Sajjala Ramakrishna Reddy: శుభం.. మంచిది.. వాళ్ల ఏడుపెందుకు?

‘శుభం.. మంచిది.. అలాంటప్పుడు వాళ్ల ఏడుపు ఎందుకు?’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated : 16 May 2023 10:04 IST

చంద్రబాబు నివాసం వ్యవహారంలో వైకాపా మూల్యం చెల్లించుకుంటుందనే వ్యాఖ్యలపై సజ్జల ప్రతిస్పందన
ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది నూతన ఎమ్మెల్సీలు

ఈనాడు, అమరావతి: ‘శుభం.. మంచిది.. అలాంటప్పుడు వాళ్ల ఏడుపు ఎందుకు?’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘దిల్లీలో రాహుల్‌గాంధీని ఇల్లు ఖాళీ చేయించిన భాజపా కర్ణాటకలో మూల్యం చెల్లించుకుంది, ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా వైకాపాకు అదే జరుగుతుంది’ అని తెదేపా నేతలు అంటున్నారని విలేకరులు సజ్జల దృష్టికి తేగా ఆయన ఈ విధంగా స్పందించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో నూతన ఎమ్మెల్సీలు ఎనిమిది మంది పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరవాత సజ్జల విలేకరులతో మాట్లాడుతూ.. ‘సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో (చంద్రబాబు, తెదేపా వారిని ఉద్దేశించి) వారున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఏమి జరుగుతున్నా ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది. జగన్‌ కక్ష సాధింపులకు దిగాలనుకుంటే అధికారంలోకి రాగానే వారిని లోపల వేసేవారు... అలా చేయలేదే. ప్రక్రియలో భాగంగానే దర్యాప్తు శాఖలకు ఈ వ్యవహారం అప్పగించారు. ఆ సంస్థలే విచారిస్తున్నాయి. చేయకపోతే మీరేం చేయగలిగారని అంటారు. ఏదైనా చేస్తుంటే కక్ష సాధింపు అనీ, రాహుల్‌ గాంధీ ఇంటి విషయంలో భాజపా మూల్యం చెల్లించినట్లే వైకాపా మూల్యం చెల్లిస్తుందని అంటున్నారు. మంచిది.. శుభం, అన్నీ జనం చూస్తున్నారు కదా? ఇంక వారి ఏడుపెందుకు?’ అని వ్యాఖ్యానించారు.

వీటికి సమాధానం చెప్పండి

‘తెదేపా 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కరకట్ట మీద ఉన్న కట్టడాలు అక్రమమని ప్రకటించింది. కానీ, అదే కరకట్ట మీద ఉన్న లింగమనేని రమేశ్‌ ఇంట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, మంత్రిగా ఆయన కొడుకు లోకేశ్‌ నివాసం ఉన్నారు. ఇప్పుడూ ఉంటున్నారు. పైసా అద్దె చెల్లించకుండా.. అద్దె ఒప్పందం లేకుండా ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారు. పైగా ఆ ఇంటికి మరమ్మతులు, ఇతర పనుల కోసం ప్రభుత్వంతో ఎలా ఖర్చు పెట్టించారు? మరోవైపు దేశభక్తుడిగా నా ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చానని లింగమనేని కోర్టులో చెప్పారు. ఆ ఇల్లు ఇచ్చినందుకు క్విడ్‌ప్రోకో కింద లింగమనేని రమేశ్‌కు చెందిన 200-240 ఎకరాల భూమి విలువ పెరిగేలా  దాని పక్కనుంచి రాజధాని భూసమీకరణను చంద్రబాబు చేశారు. అందుకు ప్రతిగా హెరిటేజ్‌కు 4 ఎకరాలను కారుచవకగా లింగమనేని కంపెనీ నుంచి బదలాయించడం కుంభకోణం. చంద్రబాబు, ఆయన ఆడించినట్లు ఆడే పవన్‌ కళ్యాణ్‌, ఆఖరికి కమ్యూనిస్టులూ కరుడుగట్టిన దుర్మార్గులు, సంపన్నులు, పెత్తందారుల పక్షాన చేరి జగన్‌ తెస్తున్న కొత్త రాజకీయం రాకూడదని దుర్మార్గంగా దాడి చేస్తున్నారు’ అని విమర్శించారు.

నిబంధనల ప్రకారమే దర్యాప్తు ముందుకు

‘కోర్టు నుంచి వచ్చాకనే చంద్రబాబు ఉంటున్న కరకట్ట ఇంటిని సీఐడీ అటాచ్‌ చేసింది. ఇదేమీ రాజకీయ నిర్ణయం కాదు. ఇందులో చంద్రబాబుకు నోటీసు ఇవ్వడంపై సీఐడీ వారికున్న నిబంధనల మేరకు ముందుకు వెళతారు. ఇంకా లోతుల్లోకి వెళితే నగదు వ్యవహారాలు కూడా ఉండొచ్చు’ అని సజ్జల ఆరోపించారు. రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ‘జగన్‌ బటన్‌ నొక్కి డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు అపహాస్యంగా మాట్లాడుతున్నాయి. బిక్కుబిక్కుమంటూ ఉన్న వారి బతుకులను సరిదిద్దేందుకు నొక్కే బటన్‌ ఎందుకు మీకు అపహాస్యంగా కనిపిస్తోంది? ఈ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల ఫలితాలను కొంతకాలం తరవాత అంతా చూస్తారు’ అని వ్యాఖ్యానించారు.

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు

స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ఎనిమిది మంది నూతన ఎమ్మెల్సీలతో శాసనమండలి ఛైర్మన్‌ మోషేను రాజు ప్రమాణం చేయించారు. పి.రామసుబ్బారెడ్డి, మేరిగ మురళీధర్‌, కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌, కుడిపూడి సూర్యనారాయణరావు, నర్తు రామారావు, సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ ప్రమాణం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని