ఓ హత్య కేసు నిందితుడిని అరెస్టు చేస్తే శాంతిభద్రతల సమస్యా?

సీఎం జగన్‌ అండదండలతోనే సీబీఐ అధికారులను బెదిరించే స్థాయికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

Published : 23 May 2023 04:29 IST

ఇలా చెప్పడం పోలీస్‌ వ్యవస్థకే సిగ్గుచేటు
ప్రభుత్వాన్ని ఏ1గా, డీజీపీని ఏ2గా, కర్నూలు ఎస్పీని ఏ3గా చేర్చి కేసు పెట్టాలి
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి : సీఎం జగన్‌ అండదండలతోనే సీబీఐ అధికారులను బెదిరించే స్థాయికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వివేకానందరెడ్డిని చంపిన వారిని కాపాడాలనే జగన్‌ లక్ష్యం నెరవేర్చడం కోసం పోలీసులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో మార్గదర్శకత్వంలోనే అవినాష్‌రెడ్డి అరెస్టు కాకుండా కర్నూలు ఎస్పీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, కర్నూలు ఎస్పీలను ఏ1, ఏ2, ఏ3లుగా చేర్చి సీబీఐ కేసు నమోదు చేయాలని వర్ల డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం జగన్‌కు ఇష్టం లేదు. అందుకే నిందితుల అరెస్టును అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పులివెందుల రౌడీలను కట్టడి చేయలేమని, శాంతిభద్రతల సమస్య వస్తుందని కర్నూలు ఎస్పీ చెప్పడం పోలీస్‌ వ్యవస్థకే సిగ్గుచేటు. గతంలో తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులను అర్ధరాత్రులు గోడలు దూకి దుర్మార్గంగా అరెస్టు చేశారు. అప్పుడు చూపిన శ్రద్ధా, ఉత్సాహం సీబీఐ అధికారులకు సహకరించడంలో ఎందుకు చూపడం లేదు...’’ అని వర్ల రామయ్య నిలదీశారు. ఈ విషయంలో కేంద్రం, గవర్నర్‌ జోక్యం చేసుకొని రాష్ట్ర పోలీసు వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


కర్నూలు ఎస్పీ తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాల్ని పాటిస్తున్నారు

- తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు

వివేకానందను హత్య చేసిన వారిని పోలీసులే కాపాడుతున్నట్లుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ‘‘అవినాష్‌రెడ్డి అరెస్టుకు కర్నూలు ఎస్పీ సహకరించడం లేదు. ఆయన తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలు పాటిస్తున్నారు. కిరాయిమూకల ఆధీనంలో కర్నూలు ఆసుపత్రి ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు. దీనిపై డీజీపీ, డీఐజీలు కలగజేసుకోవాలి. అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యమే నిజమైతే ఆమెను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలి...’’ అని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

సీఐడీ గోడలు దూకొచ్చు.. సీబీఐ మాత్రం అనుమతి అడగాలా?: చింతకాయల విజయ్‌

హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు తలెత్తుతాయా? దీన్ని పరిష్కరించడం ఈ సీఎం, పోలీసుల వల్ల కాదా? అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ నిలదీశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో నన్ను అరెస్టు చేయడానికి సీఐడీ అత్యుత్సాహంతో వ్యవహరించింది. నేను లేని సమయంలో నా ఇంటికొచ్చి నా అయిదేళ్ల కుమార్తెను విచారించి భయభ్రాంతులకు గురిచేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని ఇంటి గోడలు దూకి మరీ ఎలా అరెస్టు చేశారు? మాజీ మంత్రులు నారాయణ, రవీంద్రలను అరెస్టు చేసినప్పుడు పోలీసులు కుంటిసాకులు చెప్పలేదే? ఇప్పుడు సీబీఐ మాత్రం అనుమతి అడగాలా? ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఒక న్యాయం, మీకో న్యాయమా? అవినాష్‌రెడ్డిని కాపాడటానికి జగన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు...’’ అని విజయ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని