ఎన్నికల ఎత్తుల్లో భాగంగానే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

తెదేపా ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగిన పోర్టులు, విమానాశ్రయాలకు... సీఎం జగన్‌ మళ్లీ శంకుస్థాపనలు చేయడం ఎన్నికల ఎత్తుల్లో భాగమేనని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ధ్వజమెత్తారు.

Updated : 23 May 2023 05:13 IST

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : తెదేపా ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగిన పోర్టులు, విమానాశ్రయాలకు... సీఎం జగన్‌ మళ్లీ శంకుస్థాపనలు చేయడం ఎన్నికల ఎత్తుల్లో భాగమేనని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ధ్వజమెత్తారు. సీఎం వేస్తున్నవి శంకుస్థాపన రాళ్లు కాదని... ఈ ప్రభుత్వానికి సమాధి రాళ్లని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అమరావతిని ఎడారి, శ్మశానం, గ్రాఫిక్స్‌ అన్న జగన్‌రెడ్డి.. ఇప్పుడు అక్కడే ఇళ్ల పట్టాలివ్వడం పేదల్ని వంచించడమేనని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘బందరు, భావనపాడు పోర్టులు, కడప ఉక్కు కర్మాగారం, భోగాపురం విమానాశ్రయాలకు చంద్రబాబు భూసేకరణ చేశారు. పాలనాపరమైన అనుమతులు ఇచ్చి.. నిర్మాణాలు కూడా ప్రారంభించారు. నాలుగేళ్లు వాటిని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా వైకాపా ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపింది...’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్‌.. నేడు బీద అరుపులు అరుస్తున్నారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు రూ.వేల కోట్లు, నేడు తాను సీఎంగా రూ.లక్షల కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి పేదవారా? బెంగళూరు, హైదరాబాద్‌, పులివెందుల, ఇడుపులపాయ, తాడేపల్లి భవనాలు, భారతి సిమెంట్స్‌, సండూర్‌, సరస్వతి పవర్‌ సంస్థలు, సాక్షి పత్రిక, ఛానల్‌లు ఎవరివో ఆయనే చెప్పాలి?...’’ అని కూన రవికుమార్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని