అవినాష్‌రెడ్డి విషయంలో సీబీఐ పదేపదే ఎందుకు భంగపడుతోంది?

వివేకా హత్య కేసుకు సంబంధించి వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ పదేపదే ఎందుకు భంగపడుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

Published : 20 May 2023 05:00 IST

దీని వెనకున్న అదృశ్య శక్తి ఎవరు?
సీఐడీలా సీబీఐ తయారైందా?
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వివేకా హత్య కేసుకు సంబంధించి వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ పదేపదే ఎందుకు భంగపడుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. అనేక కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఫలితాలు చూపిన సంస్థతో.. నేడు జగన్‌రెడ్డి తమ్ముడు చెడుగుడు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు అవినాష్‌రెడ్డికి అంత శక్తి రావడానికి కారణమైన అదృశ్య శక్తి ఎవరని నిలదీశారు. ఏపీ సీఐడీలా సీబీఐ తయారైందా? అనే అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వివేకా హత్య కేసులో సీబీఐ తన ప్రాబల్యాన్ని, గౌరవాన్ని, ఔచిత్యాన్ని పోగొట్టుకుంటోంది. చివరకు స్థానిక పోలీసులను చూసి భయపడే పరిస్థితికి కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చింది. పులివెందులలో సీబీఐ అధికారుల కార్లు నడపడానికి డ్రైవర్లు, గదులు శుభ్రం చేయడానికి సిబ్బంది దొరక్కుండా చేస్తున్నారు. ఎన్ని చేసినా అవినాష్‌రెడ్డిలాంటి వారు కాలర్‌ ఎత్తుకొని తిరగగలరు. కానీ సామాన్యుడికి రాష్ట్రంలో రక్షణ లేదు. సీబీఐ వద్ద ఆయనకున్న వెసులుబాటు సామాన్యులకు లేదా? ఆయనకో న్యాయం.. సామాన్యుడికొకటా?’ అని వర్ల రామయ్య మండిపడ్డారు.

మీడియాపై దాడి చేసేవారిపై ఏ కేసులు పెడతారు?

‘చీటికిమాటికి తెదేపా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టే పోలీసులు.. మీడియాపై దాడి చేసిన అవినాష్‌రెడ్డి అనుచరులపై ఏ కేసు పెడతారు? ప్రణాళిక ప్రకారం పాత్రికేయులను కొట్టాలని, తర్వాత చంపాలని చూశారు. ఎంపీ అనుచరులు వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారు’ అని వర్ల రామయ్య మండిపడ్డారు. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అజేయకల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులతో జగన్‌ నిర్వహించిన మేనిఫెస్టో సమావేశం కేసులో ‘ఎలిబీ’గా చూపించడానికేనని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు