CM Kcr: చాలా చేశాం.. ప్రజలకు చెబుదాం

దేశంలో ఎవరూ చేపట్టనంతగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో అమలు చేశామని, ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.

Updated : 18 May 2023 07:45 IST

మనం సాధించినవి అసాధారణ విజయాలు
వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు ఖాయం
తెలంగాణ వజ్రపు తునక.. ఏపీ పరిస్థితేంటి?
ఘనంగా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు  
ఎమ్మెల్యేలు అన్ని స్థాయుల వారినీ కలుపుకొనిపోవాలి
భారాస విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

జూన్‌ 2 నుంచి జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను దద్దరిల్లేలా పండుగ వాతావరణంలో చేయాలి. ఏదో మొక్కుబడిగా కొబ్బరికాయలు కొట్టి, నిర్లిప్తంగా నిర్వహించవద్దు. పార్టీ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో నిమగ్నమై పనిచేయాలి.

సీఎం కేసీఆర్‌

దేశంలో ఎవరూ చేపట్టనంతగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో అమలు చేశామని, ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘తెలంగాణ మోడల్‌ గురించి దేశమంతా చర్చించుకుంటున్నారు. మీరు నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోకపోతే ఎలా?’ అని ఎమ్మెల్యేలనుద్దేశించి సీఎం అన్నారు. ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా.. మనం అధికారంలోకి రావడం ఖాయం. 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నాం. అయినా భారీ మెజారిటీతో గెలవాలంటే.. ఎవరెవరు బలహీనంగా ఉన్నారో ఆత్మపరిశీలన చేసుకోండి’ అని సీఎం సూచించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం భారాస పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి పల్లెకూ, ప్రతి మనిషికీ తెలియజెప్పాలని స్పష్టం చేశారు. కొందరు మంత్రులు తమ జిల్లాల్లో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, జడ్పీ ఛైర్మన్లను కలుపుకొని పోవడం లేదని అన్నారు. వారంలోగా అందరినీ పిలిచి సమావేశాలు నిర్వహించాలని, విభేదాలను పక్కనబెట్టి అన్ని స్థాయుల వారినీ కలుపుకొని పనిచేయాలని సూచించారు. మీ అంతట మీరు చెడగొట్టుకుంటే తప్ప.. ఏ ఎమ్మెల్యేను మార్చే ఉద్దేశం లేదని కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఎన్నో అద్భుతాలు చేశాం..

‘తెలంగాణ ఏర్పడితే నీళ్లుండవు.. కరెంటుండదన్నారు. మనకు పాలన చేతకాదన్నారు. రాష్ట్రం ఆగమైపోతుందన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ వజ్రపు తునకగా మారింది. మరి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటి? ఉద్యమ సమయంలోనే చెప్పా.. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని. నూటికి నూరుపాళ్లు ధనిక రాష్ట్రంగా అవతరించాం. మనం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, భారీగా ఆయకట్టుకు సాగునీటి వసతి, భూగర్భజలాల వృద్ధి, మిషన్‌ భగీరథ.. ఇలా దేశంలోనే ఎవరూ అందుకోలేనన్ని అసాధారణ విజయాలు సాధించాం. రాష్ట్రంలోని 30 లక్షల బోర్లకు సమృద్ధిగా నీరుంది. 21 వైద్య కళాశాలలు ఇప్పటికే తెచ్చాం. చిన్న విషయమా ఇది? నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రెసిడెన్షియల్‌ కాలేజీ కోసం వందలసార్లు తిరిగినా ఫలితం లేకపోయేది. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా 1001 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇది మన ఘనత. దీన్ని చెప్పుకోవాలి కదా. మైనింగ్‌లో ఎంతో ఆదాయం పెంచాం.. సింగరేణి టర్నోవర్‌ను రూ.15 వేల కోట్ల నుంచి రూ.34 వేల కోట్లకు వృద్ధి చేశాం. ఇది ఆషామాషీగా జరిగిందా? రాష్ట్రంలో 3400 గిరిజన తండాలు, గోండుగూడేలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం.

రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కోరినా పెట్టలేదు. ప్రభుత్వానికి రూ.25 వేల కోట్ల నష్టం వచ్చినా రైతుల కోసం నిలబడ్డాం. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్రం పట్టించుకోకపోయినా మనం ఆగలేదు. రెండు మూడు వేల కోట్ల రూపాయల భారమైనా రైతులను ఆదుకుంటామని ప్రకటించాం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం. కల్తీ విత్తనాల విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ప్రజలకు చాలా స్పష్టంగా తెలియజేయాలి. కల్తీలకు పాల్పడితే పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నాం. ఇది రైతులపై మనకున్న నిబద్ధత. వెయ్యి గొంతుకలతో మనం చేసిన పనిని చెప్పుకోవాలి. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. వీటిని విస్తృతంగా జనానికి వివరించాలి. నిర్లిప్తత పనికి కాదు. పారదర్శకంగా, అవినీతి రహితంగా జరుగుతున్న పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు కూడా మీ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి.. ఒకరోజు భోజనం పెట్టి.. మనం చేసినవి జనానికి వివరించేలా ప్రణాళిక వేసుకోవాలి. చెరువుల మీద పండగలు, రైతు వేదికల వద్ద ఉత్సవాలు ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు చేయొచ్చు. మనకు బాసులు, భగవద్గీత, వేదాలు.. అన్నీ తెలంగాణ ప్రజలే.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే సీట్లు

దాదాపుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తాం. మళ్లీ మనదే అధికారమని సర్వేలన్నీ చెబుతున్నాయి. నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలంతా పనిచేస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరికీ 50 వేల కన్నా అధిక మెజారిటీ వస్తుంది. గత తొమ్మిదేళ్లలో మనం అద్భుతమైన ప్రగతిని సాధించాం కాబట్టే తెలంగాణ మోడల్‌ను దేశం కోరుకుంటోంది. సూర్యాపేటలోనో.. కామారెడ్డిలోనో సభలు పెట్టుకుంటే మన ప్రజలు వేలాదిగా రావడం సహజం. కానీ మహారాష్ట్రలోనూ అదే తరహాలో ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే.. దానికి బలమైన కారణం మనం ఆచరించి చూపిన మోడల్‌. దీన్ని మనం బాగా చెప్పుకోవాలి. కులం, మతం మీద ఏ పార్టీ గెలవదు. అన్ని వర్గాలనూ సమాన దృష్టితో చూస్తున్నాం. అదే మన విజయ రహస్యం. అంశాల ప్రాతిపదికన ముందుకు పోవాలి. చిల్లరమల్లర విషయాల మీద కాదు.

చరిత్ర, విజయగాథలపై విస్తృత ప్రచారం

కనీవినీ ఎరుగని రీతిలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి. అందుబాటులో ఉన్న అన్ని ప్రచార మాధ్యమాల్లో మన చరిత్ర.. విజయగాథలను డాక్యుమెంటరీల రూపంలో ప్రదర్శించాలి. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి లెక్కలు తీయండి. ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, గోరటి వెంకన్న సేవలను విరివిగా వాడుకోవాలి. మంచి కార్యక్రమాలు పెట్టి వీరిని ఆహ్వానించండి. రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ఆద్యుడు పీవీ. ఆయన గురువు నూకల రాంచంద్రారెడ్డి గురించి కూడా చెప్పుకోవాలి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ప్రాంతంలో ఉన్న వైతాళికులను గుర్తించాలి. గౌరవించాలి. భాగ్యరెడ్డివర్మ, బద్దం ఎల్లారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, సురవరం ప్రతాపరెడ్డి ఇలా మహామహులను గుర్తించి వారిని కీర్తించాలి. కవి సమ్మేళనాలు నిర్వహించాలి. వీటికి ఎమ్మెల్యేలు నాయకత్వం వహించాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. తన నియోజకవర్గంలో కార్మిక మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను చేస్తే బాగుంటుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ తెలపగా.. సీఎం అభినందించారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఏయే కార్యక్రమాలు చేపట్టాలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ వివరిస్తూ.. దశాబ్దంలోనే శతాబ్దిలో చేయాల్సినంత పని చేశామని అన్నారు.


కర్ణాటక అంశం పెద్ద విషయం కాదు..
మోదీ దేశాన్ని మోసం చేశారు

పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఇసుక మైనింగ్‌ ద్వారా తెలంగాణలో కేవలం రూ.36 కోట్లు వస్తే.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత  అయిదేళ్లలోనే రూ.5600 కోట్ల ఆదాయం వచ్చింది. దేశానికి ద్రోహం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే. 70 ఏళ్లలో ఆ పార్టీ చేసిందేమీ లేదు. వాళ్లను ప్రజలు నమ్మరు. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదు. నెహ్రూ జమానాలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి కొంతలో కొంత చేశారు. ఆ తర్వాత ఎవరూ ప్రణాళికాబద్ధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించలేదు. గుజరాత్‌ మోడల్‌ బోగస్‌. మోదీ భారతదేశాన్ని మోసం చేశారు.

సీఎం కేసీఆర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు