11 లక్షల ఎకరాలకు పోడు పట్టాలివ్వాల్సిందే

గిరిజనులకు జూన్‌ 24 నుంచి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని శుభపరిణామంగా సీపీఎం పేర్కొంది.

Published : 26 May 2023 04:17 IST

111 జీవోపై విపక్షాలతో చర్చించి పారదర్శకంగా ముందుకెళ్లాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజనులకు జూన్‌ 24 నుంచి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని శుభపరిణామంగా సీపీఎం పేర్కొంది. అయితే... ఎక్కడా అసంతృప్తి రాకుండా చూడాలని సూచించింది. రాష్ట్రంలో 11 లక్షల మందికి పోడు పట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌ ఎంబీభవన్‌లో గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర నేతలు హాజరయ్యారు. పోడు పట్టాలను 4లక్షల ఎకరాలకే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోందని, అదే నిజమైతే మిగిలిన గిరిజనుల్లో అసంతృప్తి పెరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సరిచేసుకుని 11 లక్షల మందికి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏల మంజూరు, కార్మికులకు కనీస వేతన సవరణ, పంచాయతీ కార్మికుల కష్టాలపై జూన్‌లో ఆందోళనలు చేపట్టాలని, ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్‌ని తమ పార్టీ నేతలు కలవాలని పార్టీ కార్యదర్శివర్గం తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం 111 జీవో రద్దు చేయడంపైనా సమావేశంలో చర్చించింది. ఈ జీవోపై విపక్షాలతో సమావేశం నిర్వహించాలని, మరింత పారదర్శకంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని