కేసీఆర్‌ రైతుబంధు కంటే కేంద్రం ఎరువుల రాయితీనే ఎక్కువ

రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకపోవడంతో, అకాల వర్షాల సమయంలో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 22 May 2023 04:03 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకపోవడంతో, అకాల వర్షాల సమయంలో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగాన్ని, వేగంగా ధాన్యం కొనుగోలు బాధ్యతల్ని సీఎం కేసీఆర్‌ విస్మరించి, మహారాష్ట్రలో బ్రాంచ్‌ పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు ఇస్తోంది ఏటా రూ.10 వేలు కాగా.. కేంద్రం ప్రతి ఎకరాకు ఎరువుల రాయితీ రూపంలో రూ.18,248 ఇస్తోందని చెప్పారు. ఏడాదికి రెండు పంటలకు 4 యూరియా బస్తాలపై రూ.8,568, 4 డీఏపీ బస్తాలపై రూ.9,680 రాయితీ ఇస్తోందని వెల్లడించారు. దీంతో కౌలు రైతులకూ లాభం కలుగుతోందన్నారు. మోదీ ప్రభుత్వం నిజంగా వ్యవసాయం చేసేవారిని ఆదుకుంటుండగా.. కేసీఆర్‌ మాత్రం కొండలు, గుట్టలకు, ఆదాయపు పన్ను కట్టేవారికీ రైతుబంధు ఇస్తున్నారని విమర్శించారు. రైతులకు ఉచితంగా ఎరువులిస్తామన్న హామీని ఎప్పుడు అమలుచేస్తారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం బియ్యం కొనట్లేదని దిల్లీ వచ్చి రాష్ట్ర మంత్రులు ధర్నా చేశారని, కానీ 2021-22కి సంబంధించిన బియ్యాన్నే ఇప్పటికీ కేంద్రానికి అప్పగించలేదని కిషన్‌రెడ్డి చెప్పారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందనే సామెతలా కేసీఆర్‌ తనను దేశ్‌ కీ నేత అని చెప్పుకొంటున్నారని వ్యాఖ్యానించారు. జూన్‌ 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జీ-20 వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని