అప్పు కోసమే బందర్‌ పోర్టుకు ఉత్తుత్తి శంకుస్థాపన

కమీషన్ల కక్కుర్తి, భూములు కొట్టేయడానికే బందరు పోర్టుకు సీఎం జగన్‌  ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Published : 23 May 2023 05:10 IST

 అనుభవం లేని ‘మేఘా’ సంస్థకు పనులు
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి : కమీషన్ల కక్కుర్తి, భూములు కొట్టేయడానికే బందరు పోర్టుకు సీఎం జగన్‌  ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గతంలో ఫిషింగ్‌ హార్బర్‌కు ఎక్కువ... పోర్టుకు తక్కువ అని విమర్శించిన జగన్‌... నేడు పవర్‌ పర్చేజ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకోవడానికే ఈ ఉత్తుత్తి శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. పోర్టులు నిర్మించిన అనుభవం ఏ మాత్రం లేని ‘మేఘా’ సంస్థకు పనులు కట్టబెట్టడమేంటని నిలదీశారు.  సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘తెదేపా ప్రభుత్వ హయాంలో పాత గుత్తేదారును కొనసాగిస్తూ.. డీపీఆర్‌ తయారు చేయించి, పర్యావరణ అనుమతులు సాధించారు. ఎకరాకు రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించి రైతుల నుంచి భూములు సేకరించారు. బీవోటీ (బిల్డ్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌) విధానంలో ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా పనులు ప్రారంభించారు. జగన్‌ సీఎం అయ్యాక బీవోటీ విధానాన్ని రద్దు చేసి... పోర్టు నిర్మాణాన్ని నిలిపి వేయించారు. పదవుల కక్కుర్తితో ఎమ్మెల్యే పేర్ని నాని పోర్టును తన స్వార్థానికి వాడుకున్నారు. వీరంతా కలిసి ఇప్పుడు పోర్టు కడతారా?’’ అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ‘‘ పోర్టులోకి నౌకలు రావాలంటే తక్కువలో తక్కువగా 15, 16 మీటర్ల లోతు తవ్వాలి. ఒక మీటర్‌కి 800 మీటర్లు డ్రెడ్జింగ్‌ చేయాలి. గతంలో బ్రేక్‌ వాటర్‌ విస్తీర్ణం 2.5 కి.మీ ఉంటే... నేడు దాన్ని కేవలం 1.05 కి.మీ పరిమితం చేశారు. దానిలోకి పెద్దపెద్ద నౌకలు వస్తాయా? డీపీఆర్‌ బయటపెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి...’’ అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని