ప్రధానిది దురహంకారం
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించకపోవడంపై తలెత్తిన దుమారం మరింత ముదురుతోంది.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభానికి రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడంపై విపక్షాల ధ్వజం
వేడుకకు 20 పార్టీలు దూరం
దిల్లీ: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించకపోవడంపై తలెత్తిన దుమారం మరింత ముదురుతోంది. ప్రధాని దురహంకారంతో వ్యవహరిస్తున్నారని, పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు గురువారం నాటికి 20 పార్టీలు ప్రకటించాయి.
పార్లమెంటు దేవాలయం: ఖర్గే
మోదీ తన దురహంకారంతో పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ‘మోదీజీ.. పార్లమెంటు అనేది ప్రజలు నిర్మించుకున్న ప్రజాస్వామ్య దేవాలయం. రాష్ట్రపతి అందులో భాగమే. అలాంటి రాష్ట్రపతిని పిలవకుండా ఏం చెప్పదలుచుకున్నారని 140 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు’ అని హిందీలో చేసిన ట్వీట్‌లో ఖర్గే ప్రశ్నించారు.
* నిరంకుశాధికారంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వమే కొత్త భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడానికి కారణమని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ విమర్శించారు.
* ‘భారత్ రిపబ్లిక్‌కే కాకుండా పార్లమెంటుకూ రాష్ట్రపతి అధిపతే. కార్యనిర్వాహక వ్యవస్థకే ప్రధాని అధినేత. అలాంటిది ప్రధాని పార్లమెంటు భవనాన్ని ఎలా ప్రారంభిస్తారు’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు.
* సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని తీరును తప్పుబట్టారు.
ప్రధాని సమాధానమివ్వాలి: కేజ్రీవాల్
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతితో ఎందుకు చేయించడం లేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు.
పునరాలోచించాలి: నిర్మలా సీతారామన్
చెన్నై: ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడంపై పునరాలోచించాలని ప్రతిపక్షాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ భవనానికి సోనియా గాంధీ శంకుస్థాపన చేయడాన్ని ఆమె గుర్తు చేశారు. ఒకప్పుడు గిరిజన రాష్ట్రపతిని రబ్బర్ స్టాంపు అని అవమానించినవారే ఇప్పుడు ఆమెను వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు. గురువారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్మలా సీతారామన్ విలేకరులతో మాట్లాడారు. ఆమె వెంట తమిళనాడు, తెలంగాణ, నాగాలాండ్ గవర్నర్లు ఆర్‌ఎన్ రవి, తమిళిసై, లా గణేశన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తదితరులున్నారు. రాష్ట్రపతికి ప్రధాని సముచిత గౌరవం ఇస్తున్నారని ఆమె తెలిపారు.
నాటి రాజదండం కాదు
చెన్నై, న్యూస్‌టుడే: పార్లమెంట్ కొత్త భవనంలో ఎలాంటి మత గుర్తులు లేకుండా సంప్రదాయబద్ధంగా రాజదండాన్ని (సెంగోల్) ప్రతిష్ఠించనున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నెహ్రూ ప్రధానిగా అందుకున్న రాజదండాన్ని పార్లమెంట్‌లో ప్రతిష్ఠించడం లేదన్నారు. అది మ్యూజియంలో ఉందని, వేరొక సెంగోల్‌ను ప్రతిష్ఠించనున్నారని తెలిపారు. ఆ వేడుకకు తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనానికి చెందిన స్వామీజీలూ హాజరుకానున్నారన్నారు.
* ప్రతి దానినీ తమకు అనుకూలంగా రాజకీయం చేయడం కొన్ని పార్టీలకు అలవాటైందని తెలంగాణ గవర్నర్ తమిళిసై విమర్శించారు. ‘తెలంగాణ సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కొన్ని పార్టీలకు రాజకీయాల్లో ఆటలాడటం ఎలాగో తెలుసు. గవర్నర్, ముఖ్యమంత్రి పదవులను వారికి అనుకూలంగా అన్వయించుకుంటారు’ అని ఆమె ధ్వజమెత్తారు.
* ప్రతిపక్షాల నిర్ణయాన్ని ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్రభాయ్ పటేల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తప్పుబట్టారు.
* నెహ్రూకు ఇచ్చిన చారిత్రక రాజదండాన్ని కాంగ్రెస్ ఒక బంగారు కడ్డీ అని వ్యాఖ్యానించడాన్ని భాజపా తప్పుబట్టింది. అది బ్రిటిషర్ల నుంచి అధికారాన్ని బదలాయిస్తూ ఇచ్చిన అధికార దండమని భాజపా ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ స్పష్టం చేశారు.
ఆదివాసీ కాంగ్రెస్ అభ్యంతరం
పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించకపోవడాన్ని అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ తప్పుబట్టింది. గిరిజనులను మోదీ ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపించింది.
సుప్రీంకోర్టులో పిల్
ఈనాడు, దిల్లీ: కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేత ప్రారంభించేలా లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రధాని మోదీ ఈనెల 28న కొత్త భవనాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో సీఆర్ జయ సుకిన్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. నూతన భవన ప్రారంభోత్సవానికి లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆహ్వానాలు పంపడం, ఇందుకు సంబంధించి మే 18న లోక్‌సభ సచివాలయం ప్రకటన జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఇందులో పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం.. రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. అందువల్ల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమెను దూరంగా ఉంచడానికి వీల్లేదు’ అని పిటిషనరు పేర్కొన్నారు.
హాజరు కానున్న తెదేపా
ఈనాడు, దిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని తెదేపా నిర్ణయించింది. ఆ రోజు మహానాడు ఉన్నందున ఎంపీలంతా అందులో ఉంటారని, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరిని పార్లమెంటు భవన ప్రారంభానికి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఏపీలోని రెండు ప్రధాన పార్టీలూ హాజరవుతున్నట్లయింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న ప్రతిపక్షాల చర్యను తప్పుబట్టారు. అదే సమయంలో ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం పార్టీ సమీక్షా సమావేశాలు ఉన్నందున హాజరు కాలేకపోతున్నట్లు ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించింది. పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరు కావాలని జనతాదళ్(ఎస్) నిర్ణయించింది. పార్లమెంటు ప్రజల ఆస్తి అని తాను హాజరవుతానని మాజీ ప్రధాని దేవేగౌడ తెలిపారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి 25 పార్టీలు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎన్‌డీఏలోని 18 పార్టీలతోపాటు ఏడు ఇతర పార్టీలు హాజరుకానున్నాయి. అందులో బీఎస్‌పీ, శిరోమణి అకాలీదళ్, లోక్ జన్‌శక్తి పార్టీ, వైకాపా, బిజూ జనతాదళ్, తెదేపా, జనతాదళ్ (ఎస్) ఉన్నాయి. ఈ ఏడు పార్టీలకు 50 మంది వరకూ ఎంపీలున్నారు. ఇది భాజపాకు కొంత ఊరట కలిగించే అంశమే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?
-
India News
Population Census: లోక్‌సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!
-
Movies News
Telugu movies: చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
Ts-top-news News
Sangareddy: గడ్డపోతారంలో విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..