ఇళ్ల స్థలాల పంపిణీతో సామాజిక న్యాయం వద్దంటున్న చంద్రబాబు: మంత్రుల ఆగ్రహం

రాష్ట్ర రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీతో సామాజిక న్యాయం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.

Updated : 27 May 2023 06:43 IST

 

గుంటూరు (జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీతో సామాజిక న్యాయం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని వెంకటపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో అర్హులకు స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు వామపక్ష పార్టీలు వద్దంటున్నాయని విమర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తే పట్టాలు రద్దు చేస్తామంటున్నారని, ఆరు నూరైనా మళ్లీ జగనే సీఎం అవుతారన్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇళ్ల స్థలాల పంపిణీకి ఇచ్చిన ఉత్తర్వులే అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయసమస్యలు అధిగమించి పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. 2024లో మరోసారి జగన్‌ని సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రారంభోపాన్యాసం చేశారు. గుంటూరు, ఎన్‌టీఆర్‌ జిల్లాల్లోని 50,793 మందికి రాజధాని ప్రాంతంలో సెంటు స్థలాలు, రాజధాని ప్రాంతంలోని పేదలు 5,024 మందికి టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు.

ఎమ్మెల్యే నోట శాసన రాజధాని మాట

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతిని శాసన రాజధానిగా పేర్కొన్నారు. స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 32 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టగా రాజధాని ప్రాంతంలో ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తారా అని ఎదురుచూశారన్నారు. న్యాయసమస్యలు వీడి లబ్ధిదారులకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని పేర్కొని.. తర్వాత సర్దుకుని శాసన రాజధానిలో ఇచ్చారన్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి వచ్చే సంక్రాంతికి గృహప్రవేశాలు చేసేలా చూడాలని సీఎం జగన్‌ని కోరారు. ఓ ఛానల్‌ (ఈటీవీ కాదు) ఆర్‌-5 జోన్‌ ఆరిపోయే జోన్‌ అని ప్రసారం చేసిందని.. వచ్చే సంక్రాంతిని ఈ ఇళ్లలో చేసుకోవడం ద్వారా కాదని నిరూపించాలన్నారు.

* ఇద్దరు లబ్ధిదారులతో మాట్లాడించారు. తాడేపల్లికి చెందిన గొట్టిముక్కల హైమావతి మాట్లాడుతూ 23 ఏళ్లుగా ముగ్గురాయిలోని రైల్వేస్థలంలో తనతో పాటు 750 కుటుంబాల వాళ్లం నివాసం ఉంటున్నామన్నారు. పెళ్లయి 23 ఏళ్లయినా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడ్డామన్నారు. నవులూరులో తనకు కేటాయించిన స్థలాన్ని అధికారులు చూపడంతో చాలా సంతోషమేసిందన్నారు.

* విజయవాడలోని గుణదలకు చెందిన లక్ష్మి మాట్లాడుతూ తనకు పెళ్లయిన కొత్తలో తన అత్తగారి అమ్మ చనిపోతే ఇంటి యజమాని శవాన్ని ఇంటికి తీసుకురాకుండా అడ్డుకోవడంతో చాలా బాధేసిందన్నారు. తన భర్త హోటల్లో పనిచేస్తారని, ముగ్గురు కుమార్తెలతో అద్దె పెంచినపుడల్లా ఇళ్లు మారుతూ ఇబ్బందులు పడ్డామన్నారు. ఇన్నాళ్లకు ఇంటి స్థలం మంజూరు కావడంతో బాధలు తీరాయన్నారు.

స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి గైర్హాజరు

తాడికొండ నియోజకవర్గం పరిధిలోని వెంకటపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగినా.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలతో శ్రీదేవిని వైకాపా బహిష్కరించింది. పార్టీ ఇన్‌ఛార్జిగా కత్తెర సురేష్‌కుమార్‌ని వైకాపా ప్రకటించడంతో ఆయనే నియోజకవర్గంలో పార్టీ, అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేదికపైనా ఆయన ఆశీనులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని