ఓటమి.. ఎందుకు? ఎలా?

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకున్న భాజపా ఓటమికి దారి తీసిన కారణాలపై సమీక్ష ప్రారంభించింది.

Published : 15 May 2023 03:57 IST

ఆత్మావలోకనంలో కమలదళం

ఈనాడు, బెంగళూరు; బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకున్న భాజపా ఓటమికి దారి తీసిన కారణాలపై సమీక్ష ప్రారంభించింది. కేంద్రంలో అధికారంలో ఉండి, జాతీయ నేతలతో ఇబ్బడిముబ్బడిగా ప్రచారాలు చేయించినా ఎందుకు? ఎలా? పరాజయం పాలయ్యామని ఆత్మావలోకనం ఆరంభించింది. ఈ క్రమంలో బూత్‌ స్థాయిలో సమీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌.. కొందరు గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన నేతలతో ఆదివారం బెంగళూరులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలపై అధిష్ఠానానికి నివేదిక పంపుతామని బొమ్మై తెలిపారు. ఇది ప్రధాని మోదీ ఓటమని కాంగ్రెస్‌ పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. పరాజయానికి పలు కారణాలుంటాయని తెలిపారు. భాజపా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్నారు. అయితే నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు ఓటు షేర్‌లో తేడా వచ్చిందని తెలిపారు. తాము హిందుత్వతో ఈ ఎన్నికల్లో పోరాడలేదని, అభివృద్ధి కోణంలోనే వెళ్లామని చెప్పారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వ ప్రచారం కంటే కాంగ్రెస్‌ ఇచ్చిన ఉచిత పథకాలకే ఓటర్లు ఆకర్షితులయ్యారని బొమ్మై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. అభివృద్ధి అంశాల్లో వారికి సహకారం అందిస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే..

ఓటమికి దారి తీసిన కారణాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తప్ప జాతీయ నాయకత్వ లోపం కాదని భాజపా సమర్థించుకుంటోంది. ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది స్థానిక నాయకుల కారణంగానే కానీ జాతీయ నేతల ప్రభావంతో కాదు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని. రాష్ట్రంలో పార్టీ కోసం ప్రచారం చేసేందుకు మాత్రమే ఆయన వచ్చారు. మోదీ ప్రచారం చేసినా ఓడిపోయినందుకు ప్రత్యేక కారణాలు వెతకాల్సిన అవసరం లేదు’’ అని భాజపా భావిస్తోంది.

మోదీ ప్రచార ప్రాంతాల్లో విజయం 30 శాతమే

ప్రధాని మోదీ 40 రోడ్‌ షోలు, 30 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎన్నికల ఫలితాల ప్రకారం ఆయన పర్యటించిన ప్రాంతాల్లో విజయాలు 30 శాతం ఉండగా, కేంద్ర మంత్రి అమిత్‌ షా పర్యటించిన ప్రాంతాల్లో గెలుపు 25 శాతానికి లోపే. బెంగళూరులో మోదీ చేపట్టిన రోడ్‌ షో కారణంగా గత స్థానాల కంటే భాజపా 5 స్థానాలు అదనంగా గెలిచింది. మిగిలిన ప్రాంతాల్లో పార్టీ గణనీయంగా ఓటమి పాలైంది. ఏకంగా 12 మంది మంత్రులు ఇంటిబాట పట్టారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని