మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం

రాజమహేంద్రవరం వేదికగా జరగబోయే మహానాడు నుంచి తెదేపా ఎన్నికల శంఖారావం పూరించనుంది. మరో ఏడాది లోపే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేయనుంది.

Published : 27 May 2023 04:36 IST

రాజమహేంద్రవరం వేదికగా పసుపు పండగకు ఏర్పాట్లు పూర్తి
నేడు ప్రతినిధుల సభ, రేపు బహిరంగ సభ
(వేమగిరిలోని మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి)

రాజమహేంద్రవరం వేదికగా జరగబోయే మహానాడు నుంచి తెదేపా ఎన్నికల శంఖారావం పూరించనుంది. మరో ఏడాది లోపే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేయనుంది. ప్రధాన ప్రతిపక్షంగా నాలుగేళ్లుగా వైకాపాపై చేస్తున్న పోరాటాలను సమీక్షించుకుని.. ఈ ఎన్నికల ఏడాదిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణను రూపొందించుకోనుంది. ప్రస్తుతమున్న దారుణ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటం ఎంతటి చారిత్రక అవసరమో ప్రజలకు వివరించనుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద శని, ఆదివారాల్లో పసుపు పండగకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎన్టీఆర్‌ శతజయంతి సంవత్సరం కావటం, తెదేపా స్థాపించి 41 ఏళ్లు పూర్తవ్వటంతో చరిత్రలో నిలిచిపోయేలా మహానాడుకు సర్వం సిద్ధం చేశారు.

నేడు 15వేల మందితో ప్రతినిధుల సభ

తొలిరోజైన శనివారం ప్రతినిధుల సభ కోసం 10 ఎకరాల్లో ప్రాంగణాలు, వేదికలు సిద్ధం చేశారు. 15వేల మంది పార్టీ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించారు. మరో 35వేల మంది కార్యకర్తలు వస్తారని అంచనా. ఎండ తగలకుండా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. కూలర్లు ఏర్పాటు చేశారు. దూరంగా కూర్చున్నవారికీ సభావేదిక కనిపించేలా 20 ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేశారు. ఆదివారం సాయంత్రం 15 లక్షలమందితో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు 60 ఎకరాల విస్తీర్ణంలో మరోచోట ఏర్పాట్లుచేశారు.

ఎన్టీఆర్‌, కాటన్‌, అల్లూరి సీతారామరాజు పేర్లు

చంద్రబాబు, లోకేశ్‌ సహా పార్టీ ముఖ్యనేతలు కూర్చునేందుకు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సభా వేదిక నిర్మించారు. ప్రతినిధులు, అతిథులు ఈ వేదికపైకి చేరేందుకు మూడు ప్రధానద్వారాలు ఏర్పాటుచేశారు. మొదటిద్వారం ఎన్టీఆర్‌ మార్గ్‌ గుండా ప్రతినిధులు లోపలికి వచ్చి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్టాళ్లవద్ద వివరాలు నమోదు చేసుకుంటారు. మధ్యలో కాటన్‌ మార్గం ద్వారా ఇతర ప్రతినిధుల రాకపోకలు ఉంటాయి. చంద్రబాబు, లోకేశ్‌ సహా ఇతర ముఖ్యనాయకుల కోసం అల్లూరి సీతారామరాజు మార్గ్‌ను సిద్ధం చేశారు.

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు

హాజరయ్యే ప్రతినిధుల వివరాలను ఈసారి డిజిటల్‌ విధానంలో నమోదుచేయనున్నారు. తెదేపా సభ్యత్వ కార్డులు, మహానాడు పాస్‌లు, ఆహ్వానపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌లు ముద్రించారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన శిబిరాల్లోకి ప్రతినిధులు వెళ్లి వారి సభ్యత్వ కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. వెంటనే సర్వర్‌లో ఆ ప్రతినిధి వివరాలు నమోదవుతాయి.

రేపు 15 లక్షల మందితో భారీ సభ

ఆదివారం సాయంత్రం 15 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సభా ప్రాంగణాన్ని 24 గ్యాలరీలుగా విభజించారు. వేదికపైన ఉన్నవారిని దూరం నుంచి చూసేందుకు 50 ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేశారు. వేదిక చివరివైపు రక్తదాన, వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. వేదిక చుట్టుపక్కల అత్యవసర ద్వారాలున్నాయి. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. అనంతరం ప్రతినిధుల సభ వద్ద ఉన్న బసకు చేరుకుంటారు. సాయంత్రం మహానాడు బహిరంగ సభకు వెళ్తారు.

50 వేల మందికి బస..

మహానాడుకు వచ్చే ముఖ్యఅతిథులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులకు ప్రాధాన్యక్రమంలో గదులు కేటాయించి సుమారు 50 వేలమందికి వివిధ ప్రాంతాల్లో వసతి కల్పించారు. 32మంది పొలిట్‌బ్యూరో సభ్యులకు తొలి ప్రాధాన్యమిచ్చారు. తర్వాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, నియోజకవర్గాల బాధ్యులకు సుమారు 300, ఎన్‌ఆర్‌ఐలు 200 మందికి ప్రాధాన్యం కల్పించారు. తెదేపా అనుబంధ విభాగాల నాయకులకు అవకాశం ఉన్నమేరకు వసతి కల్పించారు. వంటకాలు సిద్ధం చేసేందుకు సుమారు 1,500 మంది రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా వంటకాలు సిద్ధం చేయనున్నారు.

ప్రాంగణంలోనే చంద్రబాబు, లోకేశ్‌ బస

మహానాడుకు వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలు బస చేయడానికి వివిధ హోటళ్లు, ఇతరచోట్ల ఏర్పాట్లు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మాత్రం మహానాడు ప్రాంగణంలోనే బస్సులో బస చేయనున్నారు. శుక్రవారం సాయంత్రమే వారు రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. మహానాడు ముగిసేవరకూ వారు ఆ ప్రాంగణంలోనే బసచేస్తారు.


తెదేపాకు రూ.కోటి విరాళం

కె.కోటపాడు, న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధికి అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి చెందిన నాయకుడు పైలా ప్రసాదరావు రూ.కోటి చెక్కును పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు గురువారం రాత్రి అమరావతిలో అందజేశారు. చెక్కుతో జ్ఞాపిక ఇచ్చినట్లు ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

రూ.27 లక్షల చెక్కు అందజేత

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర రూ.27 లక్షల చెక్కును చంద్రబాబుకు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం అందజేశారు. గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు రూ.27 లక్షలు అందజేసినట్లు కోవెలమూడి తెలిపారు.


మహానాడు వేదిక నుంచే మేనిఫెస్టో

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం 2020, 2021 సంవత్సరాల్లో కొవిడ్‌ కారణంగా జూమ్‌ ద్వారా మహానాడు నిర్వహించారు. ఆ తర్వాత గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు అపూర్వ స్పందన లభించింది. ఆ వేడుక విజయవంతం కావటం పార్టీకి గొప్ప ఊపు తీసుకొచ్చింది. అప్పటితో పోలిస్తే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరుగుతోంది. తెదేపాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం మోగించనుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఎన్నడూలేని విధంగా ఈసారి మహానాడులోనే పార్టీ ఎన్నికల ప్రణాళిక (తొలి మేనిఫెస్టో)ను ప్రకటించనుంది. మహిళలు, యవకులు, రైతులకు అధిక ప్రయోజనం కలిగే అంశాలతో ఈ తొలి మేనిఫెస్టో విడుదల చేయనుంది.


ఆంధ్రప్రదేశ్‌వి 15... తెలంగాణవి 6 తీర్మానాలు

తొలిరోజైన శనివారం ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేశాక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జగన్‌ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, సహజవనరుల దోపిడీ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం, తెదేపా ప్రభుత్వ హయాంలో అమలుచేసిన సంక్షేమపథకాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన తీరు, జగన్‌ ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ధరల పెరుగుదల, పన్నులు, ఛార్జీల బాదుడు తదితర 15 అంశాలపై సభలో తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించనున్నారు. తెలంగాణవి ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని