1,900కుపైగా విన్నపాలు అందాయి. ప్రతి వంద కి.మీ.ల మజిలీలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో దాన్ని పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు 12 అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. ప్రతి రోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో ‘సెల్ఫీ విత్‌ లోకేశ్‌’ పేరుతో ఇప్పటివరకు 1.40 లక్షల ఫొటోలు దిగారు. లోకేశ్‌తో సెల్ఫీ దిగినవారికి ఆ ఫొటోలను వారి ఫోన్లకు పంపించే ఏర్పాట్లుచేశారు.

ప్రత్యేక ఆకర్షణగా సెల్ఫీ ఛాలెంజ్‌

తెదేపా హయాంలో వచ్చిన ప్రాజెక్టుల గురించి ప్రజలకు గుర్తు చేస్తూ.. వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ లోకేశ్‌ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెనుగొండ నియోజకవర్గంలో కియా ఫ్యాక్టరీ ఎదుట నిలబడి సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. టీసీఎల్‌, జోహో, డిక్సన్‌వంటి కంపెనీల వద్ద ఆయన విసిరిన సెల్ఫీ ఛాలెంజ్‌లు యువతను ఆకట్టుకుంటున్నాయి.

వివిధ వర్గాలకు భరోసా

వివిధ వర్గాలతో ముఖాముఖి నిర్వహిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు.. ఇలా వివిధ వర్గాలవారితో లోకేశ్‌ సమావేశాలు నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చేయకపోవడంతో వివిధ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు లోకేశ్‌ దృష్టికి తేగా, తెదేపా అధికారంలోకి వచ్చాక వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తామని హామీనిచ్చారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జాబ్‌ నోటిఫికేషన్‌, ఏటా జాబ్‌ క్యాలెండర్‌, పరిశ్రమల్ని తీసుకురావడం ద్వారా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. మొబైల్‌ ఫోన్లకే శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు పంపిస్తామని హామీనిచ్చారు. బీసీల రక్షణకు ఎస్సీ, ఎస్టీల తరహా చట్టం, ముస్లింలకు ఇస్లామిక్‌ బ్యాంక్‌, వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్‌ అధికారాలు, చేనేతలు, రజక వృత్తి పనివారికి ఉచిత విద్యుత్‌వంటి హామీలిచ్చారు.


‘హలో లోకేశ్‌’కు మంచి స్పందన

ప్రతి జిల్లాలో ఒక చోట నిర్వహించే ‘హలో లోకేశ్‌’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. తిరుపతిలో ఫిబ్రవరి 2న విద్యార్థులతో, ఏప్రిల్‌ 8న అనంతపురం జిల్లా శింగనమలలో రైతులతో, ఏప్రిల్‌ 24న ఆదోనిలో సర్పంచులతో, మే 7న కర్నూలులో ముస్లిం మైనారిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆయా సందర్భాల్లో పలు హామీలిచ్చారు. తెదేపా అధికారంలోకి రాగానే పోలవరాన్ని పూర్తిచేసి రాయలసీమకు గోదావరి మిగులు జలాలు తెస్తామని, పంచాయతీలకు నిధులు, విధులు కల్పిస్తామని, సచివాలయ వ్యవస్థను పంచాయతీలకు అనుసంధానిస్తామని, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామని హామీనిచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చోట బహిరంగ సభ నిర్వహిస్తూ.. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను లోకేశ్‌ ఎండగడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతున్నారు.


యువగళానికి సంఘీభావంగా నేడు పాదయాత్రలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సోమవారం నాటికి వంద రోజుల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ పాదయాత్రలు నిర్వహించనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల మంది కార్యకర్తలతో ఏడు కి.మీ. యాత్ర సాగనుంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో విజయవంతంగా యాత్ర నిర్వహించాలని, పెద్ద ఎత్తున  నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆ పార్టీ ఆదివారం ఓ ప్రకటనలో కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని