Nara Lokesh: వైకాపా పాపాలు పండాయి.. అందుకే సీబీఐ వెంటాడుతోంది

‘అప్పుడు బాబాయ్‌కు గుండెపోటు అన్నారు.. ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు.  ఆమె జాగ్రత్తగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 21 May 2023 06:26 IST

‘యువగళం’ సభలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజం

ఈనాడు, కర్నూలు: ‘అప్పుడు బాబాయ్‌కు గుండెపోటు అన్నారు.. ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు.  ఆమె జాగ్రత్తగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఏ తప్పూ చేయకపోతే విచారణకు వెళ్లకుండా ఎందుకు పారిపోతారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌, జగన్‌ దంపతులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సీబీఐ వాళ్లు ప్రేమలేఖ పంపిస్తే జగన్‌ దిల్లీ వెళతారని, అవినాష్‌రెడ్డి పారిపోతారని ఎద్దేవా చేశారు. బాబాయ్‌ హత్య సమయంలో ఉన్న ధైర్యం ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు. జీవితం అంతా పాపాలు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే దేవుడు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. పాపాలు పండాయని, అందుకే సీబీఐ వెంటాడుతోందని అన్నారు. యువగళం పాదయాత్ర 104వ రోజు శనివారం నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో సాగింది. బనగానపల్లెలో నిర్వహించిన సభకు భారీగా జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడారు.

‘యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి సైకో సైన్యాన్ని పంపిస్తున్నారు. పాదయాత్రకు ఎవరైనా అడ్డొస్తే సినిమా చూపిస్తాం’ అని హెచ్చరించారు. బాబు హయాంలో నీళ్లుంటే, జగన్‌ హయాంలో కన్నీరు మిగిలిందని అన్నారు. జగన్‌ తాను పేదవాడినని అంటున్నారని, తనకున్న రూ.లక్ష కోట్ల ఆస్తిలో రూ.90వేల కోట్లు రాసిస్తే పేదవాడని ఒప్పుకొంటానని అన్నారు. జగన్‌కు బిల్డప్‌ ఎక్కువ.. బిజినెస్‌ తక్కువని, అందుకే ఆయనకు బిల్డప్‌ బాబాయ్‌ అని పేరు పెడుతున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు, వైద్యులకు దిక్కులేని పరిస్థితి ఉంటే, గడపగడపకు వైద్యుడిని పంపిస్తానని అంటున్నారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారన్నారు. సెంటు స్థలాలిచ్చి అందులో ఇళ్లు కట్టిస్తానన్న వ్యక్తి.. ఇప్పుడు ఇల్లు కట్టుకోకపోతే స్థలాన్ని రద్దు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ప్రతిదాంట్లో కమీషన్‌ ఇవ్వాల్సిందేనని లోకేశ్‌ ఆరోపించారు. సభలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.సి.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని