Bhanuprakash Reddy: ఏపీలో జగన్‌ రాజ్యాంగం.. వైసీపీ సెక్షన్లు: భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి

ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా జగన్‌ రాజ్యాంగం నడుస్తోందని, ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు.

Updated : 26 May 2023 07:48 IST

ఈనాడు, దిల్లీ: ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా జగన్‌ రాజ్యాంగం నడుస్తోందని, ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు కోసం వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకాపై గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన కథ తుది ఘట్టానికి చేరుకుందని వ్యాఖ్యానించారు. ఆ హత్య వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులందరినీ సీబీఐ బయటకు తీసుకొస్తుందన్నారు. హత్య కేసులో ఉన్న ఒకొక్కరినీ సీబీఐ అరెస్టు చేస్తోందని, అవినాష్‌రెడ్డి విషయం వచ్చే వరకు అంశం కోర్టు పరిధిలోకి వెళ్లిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానూ ఆయనకు సహకరించడం లేదని స్పష్టం చేశారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయనీయకుండా ఎమ్మెల్యేలు అడ్డుపడడం సరికాదన్నారు. ఏనాడూ ప్రజా సమస్యలపై చర్చించని ఎమ్మెల్యేలు అవినాష్‌రెడ్డి కోసం కర్నూలు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చర్యలను రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.

శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా.. అని ఇష్టానుసారం నడుచుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇండియన్‌ పోలీస్‌ సర్వీసును రాష్ట్రంలో కొందరు అధికారులు ఇండియన్‌ పొలిటికల్‌ సర్వీసుగా మార్చివేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అధికార పార్టీ నేతలు గడప గడపకు వెళ్లడం కాదు.. తమతో కలిసి వస్తే సమస్యలు చూపుతామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరదాల మాటున వెళ్లే ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కరేనని, ఆయన గాలిలోనే ప్రయాణాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన దానిపై భాజపా త్వరలో ఛార్జిషీట్ల రూపంలో జగన్‌మోహన్‌రెడ్డి ఫైల్స్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌ హాజరుకావడాన్ని స్వాగతిస్తామని.. రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వేర్వేరని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని