బందరు పోర్టు నిర్మాణంలో సీఎంకి భారీగా కమీషన్‌: దేవినేని ఉమా

బందరు పోర్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భారీగా కమీషన్‌ ముడుతోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 22 May 2023 06:52 IST

మైలవరం, న్యూస్‌టుడే: బందరు పోర్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భారీగా కమీషన్‌ ముడుతోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇందుకోసం తమ ప్రభుత్వ హయాంలో రూపొందించిన వాస్తవ డీపీఆర్‌కు విరుద్ధంగా పనుల్లో కోతలు విధించారన్నారు. ఆదివారం ఆయన మైలవరంలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ. ‘వాస్తవ డీపీఆర్‌ మేరకు 2.35 కి.మీ.వరకు చేయాల్సిన పనులను 1.05 కి.మీ.కు కుదించారు. 60వేల మెట్రిక్‌ క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలను 40 వేలకే తగ్గించారు. పైగా తమ ప్రభుత్వ హయాంలో బూట్‌ పద్ధతిలో పనులు అప్పగిస్తే... వైకాపా ప్రభుత్వం ఈపీసీ విధానం పేరిట పోర్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. నిర్మాణానికి కనీసం 24 నెలల సమయం పడుతుంది. ఈపీసీ విధానంతో ఒక విశ్రాంత ఉద్యాన జేడీని నియమించి పర్యవేక్షణ చేయాలనుకోవడం ప్రాజెక్టును ఇబ్బంది పెట్టడమే.

కంటైనర్‌ పోర్టు కాస్త సాధారణ పోర్టుగా మారితే... భారీ ఓడలు వచ్చే పరిస్థితి ఉండదు. పోలవరం, అమరావతిని అటకెక్కించనట్లే... కమీషన్‌ దండుకున్నాక బందరు పోర్టుదీ అదే పరిస్థితి అవుతుంది....’ అని దేవినేని ఉమా పేర్కొన్నారు. శంకుస్థాపనకు వస్తున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టులో వాస్తవాలను ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. మైలవరంలో జరిగిన యువగళం పాదయాత్రలో తమ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన పోలీసులు, సెంటు స్థలంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా రోడ్డుపై ధర్నా చేసిన వైకాపా నాయకులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒక పోలీస్‌ అధికారి అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గంలో గృహాలను నిర్మించలేక సిమెంటును గడ్డ కట్టిస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు