Yuvagalam: ప్రజాభిమానానికి ‘వంద’నం

‘యువగళం’ పాదయాత్ర వందో రోజు నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో సోమవారం ఉత్సాహంగా సాగింది.

Updated : 16 May 2023 06:23 IST

‘యువగళం’ వందో రోజు భారీగా హాజరైన జనం
తల్లి, కుటుంబీకులతో కలిసి నడిచిన లోకేశ్‌
గిరిజనులతో ముఖాముఖిలో పాల్గొన్న నేత

ఈనాడు, కర్నూలు: ‘యువగళం’ పాదయాత్ర వందో రోజు నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో సోమవారం ఉత్సాహంగా సాగింది. భారీగా హాజరైన జనసందోహం మధ్య తెదేపా యువ నేత నారా లోకేశ్‌ ఉత్సాహంగా నడిచారు. మాతృమూర్తి భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబీకులు ఆయనకు తోడుగా అడుగులేశారు. అభిమానగణంలో మరింత స్ఫూర్తినింపారు. వారిని చూసేందుకు వచ్చిన ప్రజలతో వీధులు కిక్కిరిశాయి. కొద్ది నిమిషాలపాటు ట్రాఫిక్‌ నిలిచింది. పాదయాత్రకు ప్రత్యేకమైన రోజు అయినందున మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు. ‘యువగళం’ విశేషాలతో తెదేపా నేత కేశినేని శివనాథ్‌ (చిన్ని) తీసుకొచ్చిన ప్రత్యేక సంచిక ‘జన హృదయమై నారా లోకేశ్‌’ను బోయరేవుల క్యాంపు సైట్‌ వద్ద లోకేశ్‌ అవిష్కరించారు. యాత్రలో భాగంగా సంతజూటూరులో ‘చెంచులతో ముఖాముఖి’లో పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే ఐటీడీఏలను ప్రక్షాళన చేస్తామని, దామాషా ప్రకారం నిధులు కేటాయించి గిరిజనులు, చెంచుల అభివృద్ధికి కృషి చేస్తామని లోకేశ్‌ హామీనిచ్చారు.

‘గిరిజనుల అభివృద్ధికి తెదేపా రూ.15వేల కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ప్రభుత్వం చెంచుల నిధులనూ కొట్టేసింది. చెంచులకున్న ప్రత్యేక అటవీ హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. తెదేపా అధికారంలోకి రాగానే ఐటీడీఏల నిధులతో వారి సంక్షేమ కార్యక్రమాలను చేపడతాం. మొదటి ఏడాదిలోనే చెంచు కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎకోటూరిజం అభివృద్ధి చేస్తాం. వ్యవసాయ భూములకు నీరందేలా సౌర మోటార్లు ఏర్పాటుచేస్తాం. చెంచులకు బ్యాంకు రుణాలు ఇప్పించి స్వయంఉపాధికి అండగా నిలుస్తాం. గిరిజనుల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అవుట్‌లెట్లను ఏర్పాటుచేస్తాం’ అని పేర్కొన్నారు. అరకు పరిసర గిరిజనులకు ప్రయోజనకరంగా ఉండేలా అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. పాదయాత్రలో మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, భూమా అఖిలప్రియ, పీతల సుజాత, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రయాదవ్‌, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోకేశ్‌ వెంట నారా, నందమూరి కుటుంబాలవారు ఉత్సాహంగా నడిచారు. ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల ఉత్సాహం

యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో తెదేపా సంఘీభావ పాదయాత్రకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఆ దేవుడు కూడా కాపాడలేడని జగన్‌మోహన్‌రెడ్డికి కర్ణాటకలో భాజపాకు ఎదురైన పరిస్థితే వస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. విజయనగరంలోని కోట కూడలి వద్ద తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. జైలుకెళ్లిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ అక్కడికే పంపించాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో తెదేపా పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైకాపా నేతలు కొందరు తెదేపా కార్యకర్తల నుంచి జెండాలు లాక్కుని తిరిగి వారిపై రాళ్లదాడికి దిగారు.


మీ కుటుంబాలకు ఏమిచ్చినా రుణం తీరదు: భువనేశ్వరి

కుటుంబాలను వదిలిపెట్టి వచ్చి పాదయాత్రలో లోకేశ్‌కు అండగా నిలిచిన వాలంటీర్లకు, వారి కుటుంబసభ్యులకు ఏమిచ్చినా రుణం తీరదని భువనేశ్వరి పేర్కొన్నారు. ‘ఒక్క అడుగు వేయడమే మాకు చాలా కష్టంగా అనిపించింది. వాలంటీర్లు వంద రోజులుగా పాదయాత్రలో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. లోకేశ్‌కు మంచి విజన్‌ ఉంది. అలాంటి వ్యక్తికి మీలాంటి గొప్ప వాలంటీర్ల బృందం దొరికింది. మరో మూడొందలు రోజులు కష్టపడదాం. మీ సేవలు ఇలాగే కొనసాగించండి. మీతో మేముంటాం’ అని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వాలంటీర్లు అందరికీ ఆమె స్వయంగా భోజనాలు వడ్డించారు.


యువగళంతో లోకేశ్‌ ప్రజలకు దగ్గరయ్యారు: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: లోకేశ్‌ యువగళం పాదయాత్ర సోమవారంతో వంద రోజుల మైలురాయిని చేరుకున్నందున తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ వంద రోజుల పాదయాత్రలో రోడ్డుపై లోకేశ్‌ గడిపిన సమయం ప్రజా సమస్యలు దగ్గర నుంచి చూడటానికి కచ్చితంగా ఉపయోగపడింది. లోకేశ్‌ను ప్రజలకు దగ్గర చేసింది. ఇంకా చాలా మైళ్లు ముందుకు సాగాలి’ అని చంద్రబాబు ట్విటర్‌ వేదికగా ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని